గెలుపు కోసం కుతంత్రం
● ప్రభుత్వంపై ఉద్యోగులు, నిరుద్యోగుల్లో వ్యతిరేకత ● నీటిమూటగా మెగా డీఎస్సీ హామీ ● నిరుద్యోగులకు భృతి హామీ హుళక్కి ● ఉద్యోగులకిచ్చిన హామీలను తుంగలో తొక్కిన వైనం ● కూటమి పార్టీల్లో విభేదాలు ● ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్లడిగేందుకు జంకుతున్న ఎమ్మెల్యేలు ● మంత్రి గొట్టిపాటికి బాధ్యతల అప్పగింత
సారక్షి ప్రతినిధి, బాపట్ల: ఈనెల 27న జరగనున్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పచ్చ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రారంభంలో ఎన్నిక ఏకపక్షమని ధీమాగా చెప్పినా, చివరకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా కనపడుతోంది. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు పీడీఫ్‌ఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు గట్టిపోటీ ఇస్తూ చెమటలు పట్టిస్తున్నారు. ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులలో ఉన్న వ్యతిరేకతకు తోడు కూటమి పార్టీల్లోని అసంతృప్తులతో పీడీఎఫ్ అభ్యర్థికి కలిసివచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని నిఘా విభాగం ప్రభుత్వానికి చేరవేసింది. దీంతో బెంబేలెత్తిన ముఖ్యమంత్రి చంద్రబాబు, చినబాబు అప్రమత్తమయ్యారు.
రంగంలోకి రాబిన్‌సింగ్
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో పని చేసిన రాబిన్‌సింగ్ టీంను రంగంలోకి దించారు. పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, బెదింపులు, ప్రలోభాల పర్వానికి తెరతీయకపోతే సీటు గల్లంతేనని ఆయన నివేదించినట్లు తెలుస్తోంది. దీంతో చినబాబు లోకేష్ సీన్‌లోకి వచ్చారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పార్థసారథికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. తేడా జరిగితే పరువు మొత్తం గంగలో కలుస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఆలపాటి విజయానికి పనిచేయకపోతే ఎమ్మెల్యేల స్థానంలో అధిష్టానం ఇన్‌చార్జ్‌లను నియమిస్తుందని మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు ప్రచారం ఉంది.
మంత్రి ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం
చినబాబు ఉత్తర్వులు అందుకున్న మంత్రి గొట్టిపాటి, ఇన్‌చార్జ్ మంత్రి పార్థసారథి రేపల్లె, వేమూరు, బాపట్ల నేతలతోపాటు ఉమ్మడి గుంటూరు నేతలతోనూ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి, చిన్న మంత్రి సందేశాన్ని ఎమ్మెల్యేల చెవిన వేశారు. అయితే ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులతోపాటు సొంత పార్టీ కేడర్‌లోనూ వ్యతిరేకత ఉందని, వారిని పని చేయమంటే వినే పరిస్థితి లేదని పలువురు ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి తెచ్చినట్లు సమాచారం. పదవులు ఇవ్వకపోవడంతోపాటు అధికారంలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆగ్రహంతో ఉన్న జనసేన, బీజేపీ నేతలు సైతం సహకరించే పరిస్థితి లేదని కొందరు నేతలు వివరించినట్లు తెలుస్తోంది. ఓటర్లకు ఎంత రేటు పెడితే వర్కవుట్ అవుతుందన్న దానిపైనా చర్చ జరిగింది. వెయ్యి రూపాయలు సరిపోతుందని కొందరు, కాదు రూ. 2 వేలు అంతకన్నా ఎక్కువ ఇవ్వాల్సిందేనని మరికొందరు ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
కూటమికి పట్టభద్ర ఎమ్మెల్సీ గండం
పచ్చ పార్టీలో
ఇంటిపోరు
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎందుకు?
తొమ్మిది నెలల కూటమి పాలనపై అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన వందకు పైగా హామీలను నెరవేర్చక సర్కార్ వంచించింది. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చక ప్రజలను వంచించారు. పైగా విద్యుత్, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, ఊరూరా బెల్టుషాపుల ఏర్పాటు, వలంటీర్లు, యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతోపాటు కక్షగట్టి చిరుద్యోగులను తొలగించారు. సచివాలయ ఉద్యోగులను గాలిలో దీపంలా ఉంచారు. మెగా డీఎస్సీ పేరుచెప్పి హడావుడి చేసినా ఇంతవరకూ అతీగతీ లేదు. నిరుద్యోగులకు భృతి ఇస్తామన్న హామీ నీటి మూటే అయింది. దీంతో చదువుకున్న యువత కూటమి సర్కార్ తీరుపై మరింత ఆగ్రహంతో ఉంది. పట్టభద్రుల ఎన్నికల్లో ఇది పీడీఎఫ్ కు కలిసి రానుందని అంచనా.
పచ్చపార్టీలో ఎమ్మెల్యేలు మొదలు కేడర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలపై వ్యతిరేకత కనపడుతోంది. అధికారం రాగానే ఎమ్మెల్యేలు అక్రమార్జనే ధ్యేయంగా వ్యాపారానికి తెరలేపారు. కనపడ్డ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని పేదల కడుపుకొట్టి నెలవారీ అమ్ముకుంటున్నారు. పార్టీ విజయం కోసం పనిచేసిన ముఖ్యనేతలు, క్రియాశీలక కార్యకర్తలకు పైసా రాబడిలేదు. నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశించిన వారికి అవి దక్కలేదు. కష్టపడి తాము పనిచేస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికారాన్ని అనుభవిస్తున్నారని పచ్చనేతల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. ఇది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశమున్నట్లు పరిశీలకుల అంచనా.
గెలుపు కోసం కుతంత్రం
Comments
Please login to add a commentAdd a comment