‘విశిష్ట గుర్తింపు’
అన్నదాతకు
● ఆధార్ తరహాలో రైతులకు భూ ఆధార్ ● 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ ● రిజిస్ట్రేషన్ అయితేనే ప్రభుత్వ పథకాలు
కొరిటెపాడు(గుంటూరు): ఆధార్ తరహాలో రైతులకు భూ ఆధార్ కార్డులను అధికారులు జారీ చేస్తున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ పేరిట చేపడుతున్న ఈ ప్రక్రియలో ప్రత్యేక యాప్‌లో సొంత భూమి కలిగిన ప్రతి రైతు వివరాలు నమోదు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ అవుతుంది. ఇలా రిజిస్ట్రేషన్ అయితేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వ్యవసాయ పథకాలు, రాయితీలు, సాగు యంత్రాలు, వ్యవసాయ పరికరాలు అందిస్తారు. ఈ నేపథ్యంలో రైతుల నమోదు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. అన్నదాతలు కూడా రిజిస్ట్రేషన్‌కు రైతు సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. గుంటూరు జిల్లాలో సుమారు 1.30 లక్షల మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు 70,478 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
నమోదు ఇలా..
రైతులంతా భూ వివరాలు కలిగిన పట్టాదారు పాసుపుస్తకం, 1–బీ అడంగల్, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో పాటు ఆధార్ కార్డుకు లింక్ చేసిన ఫోన్ నంబర్‌ను గ్రామంలోని సచివాలయానికి అనుబంధంగా ఉన్న రైతు సేవా కేంద్రానికి తీసుకుని వెళ్ళాలి. ఆర్‌ఎస్‌కేలోని గ్రామ వ్యవసాయ సహాయకులు(వీఏఏ) సంబంధిత పోర్టల్‌లో ఫార్మర్ రిజిస్ట్రీ చేస్తారు. ఈ క్రమంలో మన ఫోన్ నంబర్‌కు వచ్చే మూడు ఓటీపీలు చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ విజయవంతమైనట్లు ఫోన్‌కు సందేశం వస్తుంది. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇలా నమోదు చేసుకుంటే ప్రభుత్వ పథకాలు పక్కాగా వర్తిస్తాయి. ఇక నుంచి తమకు ఈ పథకం రాలేదు.. ఆ పథకం రాలేదు.. పీఎం కిసాన్ డబ్బులు అందలేదన్న ఫిర్యాదులు రైతుల నుంచి ఉండవని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
ఇలా భద్రపరచాలి..
నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత రైతులకు జారీ చేసిన విశిష్ట గుర్తింపు సంఖ్యను ఫోన్‌లో కానీ, పట్టాదారు పాసుపుస్తకంపై కానీ రాసుకుని భద్రపరుచుకోవాలి. వీలైతే ఈ సంఖ్యను గుర్తించుకుంటే చాలా వరకు మంచిది. ఒకవేళ గుర్తింపు సంఖ్య మర్చిపోయినా, పోయినా మళ్లీ రైతు సేవా కేంద్రానికి వెళ్లి, రైతు తమ భూ వివరాలు ఇచ్చి తెలుసుకోవచ్చు.
రైతులకు ప్రయోజనకరం
ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతులకు జారీ చేస్తున్న విశిష్ట గుర్తింపు సంఖ్య ఎంతో ప్రయోజనకరం. ఆధార్ నంబర్ బట్టి మన వివరాలు ఏ విధంగా వస్తాయో అలాగే రైతుల 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా రైతు, ఆయన చేస్తున్న పంటల సాగు వివరాలు, ఆయన పొందుతున్న వ్యవసాయ పథకాలు అన్నీ తెలుస్తాయి. ఏ పథకానికి రైతు అర్హుడో కూడా తెలుస్తుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్‌ఎస్‌కేల్లో నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటి వరకు 70,478 మంది రైతులు నమోదు చేయించుకున్నారు.
–నున్న వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి, గుంటూరు జిల్లా
‘విశిష్ట గుర్తింపు’
Comments
Please login to add a commentAdd a comment