● యూజీసీ కమిటీకి తెనాలి బిడ్డ సారథ్యం ● జాతీయ భద్రత అధ్యయాలపై సరికొత్త కోర్సు రూపకల్పనకు కృషి ● డాక్టర్ రమేష్ కన్నెగంటి విజయప్రస్థానం
తెనాలి: చదువుల్లో ఒకనాటి డ్రాపవుట్ కుర్రోడు...ఇప్పుడు ఏకంగా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆధ్వర్యంలోని కమిటీకి సారథి అయ్యారు. అదికూడా జాతీయ భద్రత అధ్యయనాలకు సంబంధించిన సరికొత్త ‘మ్యాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సు’ రూపకల్పన కోసం. ప్రసిద్ధ యూనివర్శిటీల ప్రొఫెసర్లు, వైస్‌ఛాన్సలర్ సభ్యులుగా గల కమిటీకి ఆయన నాయకత్వం వహిస్తుండటం మరింత విశేషం.
చదువు విలువ తెలుసుకుని..
తెనాలి బిడ్డ డాక్టర్ రమేష్ కన్నెగంటి. పుల్లరి ఉద్యమ యోధుడు కన్నెగంటి హనుమంతు మునిమనవడు. ఇంటర్ ఫెయిలయ్యారు. చదువు మానేశారు. తర్వాత విద్య విలువ తెలుసుకుని మళ్లీ పుస్తకం పట్టారు. బీఏ వరకు ఇక్కడే చదివారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్‌లో పీజీ అనంతరం, న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ)లో ‘యూఎస్–ఆస్ట్రేలియా సెక్యూరిటీ రిలేషన్స్’పై ఎంఫిల్ చేశారు. 2000–01లో ‘మిస్టర్ జేఎన్‌యూ’ టైటిల్‌ను ‘ద్రోణాచార్య’ గురుచరణ్‌సింగ్ చేతులు మీదుగా అందుకున్నారు. 2002–03లో ఇజ్రాయెల్‌లోని హిబ్రూ యూనివర్శిటీలో ‘ఇంటర్నేషనల్ రిలేషన్స్’ చదివారు. జేఎన్‌యూలో 2006లో ‘యూఎస్–ఇజ్రాయెల్ సెక్యూరిటీ రిలేషన్స్ ఇన్ ది పోస్ట్ కోల్డ్‌వార్ ఎరా’పై పీహెచ్‌డీ చేశారు. తర్వాత ఇజ్రాయెల్‌లోని బార్–ఇలాన్ యూనివర్శిటీలో ‘యూఎస్–ఇజ్రాయెల్–ఇండియా స్ట్రాటెజిక్ రిలేషన్స్’ (టె ర్రరిజాన్ని ఓడించటానికి మూడు దేశాల త్రిముఖ వ్యూహం’పై పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్ చేశారు.
బాంబు పేలుళ్ల నేపథ్యంలో జాతీయ భద్రతపై దృష్టి
దేశంలో జరిగిన ఉగ్రవాద బాంబు పేలుళ్ల నేపథ్యంలో డాక్టర్ రమేష్ దృష్టి మానవ భద్రతపైకి మళ్లింది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఉగ్రవాదం, వ్రవాదం, పేదరికం, నిరక్షరాస్యత, వెనుకబాటుతనాన్ని టెక్నాలజీ సాయంతో ఎదుర్కోవటంపై అధ్యయనం, పరిశోధన కొనసాగించారు. ఆ క్రమంలోనే 2013లో హైదరాబాద్‌లో మానవ రక్షణ అధ్యయన సంస్థ (సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్)ను కొందరు స్నేహితులు, సంస్థల సహకారంతో ఆరంభించారు. పన్నెండేళ్లలోనే ఆ సంస్థ దేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాలపై ‘థింక్ ట్యాంక్’గా పలు విజయాలను సాధించింది. ఐఐటీ, నల్సర్ లా యూనివర్శిటీతో సహా పలు యూనివర్శిటీలు, ఆంధ్ర, తెలంగాణ పోలీసులతో సంస్థ ఎంఓయూలను కుదుర్చుకుంది. సంస్థ 12వ వార్షికోత్సవం ఈనెల 22న జరుపుకున్నారు.
స్మార్ట్ పోలీసింగ్‌కు శ్రీకారం
టెక్నాలజీ సాయంతో మానవభద్రత అంశంపై పలు ఉన్నత విద్యాసంస్థలు, ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్న రమేష్, కృత్రిమ మేధతో స్మార్ట్ పోలీసింగ్, ఓడరేవుల రక్షణపై సరికొత్త ప్రోగ్రామ్‌లను రూపొందించారు. ఫలితంగా అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఆయనకు ఆహ్వానం లభించింది. యూనివర్శిటీ హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్ (హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో గతేడాది అక్టోబరులో జరిగిన ‘మానవ–కేంద్రీకృత కృత్రిమ మేధస్సు’ శిక్షణకు డాక్టర్ రమేష్ హాజరయ్యారు. చైనా ప్రాబల్యం నుంచి హిందూ, పసిఫిక్ మహాసముద్రాల జలాలను కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీతో ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై వివిధ దేశాల సీనియర్ మిలటరీ అధికారుల చర్చలకూ రమేష్ సంస్థ వేదికై ంది.
తాజాగా యూజీసీకి..
యూజీసీ సారథిగా తాజాగా రమేష్ ఎంపికయ్యారు. జాతీయ విద్యావిధానం 2020 ప్రకారం సిలబస్, కోర్సు కంటెంట్‌ను ఖరారు చేస్తారు. క్రెడిట్‌ల సంఖ్య, కోర్సు కోసం మొత్తం మాడ్యూళ్ల సంఖ్య, పరిశ్రమల లింకేజ్‌లు ‘స్వయం’ ప్లాట్‌పామ్‌పై కోర్సును సకాలంలో అభివృద్ధి చేసి, అందించటం యూజీసీ బాధ్యత. జాతీయ భద్రతపై ఓ కోర్సు ఉంటుందని డాక్టర్ రమేష్ ‘సాక్షి’కి వెల్లడించారు. భద్రతా అంశాన్ని పాఠశాల విద్య నుంచే భాగం చేయాలని పేర్కొన్నారు.
నాడు డ్రాపవుట్.. నేడు పట్ట‘భద్రత’పై పట్టు
నాడు డ్రాపవుట్.. నేడు పట్ట‘భద్రత’పై పట్టు