వైద్యసేవ ఉద్యోగులు విధుల బహిష్కరణ
గుంటూరు మెడికల్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం గుంటూరులో ఎన్టీఆర్ వైద్య సేవ క్షేత్రస్థాయి ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ప్రభుత్వ శాఖ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయిప్ యూనియన్ తరపున ఈ నిరసన చేపట్టారు. యూనియన్ నాయకులు ఏపీ జేఏసీ అధ్యక్షురాలు శివకుమారి, కార్యదర్శి ప్రత్యూష, జిల్లా అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
నేడు గుంటూరులో న్యాయవాదులు విధుల బహిష్కరణ
గుంటూరు లీగల్: రంగారెడ్డి జిల్లా కోర్టులో ఇ.ఇజ్రాయిల్ అనే న్యాయవాదిని దారుణంగా హత్య చేసినందుకు నిరసనగా గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాసు వెంకటరెడ్డి సోమవారం పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి దారుణమైన సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.
క్షయ వ్యాధిపై ఫార్మసీ
విద్యార్థుల ప్రచారం
తెనాలి: అంతర్జాతీయ క్షయ వ్యాధి దినం సందర్భంగా స్థానిక ఏఎస్‌ఎన్ ఫార్మసీ కాలేజి ఐపీఏ–ఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాల విద్యార్థులు సోమవారం ప్రచారం నిర్వహించారు. క్షయ వ్యాధిపై అవగాహన ప్రదర్శన చేశారు. క్షయ లక్షణాలు, నివారణ, సమయోచిత చికిత్స వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వ్యాధిపై అవగాహన కల్పించారు. అవసరమైన జాగ్రత్తతలను వివరించారు. ఏపీటీఐ–ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్. కె.వెంకటరమణ, ప్రభుత్వ వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, ఐపీఏ–ఎస్‌ఎఫ్ మెంటర్స్ జి.నందగోపాలకృష్ణ, పి.భార్గవి, ఎన్‌ఎస్‌ఎస్–1,2 విభాగాల ప్రోగ్రాం అధికారులు టి.జ్యోతిబసు, కె.కళ్యాణ చక్రవర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రుక్మిణీ అలంకారంలో
నృసింహుడు
మంగళగిరి: మంగళాద్రిలోని లక్ష్మీ నృసింహస్వామి సోమవారం రాత్రి రుక్మిణీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆస్థాన అలంకారోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో ఏ రామకోటిరెడ్డి ఉత్సవాన్ని పర్యవేక్షించారు. మంగళవారం స్వామి స్థంభోద్భవం అలంకారంలో దర్శనమివ్వనున్నారు.
వైద్యసేవ ఉద్యోగులు విధుల బహిష్కరణ