
అవకతవకలు, అక్రమ రవాణాపై విచారణ చేపట్టాలి
నరసరావుపేట రూరల్: అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జామాయిల్ వేలంలో అవకతవకలు, అక్రమ రవాణాపై విచారణ చేపట్టాలని సామాజిక వన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డె హనుమారెడ్డి డిమాండ్ చేశారు. జామాయిల్ వేలంలో అక్రమాలు, అక్రమంగా కర్రను తరలించడాన్ని నిరసిస్తూ సామాజిక వన రైతుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా అటవీ శాఖ కార్యాయలం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల పరిధిలో 218 వన సంరక్షణ సమితుల ఆధ్వర్యంలో పెంచిన జామాయిల్, కర్రకు గత ఏడాది నవంబర్‌లో వేలం నిర్వహించారని తెలిపారు. కర్ర నరుకుడు ప్రారంభించిన వ్యాపారులు అక్రమంగా రవాణా చేస్తూ కంపెనీలకు తరలిస్తున్నారని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పెంచిన జామాయిల్ కర్రకు వేలం నిర్వహించడం ద్వారా రైతులు టన్నుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు నష్టపోతున్నారని తెలిపారు. అటవీ శాఖ భూముల్లో రైతులకు నష్టం కలిగించే జామాయిల్ పంటను నిషేదించాలని కోరారు. ఈ భూముల్లో పండ్ల తోటల పెంపకం చేయడం ద్వారా రైతులకు, అటవీ శాఖకు ఆదాయం లభిస్తుందన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ గిట్టుబాటు ధరల లేక రైతులు నష్టాల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు వదిలేసి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. తాళ్లూరి బాబురావు, కె.వీరారెడ్డి, కొల్లి లింగారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతివర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.