
అగ్నిప్రమాదాల నివారణపై మాక్‌డ్రిల్
గుంటూరు ఎడ్యుకేషన్: అమరావతిరోడ్డులోని నెక్ట్స్‌జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో గురువారం అగ్ని ప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాకి డ్రిల్‌కు రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసుల డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అగ్ని ప్రమాదాలను నివారించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి, ప్రాణాలను రక్షించే విధానాలను అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై కరపత్రాలను మాదిరెడ్డి ప్రతాప్ విడుదల చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన డీజీ ప్రతాప్ వారితో కలిసి ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు కె. శ్రీకాంత్‌బాబు, డాక్టర్ కె.శ్రీవిద్య, అగ్నిమాపక శాఖాధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నేటి నుంచి మిర్చి యార్డుకు వరుస సెలవులు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. శుక్రవారం గుడ్‌ఫ్రైడే, శని, ఆదివారాలు సాధారణ సెలవులు ఇచ్చినట్టు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజుల్లో రైతులు తమ సరుకును యార్డుకు తీసుకురావద్దని కోరారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సరుకును యార్డులోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. సోమవారం నుంచి యథావిధిగా క్రయవిక్రయాలు కొనసాగుతాయని వివరించారు.
1,58,818 బస్తాలు మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 1,39,333 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,58,818 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.13,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.9,800 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 57,411 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.
నిలిచిన మట్టి తవ్వకాలు
తాడికొండ: తాడికొండ మండలం పాములపాడు గ్రామంలో తెలుగు తమ్ముళ్లు అక్రమంగా చేపట్టిన మట్టి తవ్వకాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. గురువారం ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అప్రమత్తమైన అధికారులు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తవ్వకాలు నిలుపుదల చేయించారు. చెరువు బలోపేతం పేరుతో జరుగుతున్న దందాకు బ్రేక్ పడడంతో ‘సాక్షి’ చొరవను పలువురు గ్రామస్తులు అభినందించారు.
హనుమ ఆలయంలో అవినీతిపై అధికారులు సీరియస్ !
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): గుంటూరు నాజ్ సెంటర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న అవినీతి తంతుపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ‘సాక్షి’ దినపత్రిక జిల్లా పేజీలో గురువారం హనుమా.. అవినీతి కనుమా శీర్షికన ప్రచురించిన కథనానికి దేవదాయ, ధర్మదాయ శాఖ అధికారులు స్పందించినట్టు తెలుస్తోంది. ఆలయ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్న ఆలయ ప్రధాన అర్చకుడు, సిబ్బంది, ఆలయ దుకారణదారుడి అంశంపై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. దీనిపై దేవదాయశాఖ ఆర్జేసీ స్థాయి అధికారి విచారణ చేయనున్నారని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు.

అగ్నిప్రమాదాల నివారణపై మాక్‌డ్రిల్