
ముగ్గురు గంజాయి విక్రేతలు అరెస్ట్
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం, రాధారంగా నగర్, కొలనుకొండ ప్రాంతాల్లో నివాసముంటూ గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను తాడేపల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈసందర్భంగా సీఐ కల్యాణ్‌రాజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్, నార్త్‌జోన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు గంజాయి విక్రయాలు, కొనుగోలుపై దృష్టి సారించామని, వడ్డేశ్వరం, రాధారంగానగర్‌కు చెందిన ముత్యాల మనోజ్ కుమార్ ఏజన్సీ ఏరియాల నుంచి గంజాయి తీసుకువచ్చి వడ్డేశ్వరంలో నివాసముంటున్న షేక్ అమిద్ బాషా, కొలనుకొండకు చెందిన ప్రవీణ్‌తో కలసి గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నారనే సమచారం వచ్చిందన్నారు. దీంతో వారిపై నిఘా ఏర్పాటు చేయగా ఎయిమ్స్ రోడ్‌లోని బ్రహ్మానందపురంకు వెళ్లే రహదారిలో ఈ ముగ్గురు గంజాయి అమ్మేందుకు ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద వున్న 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచినట్లు ఆయన తెలిపారు. గంజాయి విక్రయించే, సేవించే వారి సమాచారం పోలీసులకు తెలియజేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
మూడు కిలోల గంజాయి స్వాధీనం

ముగ్గురు గంజాయి విక్రేతలు అరెస్ట్