
ముగిసిన టెన్త్ పరీక్షలు
● 3 నుంచి స్పాట్ వాల్యూయేషన్
● గుంటూరు స్టాల్ బాలికోన్నత
పాఠశాలలో మూల్యాంకనం
● ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. మంగళవారం సోషల్ స్టడీస్ పరీక్ష రాసిన విద్యార్థులు పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వస్తూనే కేరింతలు కొట్టారు. పరీక్షలు ముగిసిన ఆనందంలో మునిగితేలారు. మంగళవారం జరిగిన సోషల్ స్టడీస్ పరీక్షను జిల్లా వ్యాప్తంగా 150 కేంద్రాల పరిధిలో 27,372 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 27,222 మంది హాజరయ్యారు. డీఈఓ సీవీ రేణుక,, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ వెంకట్‌రెడ్డి, ఫ్లయింగ్ స్క్వాడ్ల ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు జరిగాయి. జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు డీఈవో సీవీ రేణుక ప్రకటించారు. జిల్లాలో ఒక్క మాల్ ప్రాక్టీసు కేసూ నమోదు కాలేదని చెప్పారు.
ఈనెల 3 నుంచి స్పాట్ వాల్యూయేషన్
ఈనెల 3వ తేదీ గుంటూరు నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో 3వ తేదీ నుంచి వారం రోజుల పాటు స్పాట్ వాల్యూయేషన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మూల్యాంకన విధుల్లో భాగంగా చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్స్ విధులకు జిల్లా వ్యాప్తంగా 1,200 మంది ఉపాధ్యాయులను నియమించారు. గతేడాది పెదకాకానిలోని సెయింట్ జోసఫ్ హైస్కూల్లో నిర్వహించిన స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు తిరిగి స్టాల్ బాలికోన్నత పాఠశాలకు మార్చారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు స్పాట్ వాల్యూయేషన్‌కు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని డీఈవో సీవీ రేణుక తెలిపారు. విధులకు నియమితులైన ఉపాధ్యాయులందరూ గురువారం స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.