
అలరించిన శ్రీరామ గానా మృతం
నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళా వేదికపై వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భక్త నారద గాన సభ ఆధ్వర్యంలో శనివారం శ్రీరామ గానా మృతం నిర్వహించారు. కార్యక్రమాన్ని విశ్రాంత అదనపు ఎస్పీ కాళహస్తి సత్యనారాయణ, సంగీత విద్వాంసులు కె.వి.బ్రహ్మానందం, ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్.మస్తానయ్య జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య పాహి రామప్రభో, రామచంద్రుడితు రఘువీరుడు, ననుబ్రోవమని చెప్పవే, సీతా కళ్యాణ వైభోగమే అంటూ పలు భక్తి గీతాలను రమ్యంగా ఆలపించారు. సభికులను అలరించాయి. వయోలిన్‌పై పాలపర్తి ఆంజనేయశాస్త్రి, మృదంగంపై కాకరపర్తి జగన్మోహిని వాయిద్య సహకారాన్ని అందించారు. అనంతరం కళాకారులను సత్కరించారు.
కుటుంబ సభ్యుల చెంతకు చేరిన వృద్ధుడు
తాడేపల్లి రూరల్: ఎట్టకేలకు కుటుంబ సభ్యుల చెంతకు వృద్ధుడు చేరాడు. ప్రకాశం జిల్లాకు చెందిన వృద్ధుడు దారితప్పి తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లికి చేరుకోవడంతో స్థానికులు ఆశ్రయమిచ్చిన సంగతి తెలిసిందే. తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య వృద్ధుడిని శుక్రవారం తాడేపల్లి ఆశ్రమానికి తరలించి, కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకున్నారు. కుంచనపల్లిలో ఉన్నారని సిబ్బంది ద్వారా సమాచారం రావడంతో శనివారం వారిని పిలిపించి అప్పగించారు. దీంతో వృద్ధుడి కుటుంబ సభ్యులు తహసీల్దార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
నేలకొరిగిన నాలుగు
విద్యుత్ స్తంభాలు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు నగరంలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి అమరావతి రోడ్, ఆంజనేయస్వామి గుడి వద్ద వీధి లైట్ల కోసం వేసిన నాలుగు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. స్థానికులు మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో తక్షణమే సరఫరా నిలిపివేశారు. స్తంభాలు కూలడంతో అమరావతి రోడ్‌లో ట్రాఫిక్‌కు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సంబంధిత అధికారులు అప్రమత్తమై ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోటేశ్వరరావు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది స్తంభాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు.
వక్ఫ్ సవరణ బిల్లు
రాజ్యాంగ విరుద్ధం
వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు పీఎస్ ఖాన్
వినుకొండ: వక్ఫ్ సవరణ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు పీఎస్ ఖాన్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు, జమైత్ – ఉల్ – ఉలేమా, జమైత్ ఇస్లాం–ఎ–హింద్ సహా పలు మైనార్టీ సంస్థలు అనేక అభ్యంతరాలను వ్యక్తం చేశాయన్నారు. దేశంలో 14.6 శాతం ఉన్న ముస్లింల అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఆర్టికల్ 14, 25, 26లను ఉల్లంఘిస్తుందని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణ కలెక్టర్లకు అప్పగించడం, వక్ఫ్‌బోర్డులో అన్యమత సభ్యులను నియమించడం, వక్ఫ్ ఆస్తులు 12 ఏళ్లుగా ఎవరి అధీనంలో ఉంటే వారివే అనడం, 300 ఏళ్ల క్రితం నాటి ఆస్తులకు ఇప్పుడు డాక్యుమెంట్లు అడగడం.. ఇవన్నీ ముస్లింల మనోభావాలను దెబ్బతీసే వ్యతిరేక చర్యలు అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ ఈ బిల్లును వ్యతిరేకించిందని గుర్తు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన చంద్రబాబు ఒక ముస్లిం ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. కౌన్సిలర్లు గౌస్‌బాషా, షేక్ రఫీ, మైనార్టీ నాయకులు హఫీజ్, గౌస్‌బాషా, హిప్పీ, జాని, అయాజ్, అమీర్, రబ్బానీ పాల్గొన్నారు.

అలరించిన శ్రీరామ గానా మృతం

అలరించిన శ్రీరామ గానా మృతం