
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరంగిపురానికి చెందిన సందీప్ (25) పెదపలకలూరు మీదుగా గుంటూరు వెళుతున్నాడు. పెదపలకలూరు శివారుల్లోని జెఎల్‌ఈ సినిమాస్ సమీపంలో ఆటో ఢీకొనటంతో తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానికులు గమనించి అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు.
కారు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ కార్యకర్త మృతి
తాడికొండ: ప్రమాదవశాత్తు కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టడంతో వైఎస్సార్ సీపీ సీనియర్ కార్యకర్త లంకా సుభానీ మృతి చెందిన ఘటన తుళ్ళూరు మండలం దొండపాడు గ్రామ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన లంకా సుభానీ(38) ఫార్చూనర్ కారులో వెళ్తుండగా దొండపాడు సీడ్ యాక్సిస్ రోడ్డుపై కారు అదుపుతప్పి కాలువలోకి బోల్తా కొట్టింది. ఘటనలో లంకా సుభానీ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తుళ్ళూరు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సుభానీ అకాల మృతి పట్ల వైఎస్సార్‌సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు(డైమండ్ బాబు) ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుభానీ ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
కోదండ రామాలయంలో చోరీ
తాళాలు పగులగొట్టి హుండీలో నగదు తస్కరణ
మాచర్ల రూరల్: నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి పక్కనే ఉండే కోదండ రామాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి, హుండీలో నగదు చోరీకి పాల్పడిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలో శ్రీ కోదండ రామాలయంలోని దేవాలయ ప్రాంగణంలో ఉత్తర ద్వారానికి గొలుసులతో తాళం వేసి ఉంటుంది. ఇనుపరాడ్డుతో ఆ తాళం బద్దలు కొట్టిన దొంగలు లోపలికి ప్రవేశించి, హుండీ పగులకొట్టి నగదును దోచుకొని పోయారు. దేవాలయ కమిటీ అధ్యక్షుడు బచ్చు రామారావు ఆదివారం తెల్లవారుజామున నీటి మోటారు వేసేందుకు దేవాలయంలోకి ప్రవేశించి చూడగా, హుండీ తాళాలు పగలకొట్టి కనిపించాయి. ఆయన వెంటనే పట్టణ పోలీసులకు సమాచారమందించారు. సీఐ పచ్చిపాళ్ల ప్రభాకర్‌రావు తమ సిబ్బందితో దేవాలయానికి చేరుకొని సంఘటన జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించి పలు వివరాలు సేకరించారు.
గర్భగుడి తలుపు తెరిచేందుకు విఫలయత్నం..
ఇటీవల జరిగిన శ్రీరామనవమి సందర్భంగా రూ. 20లక్షల విలువైన ఆభరణాలు ఆలయంలోని దేవతా మూర్తులకు అలంకరించియున్నాయి. గర్భగుడి తలుపు తీసేందుకు యత్నించిన దుండగుడు విఫలమయ్యాడు. తలుపు తెరుచుకొని ఉంటే ఆభరణాలు కూడా చోరీకి గురయ్యేవి. ఇటీవల కొన్ని రోజుల క్రితం పాత మాచర్లలోని వీరాంజనేయ స్వామి దేవాలయంలోనూ హుండీని పగుల కొట్టి నగదును దొంగిలించిన విషయం విధితమే. ఈ సంఘటనలు మరువకముందే పట్టణ నడిబొడ్డులో వందలాది మంది నిత్యం సంచరించే ప్రధాన రహదారి పక్కనే ఉన్న కోదండ రామాలయంలో చోరీ జరగటంపై స్థానికులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై వరుస చోరీల పై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి