
వైవీ సుబ్బారెడ్డిని కలిసిన ముస్లింలు
తాడేపల్లి రూరల్ : రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు వైవీ
సుబ్బారెడ్డిని శనివారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో ముస్లిం పెద్దలు కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, మైనార్టీ నాయకులు మొహమ్మద్ గోరేబాబు ఆధ్వర్యంలో తాడేపల్లిలోని పలువురు ముస్లిం పెద్దలు రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డిని కలిసి వక్ఫ్‌బోర్డు బిల్లును లోక్‌సభ, రాజ్యసభలో ముస్లింలకు అనుకూలంగా వ్యవహరించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించడంపై హర్షం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వక్ఫ్‌బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, దానికి రాష్ట్రంలోని కూటమి సర్కారు వత్తాసు పలుకుతోందని విమర్శించారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు అబ్దుల్ రహీమ్, నూర్ మొహమ్మద్, మొహమ్మద్ అన్వర్, యండి బాబ్జి, సర్దార్, ఇర్ఫాన్, ఖలీల్, బేగ్, షేక్ కరీముల్లా, ఇబ్రహీం, షఫీ, సలీం బాషా, ఖుర్దుస్ తదితరులు పాల్గొన్నారు.
జీజీహెచ్ భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో కొత్తగా నిర్మిస్తున్న రెడంతస్తుల భవన నిర్మాణ పనుల్లో శనివారం ఓ వ్యక్తి పనిచేస్తూ కిందపడి చనిపోయాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రామ్‌పూర్‌సిటీకి చెందిన షేక్ షాకీర్ అలీ (22) కొంతకాలంగా గుంటూరు జీజీహెచ్‌లో ఎంసీహెచ్ భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. సూపర్‌స్పెషాలిటీ భవనంపైన వెల్డింగ్ పనులు చేసేందుకు శనివారం పైఅంతస్తుకు ఎక్కి ప్రమాదవశాత్తూ పై నుంచి కిందపడ్డాడు. తలకు తీవ్రంగా గాయం కావడంతో జీజీహెచ్ వైద్యులు వెంటిలేటర్ పెట్టి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. షాకీర్ అలీ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.