
వైఎస్సార్ సీపీ నిరంతరం ప్రజాపక్షం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): అధికారంలో ఉన్నా.. లేకున్నా.. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ప్రజాపక్షమేనని రాజ్యసభ సభ్యులు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా కొత్త కార్యాలయ ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా వైఎస్సార్ సీపీ జెండాను ఆవిష్కరించిన అనంతరం సర్వమత ప్రార్థనలు జరిపి కార్యాలయాన్ని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తొలుత కాకాని వైజంక్షన్ నుంచి భారీ బైక్ ర్యాలీతో వైవీ సుబ్బారెడ్డికి నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం కోసం సూపర్‌సిక్స్ హామీలను గుప్పించిందని విమర్శించారు. ప్రజలు వాటిని ఎక్కడ అడుగుతారో అని అక్రమ అరెస్టులు, బెదిరింపులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు పెట్టినా.. అక్రమ అరెస్టులు చేసినా.. వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదని, కార్యకర్తలు, నాయకులు కలిసి కట్టుగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నిల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ కొత్తగా నగర కార్యాలయాన్ని ప్రారంభించటం సంతోషదాయకమన్నారు. రాబోయే రోజుల్లో అన్ని డివిజన్‌లు, నగర కమిటీ, అనుబంధ విభాగాల సహకారంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ గుంటూరు, నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ నగర ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాలయాన్ని ప్రారంభించటం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అరాచక పాలనకు వ్యతిరేకంగా కొండంత ధైర్యంతో ముందుకు సాగేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారన్నారు. నూరిఫాతిమా తమకు సోదరిలాంటిందని, అమెకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.
గోవుల మృతిపై విచారణ జరపాలి
అనంతరం మీడియాతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో గోవులు మృతి చెందటం బాధాకరమన్నారు. దీనిపై కచ్చితంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గోశాలలో 1,500పైగా గోవులు ఉండేవని, అనారోగ్యంతో మృతి చెందితే ఆ దారి వేరని, కూటమి ప్రభుత్వం లోపాల వల్ల మరణించడం బాధాకరమన్నారు. వైఎస్సార్ సీపీలో నెంబర్ వన్.. టూ అంటూ ఉండదని.. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్కరం ముందుకు సాగుతామని పేర్కొన్నారు. పార్టీలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డికి కోటరీల గురించి తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీలో ఎవరికీ ప్రాధాన్యం తగ్గించడం, పెంచడం ఉండవని, అప్పజెప్పిన బాధ్యతను అందరూ చిత్తశుద్ధితో చేసుకుంటూ పోవడమేనని పేర్కొన్నారు.
పోరాటానికి వెనుకాడం : నూరిఫాతిమా
ప్రజల పక్షాన పోరాటాలకు వెనుకాడబోమని, వారి సమస్యలపై గొంతెత్తి నినదిస్తామని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా స్పష్టం చేశారు. జగనన్న తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కచ్చితంగా పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకుని వెళ్తామన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిలా చూసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, డెప్యూటీ మేయర్ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, పార్టీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్‌లు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
అధికారం ఉన్నా..
లేకున్నా ప్రజలతోనే ప్రయాణం
రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి
పార్టీ గుంటూరు నగర కార్యాలయం ప్రారంభం