
దోమల నివారణతో వ్యాధుల కట్టడి
డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి
గుంటూరు మెడికల్: దోమకాటుతో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా తదితర వ్యాధులు సోకుతాయని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. దోమల నివారణతో వ్యాధులు కట్టడి చేయవచ్చని చెప్పారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మలేరియా నివారణపై వైద్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మలేరియాపై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ పరస్పర సహకారం, పరిసరాల పరిశుభ్రత, నీటి నిల్వల నివారణ, దోమతెరలు వాడటం, ఫ్రైడే ను డ్రైడే గా పాటించడం ద్వారా దోమకాటు బారిన పడకుండా కాపాడుకోవచ్చని ఆమె సూచించారు. ర్యాలీ డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి ప్రారంభమై, నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ వరకు కొనసాగింది. దోమల నివారణ చర్యలపై సిబ్బంది ప్లకార్డులు చేతపట్టి, నినాదాలు చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఏ. శ్రావణ్ బాబు, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, డాక్టర్ దాసరి శ్రీనివాసులు, డాక్టర్ లక్ష్మానాయక్, జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం, అసిస్టెంట్ మలేరియా అధికారి రాజు నాయక్, సబ్ యూనిట్ ఆఫీసర్లు ఘంటసాల శ్రీనివాసరావు, నరేంద్ర, ప్రశాంత్, ఆరోగ్య విస్తరణ అధికారులు గణేష్, సాంబయ్య, సూపర్‌వైజర్లు సుకుమార్, మల్లికార్జునరావు, వెంకటప్పయ్య, మాస్ మీడియా అధికారి ఎన్. వెంకటేశ్వర్లు, హెల్త్ ఎడ్యుకేటర్ ఇస్మాయిల్, ఏఎన్‌ఎంలు, ఆశాలు, సిబ్బంది పాల్గొన్నారు.