
గండాలయ స్వామి కొండకు పోటెత్తిన భక్తులు
మంగళగిరి: మంగళాద్రి కొండపై వేంచేసి ఉన్న గండాలయ స్వామికి మొక్కితే ఎంతటి గండాన్నైనా గటెక్కిస్తాడని భక్తుల నమ్మకం. అమావాస్య ఆదివారం పూజలు నిర్వహిస్తే భక్తుల కోర్కెలు ఇట్టే తీరుస్తాడని ప్రసిద్ధి. దీంతో ఆదివారం కొండకు భక్తులు పోటెత్తారు. ఉదయం ఐదు గంటల నుంచే కొండకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. గండ దీపం వెలిగించారు. మంగళగిరి తాడేపల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి భక్తుల రాకతో కొండ కిటకిటలాడింది.
బడులు తెరిచే నాటికి
పాఠ్య పుస్తకాలు సిద్ధం
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాలలు తెరిచే నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక తెలిపారు. అమరావతి రోడ్డులోని ప్రభుత్వ పాఠ్య పుస్తక గోదాము నుంచి ఆర్టీసీ బస్సుల్లో మండలాలకు పాఠ్య పుస్తకాలను పంపించే కార్యక్రమాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. డీఈవో మాట్లాడుతూ ముద్రణ సంస్థల నుంచి జిల్లా కేంద్రంలోని పాఠ్య పుస్తక గోదాముకు వచ్చిన పుస్తకాలను మండలాలకు పంపుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా సెమిస్టర్–1లో ఉమ్మడి గుంటూరు జిల్లాకు ఇండెంట్ ప్రకారం 13.24 లక్షల పుస్తకాల్లో ఇప్పటి వరకు 7.50 లక్షల పుస్తకాలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠ్య పుస్తక మేనేజర్ వి. వజ్రబాబు, గుంటూరు ఈస్ట్ ఎంఈవో–1 అబ్దుల్ ఖుద్దూస్, ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం, సిబ్బంది పాల్గొన్నారు.
రాహు కేతు పూజలకు భారీగా భక్తులు
పెదకాకాని: శివాలయంలో అమావాస్య ఆదివారం సందర్భంగా రాహు కేతువులకు పూజలు జరిపించేందుకు అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలోని రాహుకేతువు పూజల్లో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువ జామునే క్యూలైన్లలో బారులు తీరారు. ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం రాహుకాల సమయం వరకు 1,509 టికెట్లు విక్రయించినట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ తెలిపారు. రాహు కేతు పూజల ద్వారా ఆదివారం రూ. 7,54,500 ఆదాయం సమకూరిందన్నారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ పూజలతోపాటు అభిషేక పూజలు, అన్నప్రాసనలు, తలనీలాలు, వాహనపూజలు, అంతరాలయ దర్శనాలు, చెవిపోగులు తదితర ఇతర సేవలు ద్వారా రూ.9,10,000 ఆదాయం వచ్చినట్లు ఉప కమిషనర్ తెలిపారు.
వేసవి విజ్ఞాన తరగతులు బ్రోచర్ ఆవిష్కరణ
గుంటూరువెస్ట్: జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ వేసవి విజ్ఞాన తరగతులు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సోమవారం నుంచి జూన్ 6 వరకు 40 రోజులపాటు వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహిస్తారన్నారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు జరిగే ఈ తరగతులకు తమ పిల్లల్ని తల్లిదండ్రులు పంపాలన్నారు. ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ, ఉప గ్రంథ పాలకురాలు కె.ఝాన్సీ లక్ష్మి, లైబ్రేరియన్స్ ఎన్.నాగిరెడ్డి, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

గండాలయ స్వామి కొండకు పోటెత్తిన భక్తులు