హనమకొండ: నిరుపేద మైనార్టీ (వితంతువులు, ఒంటరి, విడాకులు తీసుకున్నవారు) మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం.. స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇటీవల ‘కేసీఆర్ కా తోఫా ఖవాతీన్ కా భరోసా’(కేసీఆర్ మహిళల కానుక) పేరుతో నూతన పథకం ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా నియోజకవర్గానికి వంద చొప్పున ఉచిత కుట్టుమిషన్లు అందించనుంది.
మైనార్టీలు అధికంగా ఉన్న నియోజకవర్గాలకు అదనంగా మరో వంద మిషన్ల చొప్పున అందించనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 నియోజకవర్గాలకు నియోజకవర్గానికి వంద చొప్పున 12 వందల మందికి కుట్టుమిషన్లు అందజేయనుంది. అలాగే, మైనార్టీలు అధికంగా ఉన్న వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు మరో వంద కుట్టుమిషన్లు పంపిణీ చేయనుంది.
దరఖాస్తులకు నేటితో గడువు పూర్తి..
పథకం ప్రారంభించిన అనంతరం అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆ గడువు నేటితో(గురువారం) ముగియనుంది. అయితే పథకం బాగున్నా సరైనా ప్రచారం కల్పించడం లేదు. దీంతో పథక ఫలాలను అందుకోలేకపోతున్నామని నిరుపేద మైనార్టీ మహిళలు వాపోతున్నారు. దరఖాస్తులను స్థానిక ఎమ్మెల్యే ద్వారా అందజేయాలని మైనార్టీ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నా.. తమకు ఎలాంటి సమాచారం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు వెనక్కి పంపిస్తున్నారు.
కాగా, దరఖాస్తు చేసుకోవడానికి ఆయా జిల్లాలోని మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయాల చుట్టు పేద మైనార్టీ మహిళలు ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం విధించిన గడువును వెంటనే పొడగించాలని మైనార్టీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అయోమయంలో మహిళలు..
‘కేసీఆర్ కా తోఫా ఖవాతీన్ కా భరోసా’ పథకానికి సరైనా ప్రచారం కల్పించక పోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మైనార్టీ మహిళలు దరఖాస్తులు చేసుకోలేదని తెలుస్తోంది. ఈ పథకం స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా అమలు చేయాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేల ద్వారా ఈనెల 20 వతేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి వాటిని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారుల ద్వారా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పథకం గురించి ప్రజాప్రతినిధులకే తెలియకపోవడంతో అర్హులు అయోమయానికి గురవుతున్నారు.
పథకానికి అర్హతలు...
ఈ పథకానికి అత్యంత నిరుపేద మైనార్టీ మహిళలు అర్హులు. (వితంతువులు, ఒంటరి, విడాకులు తీసుకున్న మహిళలు) 21 నుంచి 55 ఏళ్ల వయసు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2లక్షల లోపు ఆదాయ ఉండాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు, 5వ తరగతి విద్యార్హత, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు జతచేసి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
గడువు సమీపిస్తుండడంతో రెండు రోజుల నుంచి ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లిన మైనార్టీ మహిళలు అక్కడ పడిగాపులు కాస్తున్నారు. నిరుపేద మహిళల ద్వారా దరఖాస్తులు తీసుకున్న ప్రజాప్రతినిధులు వాటిని ఈనెల 21వ తేదీ వరకు కలెక్టర్లకు అందజేయాలి. కలెక్టర్ ఈ దరఖాస్తులను పరిశీలించి ఈనెల 27తేదీ వరకు స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సమర్పించాల్సి ఉంది.
గడువు పెంచి, విస్తృత ప్రచారం చేయాలి
గడువు తేదీని పొడిగించాలి. పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలి. దళితబంధు మాదిరి యూనిట్‌లను అందించాలి. యూనిట్ కాస్ట్‌లను పెంచి పేదమహిళలకు స్వయం ఉపాధి అందించాలి. ఉచిత కుట్టు మిషన్ పథకం యూనిట్‌లను నియోజకవర్గానికి ఐదువందల చొప్పున పొడిగించాలి. – రాజ్ మహ్మద్, అధ్యక్షుడు మైనార్టీ రైట్స్ ప్రొటెక్షన్ ఫ్రంట్, ఉమ్మడి వరంగల్
Comments
Please login to add a commentAdd a comment