నడికూడ/ రేగొండ :పండుగ వేళ ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వాగులో పడి అన్నదమ్ములు మృతి చెందారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం నార్లాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన దోపతి సమ్మిరెడ్డికి ఇద్దరు కుమారులు దొపతి జగన్ రెడ్డి(33) మల్లారెడ్డి(31) ఉన్నారు. ఇందులో జగన్‌రెడ్డి సాఫ్ట్‌వేర్, మల్లారెడ్డి బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఇద్దరి అత్తగారి ఊరు మండలంలోని వరికోల్‌కు చేరుకున్నారు.
సోమవారం సరదాగా పక్కన ఉన్న నార్లాపూర్ చెక్ డ్యాం చూసేందుకు వెళ్లారు. అక్కడ వాగులో ఈత కొడుతూ వరద నీటిలో గల్లంతయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వీరి కోసం వెతకగా ఆచూకీ లభించలేదు. దీంతో కేకలు వేయగా స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చేపట్టగా ఇద్దరి మృతదేహాలు లభించాయి. దీనిపై స్థానికుల సమాచారం మేరకు పరకాల సీఐ వెంకటరత్నం, ఎస్సై రమేష్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై మృతుల తండ్రి సమ్మిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నట్లు పోలీసులు తెలిపారు.
గతంలోనూ ఇద్దరు మృతి..
గతంలో ఇదే చెక్ డ్యాంలో పడి నార్లపూర్ గ్రామానికి చెందిన ఈ ర్ల అభినవ్, ఈర్ల కౌశిక్ మృతి చెందారు. చెక్ డ్యాం వద్ద ఇసుక దిబ్బలు పేరుకుపోవడం, వాగు వరదకు లోతైన గుంతలు ఏర్పడడం వల్ల గుర్తించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
చెరువులో పడి వ్యక్తి..
కాటారం: పూల కోసం వెళ్లిన వ్యక్తి చెరువులో మునిగి రెండు రోజుల తర్వాత శవమై కనిపించాడు. ఘటన మంగళవారం కాటారం మండలం గుమ్మాళ్లపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన భక్తు గణేశ్(26) ఈ నెల 22న దామెరకుంటలోని అత్తగారి ఇంటికి వెళ్తున్నాడు. మార్గమ ధ్యలో గుమ్మాళ్లపల్లి గ్రామ సమీపంలోని ఊర చెరువులోకి పూల కోసం వెళ్లి నీటిలో మునిగాడు.
మంగళవారం ఉదయం అటువైపుగా వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో మృతదేహం కనిపించగా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి బయటకు తీశారు. మృతదేహాం అప్పటికే కుళ్లిపోగా గ్రామస్తుల ద్వారా గణేశ్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సమరియా, కొడుకు, కూతురు ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అభినవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment