![ప్రశ్నలే.. సమాధానాల్లేవ్](/styles/webp/s3/article_images/2024/11/14/13hmkd185_mr-1731550919-0.jpg.webp?itok=txV4fzsy)
ప్రశ్నలే.. సమాధానాల్లేవ్
హన్మకొండ అర్బన్: మూడునెలలకోసారి జరగాల్సి న హనుమకొండ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం.. ఎన్నికలు, ఇతర ఆటంకాలతో ఇప్పటికి మూడుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్‌లో జరిగింది. చైర్‌పర్సన్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో అమలయ్యే అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు అడిగిన ప్రశ్నలకు, లేవనెత్తిన సమస్యలకు ఏ ఒక్క అధికారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో కలెక్టర్, ఎమ్మెల్యేలతోపాటు చైర్‌పర్సన్ కడియం కావ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కావ్యకు కలెక్టర్ సర్దిచెప్పారు. వచ్చే సమావేశం నాటికైనా పూర్తి సమాచారం, ముందస్తు ప్రణాళికలు(డీపీఆర్)లతో రావాలని ఆదేశించారు.
పారిశుద్ధ్య పనులు పడకేశాయి :
ఎమ్మెల్యే నాయిని
నగరంలో ఏడాదికాలంగా పారిశుద్ధ్య పనులు పూర్తిగా పడకేశాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. కొన్ని కాలనీల్లో రెండు నెలలుగా చెత్త కుప్పలు తరలించకుండా ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని, ఇలాంటి తరుణంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ప్రభుత్వం బద్నాం అవుతుందని తెలిపారు. నల్లాల లీకేజీల విషయంలో పదే పదే చెప్పినా అధికారులు స్పందించడం లేదన్నారు. స్పెషల్‌డ్రైవ్ ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను కోరారు.
రోడ్ల మరమ్మతు చేయాలి :
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
భట్టుపల్లి, కడిపికొండ ఇందిరమ్మకాలనీల్లో సీసీ రోడ్లు లేవని, వీధిలైట్లు వెలగడం లేదని ఈవిషయంలో వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడంలేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.. అధికారులను నిలదీశారు. భట్టుపల్లి రోడ్డులో ఎస్‌ఆర్ కాలేజీ వద్ద కల్వర్టు కుంగిన చోట వారంలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. చింతగట్టు కెనాల్‌పై హసన్‌పర్తి రోడ్డులో ఉన్న బ్రిడ్జి పూర్తి ఇరుకుగా మారిందని, తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కిట్స్‌కాలేజీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదని, రోడ్ల మరమ్మతు ఎవరు చేశారని ప్రశ్నించారు. దీనికి అధికారులనుంచి సరైన సమాధానం రాలేదు.
శిక్షణ ఎవరు, ఎక్కడ ఇస్తున్నారు?
మేయర్ సుధారాణి
హైండ్లూమ్స్, టెక్స్ టైల్ ఆధ్వర్యంలో నేతకార్మికులకు శిక్షణ ఇస్తున్నామని చెబుతున్న అధికారులు ఎక్కడ, ఎవరికి ఇచ్చారని, తమకు కనీస సమాచారం లేదని మేయర్ గుండు సుధారాణి అన్నారు. కాగా, దీనిపై తనకు సమగ్ర సమాచారం ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత పటిష్టం చేయాలని సూచించారు.
సమాచారం లేనప్పుడు ఎందుకు
చదువుతున్నావ్ : ఎంపీ కడియం కావ్య
జిల్లాలో కేంద్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల్లో సిబ్బంది ఇంటింకి వెళ్లి కేన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించడంతో గుర్తించిన వారిని ఎంతమందిని ఆస్పత్రులకు రెఫర్ చేశారని దిశ కమిటీ ౖచైర్‌పర్సన్, ఎంపీ కడియం కావ్య డీఎంహెచ్‌ఓను అడిగారు. సరైన సమాచారం లేనప్పుడు జాబితా ఎందుకు చదువుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, వచ్చే సమీక్ష నాటికి పక్కా లెక్కలతో రావాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు నిస్వార్థంగా పనిచేయాలన్నారు. విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు తీసుకురావాలన్నారు. ప్రభు త్వ పాఠశాలలు, కళాశాలలు వసతి గృహాల్లోని విద్యార్థులు ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని, వారిపై దృష్టిసారిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నాగపద్మజ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సభ్యులు లేవనెత్తిన సమస్యలపై
నీళ్లు నమిలిన అధికారులు
‘దిశ’ మీటింగ్‌కు మొక్కుబడిగా
రావడంపై చైర్‌పర్సన్,
ఎంపీ కావ్య అసహనం
సర్దిచెప్పిన కలెక్టర్.. వచ్చే
సమావేశానికి మార్పు రావాలన్న ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment