
వీడిన హత్య కేసు మిస్టరీ
పరకాల: రెండేళ్ల క్రితం నడికూడ మండలం ధర్మారం శివారులో జరిగిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ వీడింది. వృద్ధురాలి కన్నకొడుకు సన్నిహితుడే హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలగా.. నిందితుడు పరకాల పోలీసుల ముందు లొంగిపోగా.. బుధవారం అరెస్ట్ చేశారు. హత్యకు సంబంధించిన వివరాలను వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ పి.రవీందర్ పరకాల ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శాయంపేట మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన వాడికాల బొందమ్మకు నలుగురు సంతానం. ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు. తనకున్న 10 గుంటల భూమిని కొడుకుకు కాదని.. కూతుర్లకు ఇస్తానని గ్రామంలో జరిగిన పంచాయితీలో చెప్పడమే ఆమెకు శాపమైంది. కొడుకుకు ఇవ్వాలని అదే గ్రామానికి చెందిన ఇంటి రాజిరెడ్డి వృద్ధురాలితో వాదించాడు. ఆవిషయాన్ని మనసులో పెట్టుకున్న వృద్ధురాలు పంచాయితీ జరిగిన మరుసటి రోజు 2023 మార్చి26న రాజిరెడ్డి ఇంటికి వెళ్లి తమ కుటుంబంలో చిచ్చు పెడుతున్నావంటూ శాపనార్థాలు పెడుతూ దూషించింది. దీంతో ఆగ్రహించిన రాజిరెడ్డి ఇంటి చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో వృద్ధురాలిని చితకబాది హత్య చేశాడు. అంతటితో ఊరుకోకుండా మృతదేహంపై ఉన్న బంగారు గాజులు, మెడలోని బంగారు గొలుసు, కమ్మలు దోచుకొని ఎడ్ల కొట్టంలో దాచిపెట్టాడు. తర్వాత మృతదేహాన్ని తన కారులో వేములవాడ వైపు తీసుకెళ్ల్లి.. మళ్లీ అదే రాత్రి హుజూరాబాద్, నడికూడ మీదుగా ధర్మారం శివారులోని కెనాల్ కల్వర్టు వద్ద పడేసి వెళ్లిపోయాడు. గ్రామస్తులు అందించిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హత్యగా కేసు నమోదు చేశారు. వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు వృద్ధురాలి హత్య కేసును సీరియస్‌గా తీసుకొని విచారణ జరపగా ఆమె సొంత గ్రామానికి చెందిన ఇంటి రాజిరెడ్డే హత్య చేసినట్లు పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. నిందితుడి కోసం గాలిస్తుండగా పరకాల పోలీసుల ముందు మరొకరి సాయంతో లొంగిపోయాడు. వృద్ధురాలి నుంచి దోచుకున్న బంగారాన్ని వరంగల్‌లోని ఓ జ్యువెల్లరీలో కరిగించి కడెం చేయించుకున్నాడు. కొద్ది రోజులకు తన అవసరాల కోసం ఓ ఫైనాన్స్‌లో తాకట్టుపెట్టినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు డీసీపీ రవీందర్ వెల్లడించారు. నిందితుడి నుంచి కారును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హత్య కేసును ఛేదించిన పరకాల, శాయంపేట సీఐలు క్రాంతికుమార్, రంజిత్‌రావు పోలీసు బృందాన్ని డీసీపీ రవీందర్, ఏసీపీ సతీశ్‌బాబు అభినందించారు.
రెండేళ్ల క్రితం ధర్మారం శివారులో లభ్యమైన వృద్ధురాలి మృతదేహం
హత్యగా కేసు నమోదు..
కీలక ఆధారాలు లభ్యం
పోలీసుల ఎదుట లొంగిపోయిన
నిందితుడు.. కారు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment