వెయిటేజీ మార్కుల దందా | - | Sakshi
Sakshi News home page

వెయిటేజీ మార్కుల దందా

Published Sat, Feb 15 2025 1:23 AM | Last Updated on Sat, Feb 15 2025 1:23 AM

వెయిటేజీ మార్కుల దందా

వెయిటేజీ మార్కుల దందా

ఎంజీఎం : ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల దందా రోజురోజుకూ పెరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగ నియామక ఏజెన్సీలను దక్కించుకున్న నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ నిరుద్యోగ అభ్యర్థులనుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. కాకతీయ మెడికల్‌ కళాశాల సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలను దక్కించుకున్న నిర్వాహకులు ఏకంగా ఎంజీఎం పరిపాలనాధికారులను తప్పుదోవ పట్టించారు. అర్హత లేని ఉద్యోగులకు వెయిటేజీ మార్కులు కల్పించేలా ల్యాబ్‌ అటెండెంట్లకు ల్యాబ్‌ టెక్నీషియన్లుగా ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేశారు. వెయిటేజీ మార్కుల విషయంలో మరోమారు విచారణ చేయాలని ఎంజీఎం అధికారులకు మెయిల్‌ రావడంతో అసలు ఏం జరిగిందని విచారించగా అనేక విషయాలు వెలుగుచూశాయి.

అసలేం జరిగిందంటే..

వైద్యారోగ్యశాఖలో స్టాఫ్‌నర్సులతోపాటు ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్టుల నియామకాల కోసం ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌ నెలలో రాత పరీక్షలు నిర్వహించింది. అభ్యర్థులకు రాత పరీక్షల మార్కులతోపాటు ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల్లో పనిచేసిన ఉద్యోగులకు ఆయా విభాగాల అఽధికారుల ద్వారా సర్వీసును బట్టి వెయిటేజీ మార్కులు కల్పిస్తారు. ఈ మార్కులతో అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలను పొందవచ్చు. ఈ విషయాన్ని గమనించిన కేఎంసీలోని ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు నిర్వాహకులు తెలివిగా వ్యవహరించారు. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో 12 మంది ల్యాబ్‌ అటెండెంట్లు, నలుగురు ల్యాబ్‌ టెక్నీషియన్లు ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల ద్వారా నియమితులయ్యారు. 16మంది అభ్యర్థులు రాత పరీక్షల్లో పాల్గొనగా ఆస్పత్రిలో పనిచేసే మూడు ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు నలుగురు ల్యాబ్‌ టెక్నీషియన్లకు మాత్రమే సర్టిఫికెట్లు ఇచ్చే అర్హత ఉంటుంది. కానీ నిర్వాహకులు తెలివిగా ల్యాబ్‌ అటెండెంట్లను సైతం టెక్నీషియన్‌గా పేర్కొంటూ వారికి వెయిటేజీ మార్కులు కల్పించారు. మొత్తం 16 మంది అభ్యర్థులను టెక్నీషియన్లుగా పేర్కొంటూ ఎంజీఎం పరిపాలనాధికారులకు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారు. ఈ సర్టిఫికెట్ల సమర్పిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని భావించిన నిర్వాహకులు.. ఆయా అభ్యర్థులనుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

కేఎంసీలోని ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల చేతివాటం

ల్యాబ్‌ అటెండెంట్లకు

టెక్నీషియన్లుగా సర్టిఫికెట్లు

ఎంజీఎం అధికారులను

తప్పుదోవ పట్టించిన నిర్వాహకులు

మెమోలు జారీ చేసిన అధికారులు

ఎంజీఎం అధికారుల

పునర్విచారణ..

ప్రభుత్వ ఉద్యోగాల్లో అభ్యర్థులకు కల్పించిన వెయిటేజీ మార్కుల విషయంలో మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంసీఆర్‌బీ)నుంచి ఎంజీఎం అధికారులకు ఓ మెయిల్‌ వచ్చింది. వీటిని తిరిగి విచారణ చేసి ధ్రువీకరించాలని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో ఎంజీఎం అధికారులు విచారణ చేశారు. అటెండెంట్లకు టెక్నీషియన్లుగా సర్టిఫికెట్లు ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో సంబంధిత ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలకు మెమోలు జారీ చేశారు. ఈక్రమంలో శుక్రవారం సదరు నిర్వాహకులను పిలిచి విచారణ చేశారు. తమకు తెలియకుండా తప్పు జరిగిపోయిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. వెయిటేజీ మార్కులు పొందిన అభ్యర్థులను పూర్తిస్థాయిలో విచారిస్తే వారినుంచి ఏజెన్సీలు ఎంత వసూలు చేశాయో బయటపడుతుందని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement