
తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు
వరంగల్ క్రైం: క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని, విధి నిర్వహణలో ఏదైనా వ్యక్తిగత సమస్యలతో ఒత్తిళ్లకు గురైతే మీ శ్రేయోభిలాషులకు, స్నేహితులకు తెలపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ‘విధి నిర్వహణతో పాటు వ్యక్తిగతంగా ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను నియంత్రించడం ఎలా’ అనే అంశంపై అవగాహన సదస్సు శుక్రవారం పోలీస్ కమిషనరేట్‌లోని రుద్రమదేవి ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ ఉద్యోగులకు విధి నిర్వహణలో ఎన్నో పని ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, క్రమశిక్షణ, ప్రణాళికబద్ధంగా విధులు నిర్వహించడంతోనే ఈ ఒత్తిళ్లను అధిగమించవచ్చన్నారు. వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమన్నారు. కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్లు తట్టుకోలేక క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. ఒత్తిళ్లు అధిగమించేందుకు ప్రతీరోజు వ్యా యామం, యోగా చేయాలని సూచించారు. అంతకుముందు నగరానికి చెందిన మనస్తత్వవేత్తలు డాక్టర్ జ్యోతి, స్వరూప, బెన్‌సన్లు మానసిక ఒత్తిళ్లను ఏవిధంగా నియంత్రించుకోవాలో పోలీస్ సిబ్బంది, అధికారులకు తెలిపారు. ఈకార్యక్రమంలో డీసీపీలు షేక్ సలీమా, రవీందర్, అదనపు డీసీపీలు రవి, సురేశ్, ఏసీపీలు జితేందర్, మధుసూదన్, నాగయ్య, అనంతయ్య, ఏఓ రామకృష్ణ ఆర్.ఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఎస్‌ఐలు, పరిపాలన విభాగం అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సమస్య ఉంటే శ్రేయోభిలాషులకు
తెలపండి
సీపీ అంబర్ కిషోర్ ఝా
పోలీస్ అధికారులు,
సిబ్బందికి అవగాహన సదస్సు
Comments
Please login to add a commentAdd a comment