
తగ్గని భక్తుల జోరు
జాతర ముగిసినా..
ఎస్‌ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ మినీజాతర ముగిసినా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్న వాగు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి పుట్ట వెంట్రుకలు సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం పరిసరాల్లో వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు.
ముందస్తు అంచనాతో అధికారుల ఏర్పాట్లు..
మినీ జాతర అనంతరం ఆదివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో మేడారానికి వస్తారని ముందస్తు అంచనాతో జిల్లా అధికారులు, పోలీస్ శాఖ తరఫున ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ రవీందర్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు నిర్వహించారు. శనివారం రాత్రి నుంచి ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా భక్తుల ప్రైవేట్ వాహనాలను పార్కింగ్ స్థలాల్లోకి మళ్లించారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశారు. పస్రా సీఐ రవీందర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి.. సిబ్బందిని సమన్వయ చేస్తూ బందోబస్తు నిర్వహించారు.
సరైన సమయంలో
బస్సులు లేక భక్తుల ఇబ్బందులు
అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆదివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులు సరైన సమయంలో ఆర్టీసీ బస్సులు లేక ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్‌లోనే పడిగాపులు కాశారు. తీరా ఒక్క బస్సు రాగానే ఎక్కేందుకు పోటీ పడ్డారు. ఈ సమయంలో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.
సమన్వయంతో జాతర విజయవంతం
జిల్లా అధికారులు, పోలీస్ శాఖ, పూజారుల సమన్వయంతో మినీ జాతర విజయవంతమైందని మేడారం జాతర కమిటీ చైర్మన్ ఆరెం లచ్చుపటేల్ అన్నారు. ఈమేరకు ఆదివారం పూజారులతో కలిసి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు సమర్పించారు. గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీజాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంత్రి సీతక్క, జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేసి జాతర విజయవంతానికి కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా జాతర విజయవంతానికి సహకరించిన అధికారులు, సిబ్బంది, పూజారులకు కృతజ్ఞతలు తెలిపారు.
19న తిరుగువారం పూజలు
ఈనెల 19న (బుధవారం) తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. మినీజాతర (మండమెలిగె) పండుగ ముగిసిన అనంతరం మరోసారి అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు తిరుగువారం పండుగ చేయడం ఆనవాయితీ. తిరుగు వారం పండుగ రోజున మేడారం, కన్నెపల్లిలో పూజారులు, ఆదివాసీ కుటుంబాలు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
మేడారానికి తరలివచ్చిన వేలాది మంది
ట్రాఫిక్ నియంత్రణకు కట్టదిట్ట చర్యలు
19న తిరుగువారం పండుగ

తగ్గని భక్తుల జోరు
Comments
Please login to add a commentAdd a comment