
జ్వరంతో విద్యార్థి మృతి
● ఆశ్రమ పాఠశాల వార్డెన్,
హెచ్‌ఎం నిర్లక్ష్యమే కారణం: బంధువులు
● హాస్టల్ ఎదుట బంధువుల ఆందోళన
వాజేడు: జ్వరంతో బాధపడుతూ వాజేడు మండల పరిధి పేరూరు బాలుర ఆశ్రమ హాస్టల్ విద్యార్థి సోయం వినీత్(13) శనివారం రాత్రి మృతి చెందాడు. పేరూరు గ్రామానికి చెందిన వినీత్ ఊళ్లోని ఆశ్రమ హాస్టల్‌లో ఉంటూ అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వినీత్‌కు మూడు రోజులక్రితం జ్వరం వచ్చింది. హాస్టల్లో ఒక మాత్ర ఇవ్వగా జ్వరం తగ్గింది. దీంతో ఇంటికి వచ్చాడు. ఇంటి వద్ద నీరసంగా ఉండడంతో అతడి మేన మామ ధర్మవరంలో ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించాడు. ఆర్‌ఎంపీ.. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. వెంటనే మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లాలని సూచించాడు. దీంతో కారులో శుక్రవారం సాయంత్రం వినీత్‌ను ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యం చేస్తుండగానే మృతి చెందాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు వినీత్ మృతి చెందడానికి హాస్టల్ వార్డెన్, పాఠశాల హెచ్‌ఎం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. జ్వరమొస్తే కుటుంబ సభ్యులకు తెలపకుండా మాత్ర వేసి పంపించడం ఏంటని ప్రశ్నించారు? అనంతరం బంధువులు, ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర నాయకుడు కొర్స నర్సిమూర్తి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకుడు ఉయిక శంకర్‌తో కలిసి ఆశ్రమ పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. విద్యార్థి మృతికి కారణమైన వార్డెన్ శ్రీను, హెచ్‌ఎం నాగరాజుపై చర్యలు తీసుకోవాలని, వినీత్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నినదించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగింది. వినీత్ కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు బాలుడి తల్లి శైల కుమారికి ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని వార్డెన్, హెచ్‌ఎం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
సర్వేను సద్వినియోగం చేసుకోవాలి
అదనపు కలెక్టర్ సంధ్యారాణి
వరంగల్: కులగణన సర్వేను ప్ర జలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి కోరారు. వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్, కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయం, కరీమాబాద్ మీసేవ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలను అదనపు కలెక్టర్ ఆదివారం తనిఖీ చేశారు. ఆ యా కేంద్రాల్లో రీసర్వేలో నమోదు వివరాల తీరు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనవు కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 28 వరకు సర్వే నిర్వహిస్తారని, ఇప్పటివరకు నమోదు కాని కుటుంబ సభ్యులు మాత్రమే సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం తిరిగి అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. వరంగల్‌లోని పోచమ్మమైదాన్ ఈసేవ కేంద్రం, కాశీబుగ్గ సర్కిల్ ఆఫీస్ కేంద్రం, కరీమాబాద్ మీసేవ కేంద్రం, నర్సంపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా పాలన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతీరోజు ఉద యం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040–21111 1111 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా https://seeepcsurvey.cgg.gov.in నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు నింపి ప్రజాపాలన కేంద్రాల్లో అందించొచ్చన్నారు. ప్రజలు సర్వేకు సహకరించి పూర్తి వివరాలను ఇ వ్వాలని కోరారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, బల్దియా రెవెన్యూ అధికారి షా జాదీబేగం, పర్యవేక్షకులు హబీబుద్దీన్, ఆర్‌ఐ సోహైల్ పాల్గొన్నారు.

జ్వరంతో విద్యార్థి మృతి
Comments
Please login to add a commentAdd a comment