
టీఆర్‌ల జారీలో ‘విజిలెన్స్’ విచారణ!
వరంగల్: సీసీఐ పత్తి కొనుగోలు చేసేందుకు టీఆర్ (టెంపరరీ రిజిస్ట్రేషన్)ల జారీలో పెద్ద మొత్తంలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తించిన మార్కెటింగ్‌శాఖ రాష్ట్రంలోని ఏడుగురు మార్కెట్ కమిటీ కార్యదర్శులను సస్పెండ్ చేసిన విషయం విధితమే. వ్యవసాయ శాఖ అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలతోనే కార్యదర్శులు టీఆర్‌లు జారీ చేసినట్లు గుర్తించిన మార్కెటింగ్ శాఖ మొత్తం ఈ వ్యవహారంపై నిజనిజాలను నిర్ధారించేందుకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విచారణలో టీఆర్‌ల జారీలో ప్రమేయం ఉన్న వ్యవసాయ అధికారులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లతో పాటు మరికొంత మంది మార్కెట్ కార్యదర్శుల వ్యవహారం బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఏఓల ఇష్టారాజ్యం..
రైతుల నుంచి పత్తిని సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు చేసేందుకు టీఆర్‌ల కోసం ధ్రువీకరణ పత్రాల జారీలో కొంత మంది వ్యవసాయ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహారించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పత్రాలు క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) మాత్రమే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి జారీ చేయాలని వ్యవసాయ శాఖ నుంచి స్పష్టంగా నిబంధన ఉంది. అయినప్పటికీ కొంత మంది ఏఓలు అడ్డగోలుగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఓ జిల్లాలో ఏకంగా ధ్రువీకరణ పుస్తకాన్ని ప్రింట్ చేయించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోలు చేసే 80 మార్కెట్ కమిటీల్లో టీఆర్‌ల జారీపై మార్కెటింగ్ శాఖ అధికారులు విచారణ చేపట్టగా నిబంధనల పట్టించుకోకుండా సుమారు 46 వేలకు పైగా టీఆర్‌లు జారీ అయినట్లు అధికారులు గుర్తించారు. 20 మార్కెట్ కమిటీల్లో ఈ వ్యవహారం జరిగినట్లు గుర్తించినప్పటికీ ఫిర్యాదు వచ్చిన మార్కెట్ కమిటీ కార్యదర్శులను మొదటి విడతగా సస్పెండ్ చేశారు. రెండో విడత మరికొంత మందిపై వేటు పడే అవకాశలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విచారణలో వ్యవసాయ అధికారుల ప్రమేయం బహిర్గతమైతే వారిపై చర్యలు తప్పవన్న చర్చ సాగుతోంది.
ఇప్పటికే ఏడుగురిపై వేటు,
త్వరలో మరికొందరిపై..
వ్యవసాయశాఖ ప్రమేయంపై ఆరా
ఉమ్మడి జిల్లాలో మరికొందరిపై వేటుకు మల్లగుల్లాలు
Comments
Please login to add a commentAdd a comment