
తహసీల్దార్ గారూ.. ఏది నిజం?
సాక్షి, వరంగల్: జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘అన్న, తమ్ముడు.. ఓ తహసీల్దార్’ కథనంపై వరంగల్ తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ సాక్షి పత్రికకు ఇచ్చిన ‘రిజైండర్’ మరెన్నో అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి వరంగల్ మండలం కొత్తపేటలోని సర్వే నంబర్ 73లో ఒక ఎకరం భూమి మహమ్మద్ అఫ్జల్ నుంచి 1998 జనవరి 9న సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశానని మోకాపై వ్యవసాయం సాగు చేసుకుంటున్న అంకేశ్వరపు కొమురయ్య వాదిస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన సాదాబైనామా అప్లికేషన్ నంబర్ టీటీఆర్‌వోఎస్ 022003406759 పరిష్కరించాలంటూ 23614 ఆఫ్ 2024 రిట్ పిటిషన్ ప్రకారం అంకేశ్వరపు కొమురయ్యది సర్వే నంబర్ 73/ఏ/3 అని అందులో ఒక ఎకరం ఒక గుంట భూమి అని.. అది రెవెన్యూ రికార్డుల ప్రకారం పట్టా భూమి అని.. సింపుల్ సేల్ డీడ్ ద్వారా ఎండీ ఖాజా పాషా దగ్గర కొనుగోలు చేశాడని సాక్షికి ఇచ్చిన రిజైండర్‌లో తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. దీంతో అసలు ఈ విచారణ సజావుగా సాగిందా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం 73/ఏ/3లోని ఒక ఎకరం ఒక గుంట ధరణిలో అంకేశ్వరపు ఎల్ల స్వామి పేరున ఉన్నట్టు నిర్ధారించిన తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమి ఎండీ ఖాజా పాషాదని పేర్కొనడమే ఇప్పుడు ఈ వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది. ఇప్పుడు ఇదే అంశం కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు సవాల్‌గా మారిందనే చర్చ కలెక్టరేట్ వర్గాల్లో వినబడుతోంది.
నిజం తేల్చాలని బాధితుల వేడుకోలు
వరంగల్ మండలం కొత్తపేటలోని 73/ఏ/3లోని ఒక ఎకరం ఒక గుంట భూమి ధరణిలో అంకేశ్వరపు ఎల్లస్వామి పేరున ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమిని మహమ్మద్ ఖాజాపాషా నుంచి అంకేశ్వరపు కొమురయ్య కొనుగోలు చేశారని తహసీల్దార్ ఇక్బాల్ సాక్షితో పేర్కొన్నారు. ఇది లోతుగా పరిశీలిస్తే ధరణిలో అంకేశ్వరపు ఎల్లస్వామి పేరున పట్టా ఉండడం నిజమే. కానీ ఆ భూమిని మహమ్మద్ అఫ్జల్ సోదరుడైన మహమ్మద్ జాఫర్ హుస్సేన్ ద్వారా డాక్యుమెంట్ నంబర్ 2780/2007తో సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ద్వారా అంకేశ్వరపు ఎల్ల స్వామి పేరు మీదకు మారింది. మహమ్మద్ ఖాజాపాషా నుంచి అంకేశ్వరపు కొమురయ్య కొనుగోలు చేశారని తహసీల్దార్ చెబుతుంటే.. ఎండీ జాఫర్ హుస్సేన్ నుంచి అంకేశ్వరపు ఎల్లస్వామి కొనుగోలు చేసినట్టుగా రెవెన్యూ రికార్డులు చెబుతుండడం గమనార్హం. మరీ ఇందులో ఏది నిజమనేది ఉన్నతాధికారులు తేల్చాలని బాధితులు కోరుతున్నారు. ఇప్పటికై నా తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తన పట్టా 73/ఏ/3 క్రయ విక్రయాలు జరగకుండా కోర్టు కేసు ఉందని అప్‌డేట్ చేసినదాన్ని తొలగించాలని అంకేశ్వరపు ఎల్లస్వామి రెవెన్యూ ఉన్నతాధికారులను కోరుతున్నారు. అలాగే తన అన్న కొమురయ్య భూమి కొన్న సమయంలో బై సర్వే నంబర్లు లేవని, రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తే ఇది తెలుస్తుందని చెబుతున్నాడు. సర్వే నంబర్ 73లో 12.6ఎకరాల భూమి ఉండేదని వివరించారు.
కలెక్టర్‌కు సవాల్‌గా మారిన కొత్తపేట సర్వే నంబర్ 73 భూ వివాదం
ఒకే సర్వే నంబర్‌లో వింత సమాధానాలతో విచారణపై మరిన్ని అనుమానాలు
క్షేత్రస్థాయిలో విచారణచేస్తేనే
బాధితులకు సరైన న్యాయం

తహసీల్దార్ గారూ.. ఏది నిజం?
Comments
Please login to add a commentAdd a comment