
విన్నపాలకు స్పందనేది..?
వరంగల్ అర్బన్: ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా సమస్యలు పరిష్కారం కావడం లేదు.. ప్లీజ్ మేడం.. క్షేత్ర స్థాయిలో సందర్శించి తమ బాధలు తెలుసుకోవాలని పలు కాలనీలకు చెందిన ప్రజలు గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేను వేడుకున్నారు. బల్దియా కౌన్సిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వరంగల్ గ్రేటర్ గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వినతులను కమిషనర్ స్వీకరించారు. నగర పరిధిలోని పలు కాలనీల్లో కనీస వసతులు లేవని, ఆక్రమణలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై మొత్తం 76 అర్జీలు అందాయి. అందులో టౌన్ ప్లానింగ్‌కు 31, ఇంజినీరింగ్ విభాగానికి 22, తాగునీటి సరఫరా 10, ప్రజారోగ్యానికి 7, పన్నుల సెక్షన్ 4, ఉద్యానవన విభాగానికి 2 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, హెచ్‌ఓలు రమేశ్, లకా్‌ష్మ్‌రెడ్డి, ఇన్‌చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రాజేశ్వర్, పన్నుల అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని ఇలా..
● వడ్డేపల్లి విజయ్‌పాల్ కాలనీలో డ్రెయినేజీలు వ్యర్థాలతో నిండి పోయాయని శ్యామల ప్రభాకర్ ఫిర్యాదు చేశారు.
● 43వ డివిజన్ గణేష్‌నగర్‌లో నివాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఓయో రూమ్‌ను రద్దు చేయాలని సంక్షేమ సంస్థ ప్రతినిధులు వేడుకున్నారు.
● కేయూసీ రోడ్డులోని 3 – 14 – 542/2 వద్ద ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ కారణంగా ధ్వంసమైన రోడ్డుకు మరమ్మతు చేయాలని కూచన సురేష్ కోరారు.
● మడికొండ వెస్ట్‌సిటీలో 400 కుటుంబాలు నివా సముంటున్నాయని, అక్కడ కనీసం సౌకర్యాలు కల్పించాలని సొసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు.
● 11వ డివిజన్ కాపువాడ రాణా సిద్ధిఖీ ఆస్పత్రి లైన్‌లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ సౌకర్యాల కల్పించాలని కాలనీ ప్రతినిధులు విన్నవించారు.
● హనుమకొండ దీన్‌దయాళ్ కాలనీ ‘కుడా’ ఆధ్వర్యంలో చేపట్టిన అంతర్గత డ్రెయినేజీలు పూర్తి చేయాలని ఎమ్మార్పీఎస్ నేత మంద కుమార్ మాదిగ ఫిర్యాదు చేశారు.
● నక్కలగుట్ట సునీత రెసిడెన్సీ అపార్టుమెంట్ సెల్లార్‌లో అక్రమంగా నిర్మించిన 4 షెట్టర్లను తొలగించాలని స్థానికులు దరఖాస్తు చేశారు.
● 64వ డివిజన్ మడికొండలో 30 ఫీట్ట రోడ్డును 7 ఫీట్ల మేర ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
● హంటర్ రోడ్డు ట్యాంక్ బండ్ వద్ద టిఫిన్ సెంటర్లు, ఇతర షాపుల కారణంగా వాహనాల రద్దీ పెరుగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని పలువురు ఫిర్యాదు చేశారు.
● కాశిబుగ్గ సాయిగణేష్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.
ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా పరిష్కారం కాని సమస్యలు
గ్రేటర్ గ్రీవెన్స్‌లో ప్రజల అసహనం
దరఖాస్తులు స్వీకరించిన కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
Comments
Please login to add a commentAdd a comment