బల్దియా ఖర్చు చేసిన ప్రజాధనం (రూ. కోట్లలో) | - | Sakshi
Sakshi News home page

బల్దియా ఖర్చు చేసిన ప్రజాధనం (రూ. కోట్లలో)

Published Fri, Feb 21 2025 7:55 AM | Last Updated on Fri, Feb 21 2025 7:56 AM

బల్ది

బల్దియా ఖర్చు చేసిన ప్రజాధనం (రూ. కోట్లలో)

వరంగల్‌ అర్బన్‌: ప్రత్యేక రోజుల్లో భవనాలు, పండుగ సమయాల్లో భక్తుల సౌకర్యార్థం బల్దియా విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేస్తోంది. వీటి పేరిట ఏటా రూ.కోట్ల ప్రజాధనం వెచ్చిస్తోంది. వీటి కోసం బల్దియా వేలం నిర్వహిస్తోంది. ఇవి వెలిగినా వెలగకపోయినా.. అధికారులు పర్యవేక్షించరు. వారికొచ్చే వాటా ముడితే చాలు.. చూసీ చూడనట్లుగా వదిలేస్తారు. ఈతతంగమంతా ఏడాది పొడవునా నడిచినా.. తమకు బిల్లులు రావాలంటే మాత్రం పర్సంటేజీలు ఇవ్వాల్సిందేనని అధికారులు డిమాండ్‌ చేస్తున్నట్లు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు..

వెలుగుల కోసం రూ.5 కోట్లు..

ఇటీవల గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిషనర్‌ ఇలంబర్తి పండుగలు, వేడుకల పేరిట ప్రతీ ఏటా రూ.500 కోట్లు నిధులు ఖర్చవుతున్నాయా? అని ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ఇదే తరహాలో గ్రేటర్‌ వరంగల్‌ తక్కువేమీ కాదు. సివిల్‌ పనులకు లెక్కాపత్రం లేకుండా రూ.కోట్లు వెచ్చిస్తున్నారు. అందులో కేవలం విద్యుత్‌ లైట్ల ఏర్పాట్ల పేరిట ఏటా రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. గతంలో కంటే భిన్నంగా 2024–25 బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించడంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి.

పంపకాలు..

అన్ని మతాల పండుగలకు భక్తుల సౌకర్యార్థం ఆయా వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో బల్దియా విద్యుత్‌ లైట్లను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్‌ కాంతులు జిగేల్‌మంటాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతీ ఏడాది రూ.5 కోట్లు వెచ్చించి విద్యుద్దీపాలను వేడుకలకు ముందే పేరుకు బహిరంగ ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లకు ఆహ్వానిస్తోంది. గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు, నిమజ్జన ప్రాంతాలకు, దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు, ఇతర వేడుకలకు లైట్లు వేసిన కాంట్రాక్టర్లు మాత్రమే టెండర్లు వేసుకోవాలని సలహాలిస్తున్నారు. 2 శాతం నుంచి 5 శాతం మాత్రమే లెస్‌ వేయాలని సూచనలిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పోటీకి వెళ్లి టెండర్లు వేసినా.. సర్దుబాటు చేసి మరీ టెండర్లు కట్టబెడుతున్నారు.

పర్సంటేజీ ఇస్తేనే సంతకాలు..

టెండర్‌ నిబంధనల ప్రకారం ఎన్ని లైట్లు ఏర్పాటు చేశారు? ఎన్ని ఏర్పాటు చేయాలి? తదితర లోటుపాట్లను క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు పట్టించుకోరు. భక్తులు, ఈవెంట్ల వద్ద లైట్లు వెలిగినా, వెలగకపోయినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుంటారు. ఏమాత్రం పర్యవేక్షణ ఉండదు. లైట్లు ఏర్పాటు చేసిన వెంటనే మెజర్‌మెంట్‌ బుక్‌(ఎంబీ)లో నమోదు చేయాలి. కానీ దాదాపు ఏడాది గడుస్తున్నా.. నమోదు మాత్రం చేయలేదనే విమర్శలున్నాయి. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు బల్దియా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడంతో తమకు తీరిక ఉన్న సమయంలో ఏఈలు ఎంబీలు టెండర్‌ నిబంధనలకు మేరకు రూపకల్పన చేస్తున్నారు. సంతకం చేయాలంటే తమ వాటా సంగతేంటని ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు. బిల్లు పాస్‌ అయితే వచ్చే సొమ్ము వాటాల వారీగా అందజేస్తామని బతిమాలినా ససేమిరా అంటున్నారు. దీంతో కాంట్రాక్టర్లు అడిగినంత సొమ్ము చెల్లించి ఏఈ నుంచి ఉన్నత ఇంజినీర్‌ వరకు ముట్టజెబుతున్నారు. తదుపరి ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌, అకౌంట్స్‌ సెక్షన్‌, ఇతర అధికారులకు అడిగినంత చెల్లిస్తే అగ్రిమెంట్‌ సొమ్ములో 30 శాతం ఖర్చవుతోందని కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ సకాలంలో బిల్లులు చేతికందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా.. వరంగల్‌ మహా నగర పాలక సంస్థ కొంత మంది అవినీతి అధికారులకు, కాంట్రాక్టర్లకు, అక్రమార్కులకు అడ్డాగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్ట్రికల్‌ విభాగం ఇంజనీర్లను, అకౌంట్స్‌, ఇతర అధికారులను విద్యుత్‌ లైట్ల ఏర్పాటు, బిల్లుల చెల్లింపులపై ‘సాక్షి’ వివరణ కోరితే, దాటవేస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.

సొంతగా కొనుక్కోవచ్చు కదా?

విద్యుత్‌దీపాల పేరిట ఏటా బల్దియా ఖర్చు చేస్తున్న రూ. కోట్ల వ్యయంతో సొంతంగా లైట్లు కొనుక్కోవచ్చు. కానీ.. అలా కొంటే ప్రతీ సంవత్సరం పర్సంటేజీలు రావేమోనని అధికారులు ఆలోచిస్తున్నట్లు విమర్శలున్నాయి. టెండర్లు పిలిచి బిల్లులు మంజూరు చేస్తే పర్సంటేజీలు లాగొచ్చనే ఉద్దేశంతో అధికారులున్నట్లు బహిరంగంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. బల్దియా సొంతగా లైట్లను కొంటే.. ప్రతీ ఏటా రూ. కోట్లలో ప్రజాధనం ఆదా అవుతుందని.. ఆ డబ్బును అభివృద్ధి కోసం వినియోగించాలని నగర ప్రజలు కోరుతున్నారు.

2023–24

2021–22

2024–25

2022–23

‘పర్వదినాలు, ఇతర సమయాల్లో విద్యుత్‌ లైట్లు వెలిగించాం.

మా బిల్లు చాలా రోజుల నుంచి ఆగిపోయింది. ఇప్పటికై నా చెల్లించండి సార్‌’ అని ఓ కాంట్రాక్టర్‌ విజ్ఞప్తి.

‘మా వాటా మాకివ్వండి.. మీ బిల్లుపై సంతకం చేస్తాం’ అంటూ ఏఈ నుంచి మొదలు ఈఈ వరకు, ఎగ్జిమినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌, అకౌంట్స్‌ విభాగంలోని ఓ ఉన్నతాధికారి వరకు డిమాండ్‌.

‘సార్‌.. మేం నిబంధనల మేరకు లెస్‌తో టెండర్లు వేశాం. మీరు చెప్పినట్లుగా అధికంగా లైట్లు ఏర్పాటు చేశాం. ఇప్పటికే చాలా రోజులుగా బిల్లులు రాక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మీరు బిల్లు ఇస్తే ఆతర్వాత మీ వాటా ఇస్తాం’ అని కాంట్రాక్టర్లు అంటున్నారు.

‘మేం కూడా తర్వాతే ఎంబీలపై సంతకాలు చేస్తాం. తర్వాతే బిల్లు తయారు చేస్తాం’ అనే సమాధానాలు ఎదురవుతున్నాయని చోటా, మోటా ఎలక్ట్రికల్‌ విభాగం కాంట్రాక్టర్ల ఆందోళన.

బల్దియాలో వేడుకల పేరిట ప్రజాధనం పక్కదారి

నగరంలోని భవనాలు, ప్రార్థనా మందిరాల అలంకరణకు లైట్ల ఏర్పాటు

బిల్లులివ్వాలని కాంట్రాక్టర్ల విజ్ఞప్తి..

వాటాశాతం చెల్లిస్తేనే సంతకం

పెడతామని అధికారుల డిమాండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
బల్దియా ఖర్చు చేసిన ప్రజాధనం (రూ. కోట్లలో)1
1/1

బల్దియా ఖర్చు చేసిన ప్రజాధనం (రూ. కోట్లలో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement