వాసవికాలనీలో భార్యపై భర్త దాడి
మడిపల్లి పెళ్లి బరాత్ లో ఇద్దరికి కత్తిపోట్లు
భుట్టుపల్లి సమీపంలో ఒకరిపై రాడ్లతో దాడి
పెళ్లిబరాత్‌లో.. హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలం మడిపల్లిలో గురువారం రాత్రి జరిగిన ఓ పెళ్లి బరాత్‌లో ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం చివరికి కత్తిపోట్లకు దారితీసింది. కత్తిదాడిలో ఇద్దరికి తీవ్ర, మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. మడిపల్లికి చెందిన రమేశ్, జలేందర్ రక్తసంబంధీకులు. ఇళ్లు కూడా పక్కపక్కనే ఉంటాయి. కొంతకాలంగా వీరి మధ్య వైరం ఏర్పడింది.
చివరికి హత్యాయత్నానికి దారి తీసింది. ఈక్రమంలో గ్రామానికి చెందిన గండికోట ఐలయ్య కూతురు వివాహానికి గురువారం రాత్రి ఇరువురు హాజరయ్యారు. పెళ్లి బరాత్ ప్రారంభం సందర్భంగా ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో జలేందర్‌తోపాటు అతడి సోదరుడు క్రాంతి కత్తులతో రమేశ్, అన్వేశ్‌పై దాడికి దిగారు. అడ్డుకోవడానికి వచ్చిన కనకయ్యతోపాటు నరేశ్‌పై కర్రలతో దాడి చేయగా గాయపడ్డారు.
రమేశ్ పేగులు బయటికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. అన్వేశ్ శరీరంపై పలుచోట్ల గాయాలైనట్లు చెప్పారు. వీరిని చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్ చేరాలు ఘటనా స్థలిని పరిశీలించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కాగా, కత్తిపోటకు గురైన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
ప్రయాణికుడిపై రాడ్లతో దాడి
ఖిలా వరంగల్: నగరంలోని భట్టుపల్లి రహదారిపై అమ్మవారిపేట క్రాస్ రోడ్డు సమీపాన కారును ఆపేసిన దుండగులు అందులోని ప్రయాణికుడిపై రాడ్లతో దాడి చేశారు. ఈఘటన గురువారం రాత్రి 10.30 గంటలకు జరిగింది. పాత కక్షలా? లేదా దారి దోపిడీ చేసే దుండగులే ఈఘాతుకానికి ఒడిగట్టారా? అనేది తెలియాల్సి ఉంది. స్థానికుల కథనం ప్రకారం.. కాజీపేట నుంచి కడిపికొండ ఫ్లైఓవర్, భట్టుపల్లి మీదుగా వరంగల్ వైపునకు గాదె సిద్ధార్థరెడ్డి కారులో బయల్దేరాడు.
అమ్మవారిపేట క్రాస్ రోడ్డు సమీపంలో ముగ్గురు వ్యక్తులు రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు. వారిని గమనించిన సిద్ధార్థరెడ్డి కారును ఆపగా, దుండగులు అతడిని కిందికి దింపి కర్రలు, రాడ్లతో తలపై బలంగా కొట్టారు. దీంతో తీవ్ర రక్తస్రావమై రోడ్డుపై పడిపోయాడు. చనిపోయి ఉంటాడని భావించిన దుండగులు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆ రోడ్డుగుండా వెళ్లే ప్రయాణికులు గమనించి డయల్ 100కు సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని 108లో అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బాధితుడు గాదె సిద్ధార్థరెడ్డిది హనుమకొండ అని గుర్తించారు.
మూడు స్టేషన్లలో ఎవరి పరిధి..
ఘటన జరిగిన అమ్మవారిక్రాస్ రోడ్డు మడికొండ, హనుమకొండ సుబేదారి, మిల్స్‌కాలనీ స్టేషన్లలో ఎవరి పరిధికి వస్తుందో తెలియని పరిస్థితి. దీంతో మూడు స్టేషన్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment