
సామాజికవర్గ స్థాయిలో కేసులు పరిష్కారం కావాలి
● వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి
నిర్మలా గీతాంబ
వరంగల్ లీగల్: సామాజికవర్గ స్థాయిలోనే కేసులు పరిష్కారమైతే కుటుంబం, సమాజానికి మేలు కలుగుతుందని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్ బిల్డింగ్‌లో వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీస్‌స్టేషన్లు, కోర్టుల దాకా వివాదాలు తీసుకెళ్తే వ్యక్తుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని, ఇది సమాజానికి హానికరమన్నారు. ఈ విషయంలో సామాజికవర్గాల పెద్దలు పోషించాల్సి న పాత్ర గురించి చర్చించడానికి ఈనెల 15న రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ హనుమకొండకు రానున్నారని తెలిపారు. ఉదయం 9 గంటలకు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని సామాజికవర్గాల కమ్యూనిటీ మీడియేటర్లు హాజరు కావాలని కోరారు. సమావేశంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్‌గౌడ్, ఎం.రమేశ్‌బాబు, వివిధ సామాజిక వర్గాల కమ్యూనిటీ మీడియేటర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment