‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
విద్యారణ్యపురి: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో టెన్త్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శుక్రవారం (నేటి) నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. అందుకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. హనుమకొండ జిల్లాలో అన్ని యాజమాన్యాలు కలిపి 12,010 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 318 పాఠశాలల్లో బాలురు 6,339 మంది, బాలికలు 5,671 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు 67 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 41 ప్రభుత్వ యాజమాన్యాల పరిధి పాఠశాలల్లో, 26 ప్రైవేట్ హైస్కూళ్లలోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 67 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లను, 600 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తారు. ఫిజికల్ సైన్స్, బయాలాజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 9–30 గంటల నుంచి 11 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు నిర్దేశించిన సమయానికి గంట ముందుగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలి. నిర్దేశించిన సమయం ఉదయం 9:30 గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. ఆతర్వాత అనుమతించరు. జవాబులు రాసేందుకు ఈసారి 24 పేజీల బుక్‌లెట్‌ను అందించనున్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్
హనుమకొండ జిల్లాలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించారు. ఎగ్జామ్ సెంటర్ల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేస్తారు. ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్షల సమయంలో ఆర్టీసీ సంస్థ బస్సులను నడుపనుంది. అలాగే.. విద్యుత్ అధికారులు పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు లేకుండా చూస్తారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రతీ పరీక్ష కేంద్రానికి ఒకరు అందుబాటులో ఉంటారు. పరీక్షల కేంద్రాల సీఎస్‌లు విద్యార్థులు తాగునీటి వసతిని కల్పించాల్సి ఉంటుంది. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద బ్యానర్లను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఏ సందేహాలున్నా విద్యాశాఖాధికారుల నంబర్లు అందులో పేర్కొన్నారు.
సీఎస్ గదుల్లో సీసీ కెమెరాల నిఘా
హనుమకొండ జిల్లాలోని 67 పరీక్ష కేంద్రాల్లోని చీఫ్ సూపరింటెండెంట్ గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో ఒక్కో సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలోనే ప్రశ్నపత్రాల బండిళ్లను సీఎస్‌లు విప్పాల్సి ఉంటుంది. అదే నిఘాలో మళ్లీ జవాబుపత్రాల బండిళ్లను సీల్ వేయాల్సి ఉంటుంది. అయితే ప్రహరీ గోడలు లేని జెడ్పీహెచ్‌ఎస్ వేలేరు, జెడ్పీహెచ్‌ఎస్ బాయ్స్ కమలాపూర్, జెడ్పీహెచ్‌ఎస్ దామెర పరీక్ష కేంద్రాల్లో మాత్రం ఒక్కో కేంద్రంలో సీఎస్ గదితో పాటుగా ఆవరణలోనూ ఒక్కో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు.
ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, సిట్టింగ్ స్క్వాడ్లు
హనుమకొండ జిల్లాలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాలో నాలుగు ఫ్లయింగ్ స్వ్కాడ్‌లను నియమించారు. ప్రతీ కేంద్రానికి ఒకరు చొప్పున 67 మందిని సిటింగ్ స్వ్కాడ్లను నియమించారు. సంబందిత జిల్లా అధికారులు కూడా పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారు.
హనుమకొండ జిల్లాలో పరీక్షలకు సంబంధించి విద్యార్థులు 83095 43630 నంబర్‌లో సంప్రదించవచ్చు.
జిల్లాలో పరీక్షలు రాయనున్న 12,010 మంది విద్యార్థులు
67 కేంద్రాలు ఏర్పాటు
వరంగల్ జిల్లాలో 9,237 మంది విద్యార్థులు
49 పరీక్ష కేంద్రాలు
సీఎస్ గదుల్లో సీసీ కెమెరాల నిఘా
నాలుగు బృందాల ఫ్లయింగ్ స్క్వాడ్లు
67 మంది సిట్టింగ్ స్క్వాడ్లు
పకడ్బందీగా నిర్వహిస్తాం..
హనుమకొండ జిల్లాలో ఈనెల 21 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే.. హనుమకొండ డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్లలో సంప్రదించవచ్చు.
– డి.వాసంతి, డీఈఓ, హనుమకొండ
‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment