ఖిలా వరంగల్: రైతులు శాస్త్రసాంకేతిక పద్ధతులు వినియోగించి అధిక రాబడి పొంది ఆర్థికాభివృద్ధి సాధించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ నక్కలపల్లి సమీపంలోని జీఎం కన్వెన్షన్ హాల్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ అధ్యక్షతన మూడురోజులుగా నిర్వహించిన రైతు ఉత్పత్తుల మేళా గురువారం సాయంత్రం ముగిసింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు మంచి విత్తనాలు, తగినంత విద్యుత్ సరఫరా పొందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇలాంటి రైతు ఉత్పత్తుల మేళాలు రైతుల్లో కొత్త అధ్యాయానికి బాటలు వేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని, వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలో నూతన అధ్యాయాన్ని జోడిస్తాయన్నారు. మండలాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు మేళాలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 40కి పైగా ఎఫ్‌పీఓలు, వ్యవసాయ అనుబంధ శాఖలు 10కిపైగా వివిధ స్టాళ్లను ఏర్పాటు చేశారు. రైతులు ఈ స్టాళ్లను ఆసక్తిగా తిలకించి అవసరమైన పరికరాలను కొనుగోలు చేశారు. అనంతరం ఎఫ్‌పీఓలు ఏర్పాటు చేసిన 40 స్టాళ్లలో ప్రతిభ కనబరిచిన స్టాల్ నిర్వాహకులకు కలెక్టర్ ప్రశంస పత్రాలు అందించి అభినందించారు. అలాగే, కలెక్టర్‌ను వ్యవసాయ అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారి (డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్) రమన్‌సింగ్, అసిస్టెంట్ రిజి స్ట్రార్ జగన్మోహన్‌రావు, నాబార్డ్ ఏజీఎం రవి, లీడ్ బ్యాంకు మేనేజర్ రాజు, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రాజన్న, ఇన్‌చార్జ్ ఏడీఏ యాకయ్య, ఏఓ రవీందర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టర్ సత్యశారద
ముగిసిన రాష్ట్ర స్థాయి
రైతు ఉత్పత్తుల మేళా