● కేడీసీ ప్రిన్సిపాల్ రాజారెడ్డి
హన్మకొండ అర్బన్: ప్రకృతిలోని శక్తి వనరుల సంరక్షణతోనే మానవ జాతి పునరాభివృద్ధి చెందుతుందని కాకతీయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాజారెడ్డి అన్నారు. వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాలలో ‘ఇంటర్ డిసిప్లీనరీ మెటీరియల్స్ సైన్స్ ఫర్ సస్టేనబుల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్(ఎన్‌సీఐఎంఎస్‌ఎస్‌ఈఈ–2025)’ అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు గురువారం ముగిసింది. ఈసందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుతూ.. ప్రకృతి వనరులు ఆదా చేస్తూ సహజసిద్ధ వినూత్న మార్గాలను విద్యార్థులు అన్వేషించాలని పిలుపునిచ్చారు. అనంతరం జాతీయ సదస్సులో పాల్గొని పరిశోధన పత్రాలు అందించిన పలువురు పరిశోధనకారులు, విద్యార్థులకు పోస్టర్ ప్రజెంటేషన్ సమర్పించి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అతిథులు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సదస్సులో కేయూ ప్రొఫెసర్ వెంకట్రాంరెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ శంకర్‌నారాయణ, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, కో–కన్వీనర్ కవిత, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ సురేశ్‌బాబు, అకడమిక్ కో–ఆర్డినేటర్ అరుణ, అధ్యాపకులు హెప్సిబా, ప్రవీణ్ కుమార్, పద్మ, సుజాత, మధు, సారంగపాణి, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.