
నార్కొటిక్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ రూపేశ్
వరంగల్: వరంగల్‌లోని నార్కొటిక్ పోలీస్‌స్టేషన్‌ను రాష్ట్ర నార్కొటిక్ బ్యూరో ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సీహెచ్.రూపేశ్ మొదటిసారిగా పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈసందర్భంగా స్టేషన్ సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా, వాడకాన్ని పూర్తిగా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో చర్యలు తీసుకుంటోందని ఈక్రమంలో నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతీ అధికారి బాధ్యతాయుతంగా పని చేయాలని రూపేశ్ సూచించారు. రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల ముప్పు నుంచి రక్షించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డీఎస్పీ కె.సైదులు, ఇన్‌స్పెక్టర్ బి.రవీందర్, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్ బిల్లుల చెల్లింపు సులువు
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ ద్వారా సులువుగా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎస్‌ఈ పి.మధుసూదన్‌రావు, వరంగల్ ఎస్‌ఈ కె.గౌతంరెడ్డి తెలిపారు. ఈయాప్ ద్వారా బిల్లుల చెల్లింపు సులభతరం, సురక్షితం, సౌకర్యవంతమన్నారు. ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని బిల్లులు చెల్లించాలని సూచించారు. ఎన్పీడీసీఎల్ యాప్, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా హనుమకొండ సర్కిల్‌లో 1,32,806 వినియోగదారులు, వరంగల్ సర్కిల్‌లో 63,529 మంది తమ నెల వారీ విద్యుత్ బిల్లులు డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లిస్తున్నట్లు వివరించారు. వినియోగదారులు ఈఅవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.

నార్కొటిక్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ రూపేశ్