
భూభారతితో భూ సమస్యలు పరిష్కారం..
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హన్మకొండ: భూ భారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారమవుతాయని, ఈ చట్టం రైతులకు చుట్టం వంటిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ ఎన్జీఓస్ కాలనీలోని వీఆర్ బాంక్వెట్ హాల్‌లో భూభారతి చట్టంపై హనుమకొండ మండల స్థాయి రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. పలువురు రైతులు తమ సమస్యలను చెప్పుకొచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రైతులు, భూ యజమానులు ఇబ్బందులు పడ్డారని, ఆ ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అందరూ సహకరించాలని కోరారు. కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ భూ సమస్యలను హెల్ప్ డెస్క్‌లో అందజేయవచ్చన్నారు. ఈసందర్భంగా భూ భారతి చట్టం వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ప్రావీణ్య ఆవిష్కరించారు. ఆమెను రైతులు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు.