
విద్యా కార్యక్రమాలు, ప్రగతిపై సమీక్ష
విద్యారణ్యపురి: రాష్ట్ర విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వరంగల్ నగరంలో బుధవారం పర్యటించారు. పలు విద్యాసంస్థలను పరిశీలించిన అనంతరం హనుమకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రావీణ్య, డీఈఓ వాసంతి, విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో అమలవుతున్న విద్యాకార్యక్రమాలు, ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది అధికారులనుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. నాణ్యమైన విద్యను అన్ని సదుపాయాలతో అందించేలా ఓ మోడల్‌గా ‘పబ్లిక్ స్కూల్స్’ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది విద్యాకమిషన్ ప్రతిపాదించిందని, ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ఆ స్కూల్స్ ఎలా ఉంటాయో మోడల్‌గా పలు అంశాలను ఆయన వివరించారు. అధికారులనుంచి అభిప్రాయాలు తీసుకున్నారు.
వసతుల పరిశీలన..
హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీఅండ్‌పీజీ కళాశాల, జూనియర్ కాలేజీలను ఆకునూరు మురళి సందర్శించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు హాస్టల్ వసతి సరిపోవడం లేదని, అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం చరిత్ర విభాగం జాతీయ సదస్సు పరిశోధన పత్రాల ఐఎన్‌ఎస్ ఎన్‌యూ జీసీ కేర్ జర్నల్‌ను మురళీ చేతులమీదుగా ఆవిష్కరించారు. అదేవిధంగా హనుమకొండలోని వడ్డెపల్లిలోని ప్రభుత్వ హైస్కూల్‌ను సందర్శించారు.పేరెంట్, టీచర్స్ మీటింగ్‌లో తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఉపాధ్యాయలు చేసిన ఎస్‌ఏ –2 పరీక్షల జవాబుపత్రాలను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, ఎంఈఓ నెహ్రూ, పింగిలి ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
అధికారులతో సమావేశమైన
విద్యాకమిషన్ చైర్మన్ మురళి
అంతకుముందు పాఠశాల,
కళాశాలల తనిఖీ