
జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఇన్‌చార్జ్ డీన్‌గా వెంకన్న
విద్యారణ్యపురి: హైదరాబాద్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు యూనివర్సిటీలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ డైరెక్టర్, చిత్రవాణి స్టూడియో ఇన్‌చార్జ్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గడ్డం వెంకన్నను వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఇన్‌చార్జ్ డీన్‌గా (పీఠాధిపతి)నియమించారు. ఈ మేరకు అక్కడినుంచి బదిలీ చేస్తూ గురువారం ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో వెంకన్న అక్కడే రిజిస్ట్రార్ కె.హనుమంతురావుకు జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. ఈనెల 25నుంచి వరంగల్‌లో గిరిజన విజ్ఞాన పీఠంలో విధులను నిర్వర్తించనున్నారు. వరంగల్ గిరిజన విజ్ఞాన పీఠాధిపతిగా ఇప్పటివరకు బాధ్యతలను నిర్వర్తించిన ప్రొఫెసర్ బాబురావును శ్రీశైలంలోని చరిత్ర, సాంస్కృతిక పురావస్తు శాస్త్ర పీఠాధిపతిగా బదిలీ చేస్తూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు.