
ఆక్రమణల నియంత్రణకు ముళ్లకంచెలు
● బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
● ఎల్లాపూర్ నర్సరీ ఆకస్మికంగా తనిఖీ
వరంగల్: నగర పరిధిలోని గ్రీన్‌ల్యాండ్స్ ఆక్రమణల నియంత్రణకు ఇనుప ముళ్లకంచెలు ఏర్పాటు చేయాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. బల్దియా పరిధిలోని హసన్‌పర్తి ఎల్లాపూర్‌లోని జీడబ్ల్యూఎంసీ నిర్వహిస్తున్న నర్సరీని కమిషనర్ గురువారం సందర్శించారు. నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు చేశారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వన మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని నగర పరిధిలోని 12 నర్సరీల్లో 10 లక్షల మొక్కలను లక్ష్యంగా పెట్టుకొని పెంచుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా పండ్లు, పూల మొక్కలను పెంచేలా ఆదేశించామన్నారు. ఎండలు గరిష్ట ఉష్ణోగ్రతలను చేరుతున్న క్రమంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు దఫాలుగా నీటిని అందించి మొక్కలను ఎండిపోకుండా కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. నగర పరిధిలోని గ్రీన్ ల్యాండ్స్ ఆక్రమణలకు గురికాకుండా టౌన్ ప్లానింగ్, హార్టికల్చర్, ఇంజనీరింగ్ విభాగాలు సమన్వయం చేసుకుంటూ వాటి చుట్టూ ముళ్ళకంచెను (ఇనుముతో చేసిన) ఏర్పాటు చేసి సంరక్షించాలని కమిషనర్ అన్నారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి రమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వేసవి తీవ్రతతో మార్కెట్ వేళల్లో మార్పు
● 30వ తేదీ నుంచి ప్రతి బుధవారం బంద్
వరంగల్: వేసవి ఎండల తీవ్రత పెరగడంతో వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహించే బీటు సమయాల్లో మార్పులు చేసినట్లు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28(సోమవారం నుంచి 11జూన్ తేది వరకు) మిర్చి బీటు ఉదయం 7–05 గంటలకు, పత్తి బీటు ఉదయం 8–05గంటలకు, పల్లికాయ ఉదయం 8–15, పసుపు బీటు 8–30లకు, అపరాలు, ధాన్యం బీటు ఉదయం 8–45 గంటలకు ఉంటుందని తెలిపారు. వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వరంగల్ గ్రేయిన్ మార్కెట్ గుమస్తా సంఘం కోరిక మేరకు 30–04–2025 బుధవారం నుంచి 11–06–2025 బుధవారం వరకు వచ్చే ప్రతి బుధవారం మార్కెట్ యార్డ్‌కు సెలవు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మార్పులను రైతులు, అడ్తి వ్యాపారులు, మార్కెట్ సిబ్బంది, కార్మికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

ఆక్రమణల నియంత్రణకు ముళ్లకంచెలు