గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విధ్యాధికులే. కూలీ, వ్యవసాయ నేపథ్యంగల వారి కుటుంబాలను కదిలిస్తే ప్రతిఒక్కరిదీ వ్యథాభరిత కన్నీటి గాథే. ముదిమి వయసులో చేతికి అందివస్తారనే గంపెడు ఆశతో కాయకష్టం చేసి ఉన్నత చదువులు చదివించి నగరానికి పంపిస్తే విగత జీవులుగా తిరిగి వచ్చారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పొలం దున్ని, కూలీ పనులు చేసి, అప్పు చేసి లక్షలాది రూపాయలు పెట్టుబడిపెట్టి ‘క్యూ నెట్’ వలలో చిక్కుకున్నామంటూ బోరుమన్నారు.
తమ పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుకున్న క్యూ నెట్ సంస్థ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని, వసూలు చేసిన సొమ్మును వడ్డీతో చెల్లించేలా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వం తమను అన్నివిధాల ఆదుకోవాలని అభ్యర్ధించారు. సికింద్రాబాద్ గాంధీమార్చురీ వద్ద మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ‘సాక్షి’తో మాట్లాడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిన తమ పిల్లల జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
రెండు రోజుల్లో స్నేహితురాలి పెళ్లికి వస్తానంది..
రెండు రోజుల్లో జరిగే తన స్నేహితురాలి పెళ్లికి తప్పకుండా ఊరికి వస్తానని మాటిచ్చిన నా బిడ్డ, అందనంత దూరాలకు వెళ్లిపోయిందని మృతురాలు వెన్నెల తల్లితండ్రులు రవి, లక్ష్మిలు బోరుమన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మర్పల్లికి చెందిన వెన్నెల (22) ఏడాదిన్నర క్రితం నగరానికి వచ్చింది. క్యూనెట్ సంస్థలో చేరి రూ.1.50 లక్షలు చెల్లించింది. హాస్టల్ ఖర్చులకు తామే డబ్బు పంపించామని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
రాత్రికి ఫోన్ చేస్తా అమ్మా అన్నడు
గురువారం మధ్యాహ్నం 4 గంటలకు ఫోన్ చేశాడు. ఆఫీసు పని అయ్యాక రాత్రికి ఫోన్ చేస్తా అన్నాడు..ఇప్పటికీ వాడి మాటలు గింగిర్లు తిరుగుతూనే ఉన్నాయంటూ మృతుడు అమరాజు ప్రశాంత్ (23) తల్లిదండ్రులు ఉపేంద్రమ్మ, జనార్ధన్‌లు కన్నీటి పర్యంతమయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికెన్నె గ్రామానికి చెందిన వీరు వ్యవసాయకూలీలు. ఏడాది క్రితం నగరానికి వచ్చిన ప్రశాంత్ క్యూనెట్ సంస్థలో టీం లీడరుగా పనిచేస్తున్నాడు.
డబ్బు సంపాదించి మీ కష్టాలు తీరుస్తా అన్నది...
ఎంతో కష్టపడి, అప్పు చేసి మమ్మల్ని చదివించారు. ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి మిమ్మల్ని సుఖపెట్టాలి..మీ కష్టాలు తీర్చాలి. అదే నా కోరిక అంటూ చెప్పిన త్రివేణి (22) విగతజీవిగా మారిందంటూ హృదయవిదారకంగా రోదించారు తల్లితండ్రులు రామారావు, రమ, సోదరి మమతలు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లికి చెందిన త్రివేణి రూ.3 లక్షలు చెల్లించి క్యూనెట్ సంస్థలో చేరింది.
మిమ్మల్ని ఇక్కడికే షిఫ్ట్ చేస్తా అన్నడు
మరో ఏడాదిలో బీటెక్ పూర్తవుతుంది, మంచి జాబ్‌లో సెటిల్ అవుతా, మీఅందరినీ ఇక్కడికే షిఫ్ట్ చేస్తా అని చెప్పిన నా బిడ్డ శివ (22)ను ఇక్కడే విగతజీవిగా చూస్తామని కలలో కూడా అనుకోలేదని తల్లితండ్రులు రాజు, రజితలు విలపించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రాయిపల్లికి చెందిన వీరు వ్యవసాయ కూలీలు. రూ.1.60 లక్షలు అప్పుచేసి క్యూనెట్ సంస్థలో శివను చేర్పించారు.
భవన నిర్మాణంపై నివేదిక కోరిన జీహెచ్‌ఎంసీ
స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం నేపథ్యంలో బహుళ అంతస్తుల భవన సముదాయం నిర్మాణ స్థిరత్వాన్ని పరిశీలించి నివేదిక అందజేయాలని జేఎన్‌టీయూ హెచ్‌కు జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది. అప్పటివరకు భవన సముదాయం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ వెల్లడించారు. అదేవిధంగా రక్షణ చర్యలు పరిశీలించి అగ్నిమాపక సేవల విభాగం చర్యలు చేపడుతుందని, జీహెచ్‌ఎంసీతో సమన్వయంగా పనిచేస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment