నాలా మరణాలు.. ఇంకెన్నాళ్లు? | - | Sakshi
Sakshi News home page

నాలా మరణాలు.. ఇంకెన్నాళ్లు?

Published Sun, Apr 30 2023 8:42 AM | Last Updated on Sun, Apr 30 2023 8:54 AM

- - Sakshi

హైదరాబాద్: విశ్వనగరం.. ఆకాశమార్గాలు.. ఫ్లైఓవర్లు.. ఎలివేటెడ్‌ కారిడార్లు.. ఎక్స్‌ప్రెస్‌వేలు.. అండర్‌పాస్‌లతో ఘనత చాటుకుంటున్న ప్రభుత్వం ‘నాలా మరణాలను’ మాత్రం నిలువరించలేకపోతోంది. జీహెచ్‌ఎంసీ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా మరో పసిప్రాణం నాలాకు బలైపోయింది. పాల కోసం వెళ్తూ చిన్నారి నాలాలో పడి మత్యువాత పడటానికి కారణం జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యమేనని వెల్లడైంది. నాలాల్లో మరణాలు జరగరాదని గత రెండేళ్లుగా మంత్రి కేటీఆర్‌ తీవ్ర హెచ్చరికలు చేస్తూ.. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నా ఘోరం జరిగిపోయింది.

గత వర్షాకాలం నాలా మరణాలు లేవనుకుంటుండగానే ఈసారి వానాకాలం రాకముందే వేసవిలోనే అయినా నాలాలో పసిప్రాణం బలైపోయింది. దీనికి పూర్తి బాధ్యత జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డులదేనని చెప్పక తప్పదు. వీడీసీసీ రోడ్డు కోసం జీహెచ్‌ఎంసీ ఉన్న రోడ్డును తవ్వి పనులు చేపట్టింది. డ్రైనేజీ లైన్‌ వేయడంలో వాటర్‌బోర్డు జాప్యం చేసింది. పనుల ప్రాంతంలో గుంతను పట్టించుకోలేదు. పనులు జరిగే ప్రాంతాల్లో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, ఏర్పాటు చేయాల్సిన సైనేజీలు వంటివి పూర్తిగా గాలికొదిలేశారు.

వికేంద్రీకరణ ఇందుకేనా?
ఎక్కడైనా అధికార వికేంద్రీకరణ సత్ఫలితాలిస్తుంది. జీహెచ్‌ఎంసీలో మాత్రం అది వ్యతిరేక ఫలితాలిస్తోంది. జీహెచ్‌ఎంసీలో జోన్లకు విస్తృతాధికారాలిచ్చారు. కమిషనర్‌ తనకున్న అధికారాలను కూడా జోన్లకు ధారాదత్తం చేశారు. దాంతో ఇక జోన్ల వారు ఆడిందిఆటగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో పనుల తీరును పరిశీలిస్తున్న వారే లేకుండాపోయారు. ప్రధాన కార్యాలయ అధికారులు తనిఖీలు చేస్తారన్న భయం లేదు. జోన్లలోని దిగువస్థాయి అధికారులు, సిబ్బంది సైతం పనుల కంటే పైఆదాయానికే శ్రద్ధ చూపుతున్నారని గత మూడేళ్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వ పెద్దలు సైతం పట్టించుకున్న పాపాన పోలేదు.

► సర్కిళ్లు, జోన్లలోనే మంజూరు నుంచి పూర్తయ్యే వరకు పనులు జరుగుతుండటంతో ఉన్నతాధికారులను పట్టించుకోవడం మానేశారు. కమిషనర్‌, మేయర్‌ క్షేత్రస్థాయి పర్యటనల్లేవు. నిర్లక్ష్యం వహిస్తున్నవారిని పట్టించుకుంటున్నవారు లేరు. నిర్లక్ష్యం కారణంగానే బాలిక అసువులు బాసింది. దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రం పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తూతూమంత్రపు ప్రకటనలు చేయడం.. చర్యల్లో భాగంగా దిగువస్థాయి వారిని సస్పెండ్‌ చేయడం వంటి మొక్కుబడి చర్యలు తప్ప కఠిన వైఖరి లేకపోవడంతో పెద్దగా పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులను బాధ్యులను చేయడం లేదు. నాలుగురోజులు గడవగానే పరిస్థితులు మళ్లీ మొదటికొస్తున్నాయి.

ఏఈ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌
కళాసిగూడ నాలాలో బాలిక మృతి చెందిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బాధ్యులైన ఇద్దరు అధికారులపై వేటు వేసింది. రోడ్డు పనుల సందర్భంగా సరైన భద్రత చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారంటూ సంబంధిత బేగంపేట సర్కిల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఎం.తిరుమలయ్య, ఔట్‌సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.ఎం. హరికృష్ణలను సస్పెన్షన్‌ చేసింది. ఈమేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

దుర్ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా ఖైరతాబాద్‌ సర్కిల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఆర్‌. ఇందిరాబాయిని నియమించారు. పది రోజుల్లోగా విచారణ నివేదికను అందజేయాలని ఆదేశించారు. పనులు జరుగుతున్న ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేయకుండా, డైవర్షన్‌ సూచికలు లేకుండా నిర్లక్ష్యం వహించడంతో సస్పెన్షన్‌ చేసినట్లు పేర్కొన్నారు. పనుల్లో నిర్లక్ష్యమే బాలిక మరణానికి కారణమైందని పేర్కొన్నారు.

ఎక్కడ.. ఎలా..? వాన బీభత్సం ఇలా..
లింగంపల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జి కిందికి భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సు అండర్‌ బ్రిడ్జి కింద వరదలో నిలిచిపోయింది.

►చందానగర్‌ జాతీయ రహదారిపై వరద నీరు సాఫీగా ప్రవహించకపోవడంతో పక్కనే ఉన్న సెల్లార్‌లోకి చేరడంతో దుకాణాలు పూర్తిగా మునిగిపోయాయి. దాదాపు రూ.35 లక్షల విలువైన సరుకులు తడిసి ముద్దగా మారాయి.

► మణికొండ పంచవటి కాలనీలో రిటర్నింగ్‌ వాల్‌ లేని చోట పందెన్‌వాగు ఒక్కసారిగా పొంగటంతో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌ల సెల్లార్లలోకి నీరు చేరింది.

► కీసర– భోగారం ప్రధాన రహదారిలో చెట్ల కొమ్మలు విరిగిపడటంతో పంచాయతీ సిబ్బంది, పోలీసులు జేసీబీ సహాయంతో తొలగించారు.

► గౌతంనగర్‌ డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు చేరి చెరువును తలపించాయి. వర్షం వచ్చిన ప్రతిసారి నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

► గోల్కొండలోని టోలిచౌకి, నదీమ్‌ కాలమీ, గోల్కొండ హీరాఖానా తదితర ప్రాంతాలలో రోడ్లపై వరదనీరు ప్రవహించింది.

►నాచారం డివిజన్‌ పరిధిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి ప్రాంగణంలో నీరు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులకు గురయ్యారు. బాబానగర్‌, వీఎస్‌టీ కాలనీ, అంబేడ్కర్‌నగర్‌, ఎర్రకుంట, రాఘవేంద్రనగర్‌, ఇందిరానగర్‌,వీరారెడ్డినగర్‌లో వరద నీటితో ఇబ్బదులు పడ్డారు.

► బోడుప్పల్‌లోని సాయి భవానీనగర్‌ కాలనీని వరద నీరు ముంచెత్తింది.

► ముషీరాబాద్‌ డివిజన్‌ అడిక్‌మెట్‌ డివిజన్‌ పద్మా కాలనీ నాలాపై పార్కు చేసిన సుమారు 30 వాహనాలకు పైగా వరదలో అచ్చయ్యనగర్‌ వరకు కొట్టుకువచ్చాయి. వీటిని జీహెచ్‌ఎంసీ రెస్క్యూ టీమ్‌ రెండు భారీ క్రేన్‌ల సహాయంతో వాహనాలను బయటకు తీశారు. నడుములోతు మేర నీరు ప్రవహించడంతో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర అవస్థల పాలయ్యారు. వరద ఉద్ధృత్తికి పలు ఇళ్ల గోడలు కూలిపోయాయి.

► బేగంపేట్‌ నాలా పరీవాహక ప్రాంతాలు నీట మునిగాయి. అల్లంతోటబావి జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. బస్తీ రోడ్లను కాల్వలను తలపించాయి.

► తార్నాక డివిజన్‌ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మ్యాన్‌ హోళ్లు, ఓపెన్‌ నాలాలు పొంగిపొర్లాయి. రోడ్లు, రహదారులపై బురద పేరుకుపోయింది. లాలాపేట సత్యానగర్‌, ఇందిరానగర్‌, చంద్రబాబునగర్‌, శ్రీపురి కాలనీ, వినోభానగర్‌ తదితర బస్తీల్లోన్ని రోడ్లపై భారీగా వర్షం నీరు చేరింది. సత్యానగర్‌ కమ్యునిటీ హాల్‌ సమీపంలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement