హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని ఒక పుణ్యక్షేత్రం తరహాలో తీర్చదిద్దామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎల్లమ్మ కల్యాణం నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఆలయానికి వచ్చిన ఆయన వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అమ్మవారి హుండీల ఆదాయం సంవత్సరానికి రూ.4 కోట్లు ఉండేదని, ఇప్పుడు రూ.22 కోట్లకు చేరిందన్నారు.
ఎల్లమ్మ కల్యాణానికి తమ కుంటుంబం తరఫున పుస్తె మెట్టెలు, తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఈఓ అన్నపూర్ణ, చైర్మన్ సాయిబాబా గౌడ్, ఇన్‌స్పెక్టర్ సైదులు, ట్రాఫిక్ సీఐ సురేష్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
భక్తి శ్రద్ధలతో కల్యాణ మహోత్సవాలు ప్రారంభం
భక్తుల కొంగు బంగారమైన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, దేవాతాహ్వానం, అంకురార్పణం, పుట్ట బంగారం, గంగతెప్ప వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ బద్ధంగా ఎదుర్కోళ్లు జరిగాయి.
నేటి ఉదయం 11.55 గంటలకు అమ్మవారి కల్యాణం
పునర్వసు నక్షత్ర యుక్త అభిజిత్ లగ్న సుముహుర్తాన మంగళవారం ఉదయం 11.55 గంటలకు అమ్మవారి కల్యాణోత్సవం జరగనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్.అన్నపూర్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment