హైదరాబాద్: తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో డబ్బులిచ్చిన వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన కేసులో నింధితులను c పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఘట్‌కేసర్ పీఎస్‌లో మల్కాజ్‌గిరి డీసీపీ జానకీ, ఏసీపీ నరేశ్‌రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. మేడిపల్లి, బుద్దానగర్‌కు చెందిన అవినాశ్‌రెడ్డికి అదే ప్రాంతంలో ఉంటున్న అరోషికారెడ్డితో 2015 నుంచి పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో పలుమార్లు ఆమె అతడి నుంచి డబ్బులు అప్పుగా తీసుకుంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని అవినాశ్‌రెడ్డి కోరగా పెళ్లి చేసుకుంటానని చెప్పిన అరోషికారెడ్డి ఈ విషయమై అతడి కుటుంబ సభ్యులతో కూడా చర్చించింది.
అయితే 2018లో ఆమె పొరుగున ఉన్న చక్రధర్‌గౌడ్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే అవినాశ్‌రెడ్డి వద్ద రూ. 25 లక్షలు చేతిరుణం తీసుకున్న ఆమె 2023లో రూ. 9 లక్షలు తిరిగి ఇచ్చేసింది. 20 రోజులుగా మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అవినాశ్‌రెడ్డి ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో తన భార్య తీసుకున్న డబ్బును ఇచ్చేస్తానని చక్రధర్‌గౌడ్ అవినాశ్‌రెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు. ఆదివారం ఘట్‌కేసర్ బైపాస్ రోడ్డులో జాతీయ రహదారి సమీపంలోని వందన హోటల్ వద్దకు రావాలని సూచించాడు. మేడ్చల్ ఇందిరానగర్‌కు చెందిన ఎలిగేటి నర్సింగ్‌రావ్, సికింద్రాబాద్‌కు చెందిన బౌత్ వినోద్, అడిక్‌మెట్‌కు చెందిన మామిళ్ల గౌతమ్‌రాజ్ కూడా అక్కడికి వచ్చారు.
చక్రధర్ గౌడ్, అవినాశ్ రెడ్డి కారులో కూర్చుని మాట్లాడుకుంటుండగా కారులోకి వచ్చిన మిగతా ముగ్గురు అవినాశ్‌రెడ్డిపై దాడి చేసి అతడి మొబైల్ లాక్కొని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. వారి నుంచి తప్పించుకున్న అవినాశ్‌రెడ్డి ఘట్‌కేస్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
కాగా ప్రధాన నిందితుడు చక్రధర్‌గౌడ్‌కు చెర్లపల్లి జైలులో నర్సింగరావుతో పరిచయం ఏర్పడింది. నర్సింగరావును బెయిల్‌పై బయటికి తీసుకువచ్చేందుకు చక్రధర్ సహకరించినట్లు పోలీసులు తెలిపారు. చక్రధర్‌గౌడ్‌పై సైబరాబాద్, హైదరాబాద్ కమిషనేరేట్లలో 9 కేసులు ఉండగా, నర్సింగ్‌రావు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. గంటల వ్యవధిలో కేసును చేధించిన సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సైలు సుధాకర్, అశోక్, శ్రీకాంత్, ఇతర సిబ్బందిని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ అభినందించారు.
నిందితుల అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment