రేపు బక్రీద్‌ సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లింపులు | - | Sakshi
Sakshi News home page

రేపు బక్రీద్‌ సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లింపులు

Jun 28 2023 6:54 AM | Updated on Jun 28 2023 6:51 AM

- - Sakshi

హైదరాబాద్: బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని ఈనెల 29న మీరాలం ఈద్గాలో నిర్వహించనున్న సామూహిక ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలో ట్రాఫిక్‌ నిబంధనలు అమలులో ఉంటాయని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మీరాలం ఈద్గా వైపు వచ్చే వాహనాలను ప్రార్థనలు ముగిసేంత వరకు దారి మళ్లించనున్నట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. పురానాపూల్‌, కామాటిపురా, కిషన్‌బాగ్‌ నుంచి ప్రార్థనల కోసం మీరాలం ఈద్గాకు వచ్చే వాహనాలను బహదూర్‌ఫురా ఎక్స్‌ రోడ్డు మీదుగా అనుమతిస్తామన్నారు. వీరు తమ వాహనాలను జూపార్కు ప్రాంతం, ఓపెన్‌ స్పేస్‌ ఎదురుగా మసీదు అల్లాహో అక్బర్‌ వద్ద పార్క్‌ చేయాలన్నారు.

ఈ సమయంలో సాధారణ వాహనాల రాకపోకలు అనుమతి ఉండదన్నారు. వీరిని బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు వద్ద కిషన్‌బాగ్‌, కామాటిపురా, పురానాపూల్‌ వైపు దారి మళ్లించనున్నారు. శివరాంపల్లి, దానమ్మ హట్స్‌ నుంచి ప్రార్థనల కోసం వచ్చే వాహనాలను దాన్నమ్మ హట్స్‌ ఎక్స్‌ రోడ్డు మీదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతిస్తారు. వీరు తమ వాహనాలను ఈద్గా ప్రధాన రహదారి ముందు, మోడ్రన్‌ సా మిల్‌ పార్కింగ్‌తో పాటు మీరాలం ఫిల్టర్‌ బెడ్‌, మీరాలం బెడ్‌ పక్కన ఖాళీ స్థలం, సూఫీ కార్లు (నాలుగు చక్రాల వాహనాల కోసం), యాదవ్‌ పార్కింగ్‌ (నాలుగు చక్రాల వాహనాలకు) పక్కన పార్క్‌ చేయాలన్నారు. ఈ సమయంలో సాధారణ వాహనాల రాకపోకలను ఈద్గా వైపు అనుమతించమన్నారు.

వీరిని దానమ్మ హట్స్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద శాస్త్రిపురం, నవాబ్‌సాబ్‌కుంట తదితర ప్రాంతాల నుంచి దారి మళ్లించనున్నట్లు తెలిపారు. కాలాపత్తర్‌, మీరాలం ట్యాంక్‌ వైపు నుంచి వాహనాలను కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌ (లా అండ్‌ ఆర్డర్‌) మీదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతించమన్నారు. వీరు తమ వాహనాలను భయ్యా పార్కింగ్‌, ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద వాహనాలను పార్క్‌ చేయాలన్నారు. ఈ సమయంలో సాధారణ వాహనాలను కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌ (లా అండ్‌ ఆర్డర్‌) వద్ద మోచీ కాలనీ, బహదూర్‌పురా, షంషీర్‌గంజ్‌, నవాబ్‌సాబ్‌కుంట వైపు మళ్లిస్తారు.

పురానాపూల్‌, బహదూర్‌పురా వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు భారీ వాహనాలను పురానాపూల్‌ దర్వాజా వద్ద జియగూడ, సిటీ కాలేజీ వైపు దారి మళ్లించనున్నారన్నారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే ఆర్టీసీ బస్సులతో సహా భారీ వాహనాలను ఆరాంఘర్‌ జంక్షన్‌ వద్ద శంషాబాద్‌ లేదా రాజేంద్రనగర్‌ లేదా మైలార్‌దేవ్‌పల్లి వైపు దారి మళ్లిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనదారులు ట్రాఫిక్‌ హెల్ఫ్‌లైన్‌ నంబర్‌ 9010203626లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement