హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఐటీ సంస్థల్లో వివిధ విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల కోసం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ లేడీస్ స్పెషల్ బస్సులను ప్రవేశపెట్టింది. జేఎన్‌టీయూ నుంచి వేవ్‌రాక్ వరకు లేడీస్ స్పెషల్ బస్సును ఆర్టీసీ అధికారులు సోమవారం ప్రారంభించారు. దశలవారీగా, ప్రయాణికుల రద్దీకనుగుణంగా మరిన్ని బస్సులను నడుపనున్నట్లు సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ ఖాన్ తెలిపారు. ఈ బస్సు ఉదయం 9 గంటలకు జేఎన్‌టీయూ నుంచి వేవ్‌రాక్‌కు బయలుదేరుతుంది.
తిరిగి విధులు ముగిసిన తరువాత సాయంత్రం 5 గంటలకు వేవ్‌రాక్ నుంచి జేఎన్‌టీయూకు లేడీస్ స్పెషల్ బస్సులను నడుపుతారు. ఐటీ సంస్థల్లో పనిచేసే సాంకేతిక ఉద్యోగులే కాకుండా హౌస్‌కీపింగ్ వంటి సర్వీస్ రంగంలో పనిచేసే మహిళలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు. జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, మియాపూర్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల నుంచి ప్రయాణికుల రాకపోకలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులతో జేఎన్‌టీయూ వద్ద రద్దీ నెలకొంటుంది. దీంతో మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లేడీస్ స్పెషల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఒక బస్సును ఏర్పాటు చేశారు. మొదటి రోజే మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చినట్లు అధికారులు తెలిపారు. మహిళా ప్రయాణికుల డిమాండ్ మేరకు మరిన్ని బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఐటీ కారిడార్‌లకు ఎలక్ట్రిక్ బస్సులు...
నగరంలోని వివిధ మార్గాల నుంచి ఐటీ కారిడార్‌లకు త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. నగరానికి వచ్చే మొదటి విడత 20 ఎలక్ట్రిక్ బస్సులలో కొన్నింటిని వివిధ మార్గాల నుంచి ఐటీ కేంద్రాలకు నడిపే అవకాశం ఉంది. అలాగే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వివిధ రూట్‌లలో 40 ఏసీ బస్సులు ఎయిర్‌పోర్టుకు నడుస్తున్నాయి. ప్రతి రోజు 5000 మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికుల డిమాండ్ ఉన్న రూట్‌లలో అదనపు బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment