హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం ఓ ఉద్యమాల పురిటిగడ్డ. సమాజంలో ఎక్కడ ఏ మూలన అన్యాయం జరిగినా గొంత్తెత్తేందుకు నేనున్నానని సిద్ధంగా ఉంటుంది ధర్నా చౌక్. ఏ ఘోరం జరిగినా తమ గోసను వినిపించేందుకు ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఇక్కడిదే. ఎవరు విన్నా..వినకున్నా నేనున్నానని చెప్పే అంబేడ్కర్ విగ్రహం...వీటన్నిటి మధ్యన ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీసేందుకు ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఇలాంటి ఉద్యమ వేదికలపై తన 40 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ప్రజాగాయకుడు గద్దర్ వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.
కాళ్లకు గజ్జె కట్టారు. గళం విప్పారు. గోచి, గొంగలి కట్టి సమాజానికి పరిచయం చేశారు. ‘హా..హూ.. హా’ అంటూ తను గళం విప్పితే..అక్కడకి వచ్చిన వేలాది మంది సైతం తమ గళంతో కోరస్ పాడాల్సిందే. ‘బండెనుక బండి కట్టి... పదహారు బండ్లు కట్టి’ అంటూ నిజాం నవాబు రాచరికంపై విప్పిన గళం నేటి వరకు వరదలా, ఉప్పెనలా కొనసాగుతూనే ఉంది. ఆ గళం వెంట వచ్చిన వేలాది పాటలు అటు విప్లవ కారులనే కాకుండా సామాన్య ప్రజానీకాన్ని సైతం తట్టిలేపాయి. అన్ని వర్గాల ప్రజలను చేరాయి.
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఈ ఉద్యమ వేదికల ద్వారా గద్దర్ పాటలను వినని వారు లేరంటే అతియోశక్తి కాదు. తెలంగాణ మొదటి దశ, రెండవ దశ ఉద్యమం సందర్భంగా ఇక్కడ జరిగిన అనేక ఉద్యమాలతో మమేకం కావడమే కాకుండా విప్లవ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక సేవా సంస్థలు, దళిత సంఘాలు నిర్వహించిన అనేక ఉద్యమాల్లో, సభలు, సమావేశాల్లో ఆయన పాల్గొని ప్రజలను చైతన్య వంతులను చేశారు.
గద్దర్ పాటలతో దద్దరిల్లిన సభలు
► ప్రజా యుద్ధనౌక గద్దర్ ఏ సభలో పాల్గొన్నా జనం లక్షలాదిగా తరలివచ్చేవారు. ఆయన పాటలతో సభలు హోరెత్తేవి. 1990లో అప్పటి పీపుల్స్‌వార్ ప్రస్తుత మావోయిస్టు పార్టీపైన ప్రభుత్వం నిషేధం ఎత్తివేసిన సందర్భంగా నిజాం కళాశాల మైదానంలో ఆ పార్టీ భారీ బహిరంగసభను ఏర్పాటు చేసింది. ఈ సభకు 2 లక్షల మందికి పైగా జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా గద్దర్ వేదికపైకి జననాట్యమండలి బృందంతో కలిసి ఆట, పాటలతో ఉర్రూతలూగించాడు. గద్దర్ పాడిన విప్లవగీతాలతో ఆ సభ దద్దరిల్లింది.
► ఆ తరువాత 2004లో పీపుల్స్‌వార్‌ను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిన సందర్భంగా కూడా నిషే ధం ఎత్తివేశారు. ఆ సమయంలో ఫీర్జాదిగూడలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సైతం జనం లక్షలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పాటకు, దరువుకు, ఆదివాసీ కళలు, కళారూపాలకు, ప్రజా విప్లవోద్యమాలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తూ గద్దర్ గజ్జెకట్టి పాడాడు. ఆయన పాటలతో జనం ఉత్తేజభరితులయ్యారు.
గద్దర్ పాటలకు అనేకసార్లు డప్పు కొట్టాను
విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా జరిగిన మహా ఉద్యమం సందర్భంగా మొదటిసారి గద్దర్‌ను చూసి స్ఫూర్తి పొందాను. ఆ తర్వాత గద్దర్ ముషీరాబాద్ వచ్చిన అనేక సందర్భాల్లో ఆయన వెంట ఉంటూ ఆయన పాడే పాటలకు కోరస్‌తో పాటు డప్పు కొట్టాను. అనేక మంది కళాకారులను ఆయన ప్రొత్సహించిన తీరు అద్భుతం. అందరి కళాకారుల కంటే గద్దర్ ఒక విలక్షణమైన ప్రపంచ ఖ్యాంతిగాంచిన కాళాకారుడు. అటువంటి గద్దర్ అకాల మృతి మాలాంటి కళాకారులను ఎందరినో దుఖ:సాగరంలో ముంచింది.
– జిల్లా నగేష్, డప్పు కళాకారుడు
Comments
Please login to add a commentAdd a comment