హైదరాబాద్: ఉప్పల్ శాసనసభ్యుడు గులాబీ అధినాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయనున్నారా? టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన ప్రత్యర్థి పార్టీలో చేరనున్నారా? అంటే తాజా పరిణామాలను గమనిస్తే ఔననే అనిపిస్తోంది. గులాబీ బాస్‌కు సన్నిహితుడిగా పేరున్న సుభాష్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ను నిరాకరించిన బీఆర్‌ఎస్ అధిష్టానం..ఆయన స్థానంలో బండారి లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.
హైకమాండ్ నిర్ణయంతో నారాజ్ అయిన బేతి...పార్టీ నాయకత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజులుగా సన్నిహితులతో మంతనాలు జరిపిన ఆయన మంగళవారం ముఖ్యనేతలు, కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. రాజకీయ భవిష్యత్తుపై అధిష్టానం నుంచి స్పష్టమైన హామీవస్తే పార్టీలో కొనసాగాలని..లేనిపక్షంలో వేరే దారి చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం నిర్వహించే సమావేశంపై ఆసక్తి నెలకొంది.
కేసీఆర్‌కు అండగా..
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి కేసీఆర్ అండగా నిలిచిన ఆయన తాజా పరిణామాలతో కినుక వహించారు. టికెట్ ఇవ్వకపోగా కనీసం తనను పిలిచి మాట్లాడకపోవడంపై ఆయన ఒకింత నొచ్చుకున్నట్లు అనుచరవర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుండగా బేతి సుభాష్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు..ఈ మేరకు ఓ జాతీయ పార్టీ అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తన నివాసంలో కార్యకర్తలు, అనుచరులు, ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన వెల్లడించే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment