‘జమునా రమణ’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వెంకయ్యనాయుడు తదితరులు
బంజారాహిల్స్: అందం, అభిమానం అభినయం, అభిజాత్యం కలిగిన సాటిలేని గొప్ప నటి జమున అని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ప్రముఖ రంగస్థల, సినీ నటుడు డా.అక్కిరాజు సుందర రామకృష్ణ రచించిన కంద పద్య సంపుటి ‘జమునా రమణ’ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించి ప్రసంగించారు. ‘ఆకృతి’ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..కంద పద్యం తెలుగు వారికి చాలా ఇష్టమైన పద్య ప్రక్రియ అన్నారు.
ఓ సినీ నటి మీద పద్య శృతి రావడం ప్రశంసనీయం అన్నారు. జమున అందంతో పాటు నటనతో ఇతర నటులతో పోటీపడేవారన్నారు. సభకు అధ్యక్షత వహించిన సినీ పాత్రకేయుడు ఇమంది రామారావు మాట్లాడుతూ జమున అందంతో పాటు అభినయంలో కూడా దిట్ట అన్నారు. ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్‌టీ రామారావులతో కలిసి పలు చిత్రాల్లో పోటీ పడి నటించారన్నారు.
అంతే కాదు ఎందరో పేద కళాకారులకు ఆమె జీవన భృతి కల్పించారని ప్రశంసించారు. నిర్మాత అనూరాధా దేవి మాట్లాడుతూ.. సినీ రంగంలో మేటి అయినా రంగస్థలం మీద నటించడం ఎంతో విశేషమన్నారు. జమున కుమార్తె స్రవంతి తన తల్లి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఫిక్కీ సీఎండీ అచ్యుత జగదీశ్ చంద్ర, ఆకృతి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment