
సాక్షి, హైదరాబాద్: ఎన్ని సంస్కరణలు తెచ్చినా..ఎన్నిమార్లు సవరణలు చేసినా..ఎంత మంది ఫిర్యాదులు చేసినా ఓటరు లిస్టులో మాత్రం తప్పుల్ని నివారించలేకపోతున్నారు. ప్రతిసారీ తప్పుల తడకగానే దర్శనమిస్తోంది. గ్రేటర్ పరిధిలోని ఏ నియోజకవర్గం ఓటురు లిస్టు చూసినా కళ్లు బైర్లుకమ్మే విషయాలే బయటపడుతున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం మరణించిన వారి పేర్లు కూడా ఇప్పటికీ ఓటరు లిస్టులో యథాతథంగా ఉన్నాయి. అంతే కాదు ఒక నియోజకవర్గంలోని వ్యక్తికి రెండు మూడు బూత్‌లలో ఓటు హక్కు ఉంది.
ఇక ఇంటి నెంబర్లు అన్నీ తప్పుల తడకగానే ఉన్నాయి. ఎంతో మంది ఇళ్లు మారినా..ఓటు మారలేదు. ఒక వ్యక్తి ఓటు అతడు నివసిస్తున్న నియోజకవర్గంలోనే ఉండాలి. అలా కాకుండా పలు నియోజకవర్గాల్లో వేర్వేరు ఇంటి నంబర్లతో అదే ఫోటోతో నమోదై ఉండడం గమనార్హం. ఓటరు నమోదు ప్రక్రియ, ఓటరు లిస్టు సవరణలు నిర్వహించిన బూత్ లెవల్ అధికారి నుంచి ఎఈఆర్‌ఓ, ఈఆర్‌ఓ, సూపర్‌వైజర్లు నిర్లక్ష్యంగా..బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఇలా ఓటరు లిస్టులో పొరపాట్లు చోటుచేసుకున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఓటరు లిస్టులో తప్పులు కొన్ని మచ్చుకు పరిశీలిస్తే..
► నాంపల్లి నియోజకవర్గంలో వార్డు నంబర్ 12, సర్కిల్ నంబర్ 7లో పోలింగ్ బూత్ నంబర్ 16, సీరియల్ నంబర్ 152, ఇంటి నంబర్ 10–1–1148లో నివసించే నబీ షరీఫ్ ఫిబ్రవరి 27వ తేదీ 2018లో మరణించారు. మార్చి 3వ తేదీన జీహెచ్‌ఎంసీ వారు ఆయన మరణ ధృవీకరణ ప్రతం కూడా జారీ చేశారు. అయినా ఇతని పేరు..ఫోటో ఇంకా ఓటరు లిస్టులో ఉంది.
► నాంపల్లి నియోజకవర్గాంలోని బూత్ నంబర్ 16, సీరియల్ నంబర్ 555, ఇంటి నంబర్10–1–1183లో నివసించే రఫత్ ఉన్నీసా బేగం 2008, సెప్టెంబర్ 11వ తేదీన మరణించారు. ఆమె మరణించినట్లు జీహెచ్‌ఎంసీ ధృవీకరణ పత్రం కూడా జారీ చేసింది. అయినా ఇంకా ఓటరు లిస్టులో పేరు నమోదై ఉంది. అంటే గత పదేళ్లుగా ఓటరు లిస్టు నుంచి ఆమె పేరు తీసివేయలేదంటే సిబ్బంది పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
► నాంపల్లి నియోజకవర్గంలోని ఇంటి నంబర్11–1–889లో గంగారామ్ గత 40 ఏళ్లుగా నివసిస్తున్నారు. ఇతని ఇంట్లో లేని వారి పేర్లు కూడా ఓటరు లిస్టులో ఉన్నాయి. ఇదే ఇంటి నంబర్‌పై ఇతర మతస్తుల ఓట్లు కూడా నమోదై ఉన్నాయని గంగారామ్ కుమారుడు సన్నీ యాదవ్ ‘సాక్షి’తో వాపోయారు. ఈ విషయాన్ని పలుసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ ఇంటి నంబర్‌పై ఐదుగురు ఇతర మతస్తుల ఓట్లు నమోదై ఉన్నాయని చెప్పారు.
► కార్వాన్ నియోజకవర్గం..ఇంటి నంబర్ 9–4–84/44/302, పోలింగ్ బూత్ నంబర్ 158, సీరియల్ నంబర్ 1044లో ఓటరుగా నమోదు అయి ఉన్న సురేష్ పబ్బోజు..అదే ఫోటో, అదే పేరుతో నాంపల్లి నియోజకవర్గంలో ఇంటి నంబర్ 12–2–720/4,5, పోలింగ్‌బూత్ నంబర్ 217, సీరియల్ నంబర్ 1373 ఓటరు లిస్టులో కూడా నమోదై ఉన్నాడు. ఇతనికి రెండు నియోజకవర్గాల్లో ఓటు ఉన్నా ఎవ్వరూ గుర్తించలేదు.
► ఇక నాంపల్లి నియోజకవర్గంలోని ఇంటి నంబర్ 10–2–317/76లో నివసిస్తున్న ఎస్.మంజుల ఓటు పోలింగ్ బూత్ నంబర్ 28, సీరియల్ నంబర్ 645గా ఓటరు లిస్టులో నమోదై ఉంది. ఇదే మంజుల ఫోటోతో పోలింగ్ బూత్ నంబర్ 25, సీరియల్ నంబర్ 630లో కలీమాబేగం పేరుతో డూప్లికేట్ ఓటు ఉంది. దీన్ని కూడా ఎవరూ గుర్తించలేకపోయారు.
► ఇలా గ్రేటర్ వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటర్ల లిస్టులో తప్పులు, డూప్లికేట్ ఓట్లు, ఫోటోలు మారిన ఘటనలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు.