162 ఐక్యూ స్కోర్ సాధించిన పదేళ్ల బాలుడు
ఒక రంగంలో రాణించడాన్నే గొప్పగా చూసే రోజులివి. భారతీయ మూలాలున్న ఈ బ్రిటిష్ బాలుడు మాత్రం బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచి శెభాష్ అనిపించుకుంటున్నాడు. లండన్‌లోని హాన్‌స్లో ప్రాంతంలో నివసించే క్రిష్ అరోరాకు పియానో అంటే ఇష్టం. పియానో నేర్చుకుని ఏకంగా గ్రేడ్ 7 సరి్టఫికేట్ సాధించాడు. పియానో ఎంతబాగా వాయించగలడో చదరంగం అంతే బాగా ఆడగలడు. మానవ మేధస్సుకు కొలమానంగా చూసే ఇంటెలిజెంట్ కోషెంట్ (ఐక్యూ) పరీక్షలో ఏకంగా 162 స్కోర్ సాధించి ఔరా అనిపించాడు. ఇంతటి స్కోరు ప్రఖ్యాత భౌతిక శాస్తవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, విఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్‌కు కూడా సాధ్యపడకపోవడం విశేషం! ఈ అరుదైన ఫీట్‌తో క్రిష్ ప్రపంచంలోనే అత్యంత మేధావులైన ఒక శాతం మందిలో స్థానం సంపాదించాడని బ్రిటన్ వార్తాసంస్థ ‘మెట్రో’ పేర్కొంది. అత్యంత మేధావుల సంఘమైన ‘మెన్సా’లోనూ క్రిష్ చోటు సాధించాడు.
బ్రిటన్‌లోనే అత్యుత్తమ బోధన ప్రమాణాలు పాటించే క్వీన్ ఎలిజబెత్ గ్రామర్ స్కూల్‌లో వచ్చే ఏడాది చేరబోతున్నాడు. ‘‘11వ క్లాస్ సిలబస్ చాలా ఈజీగా ఉంది. పై తరగతులు నా సామర్థ్యాలకు సవాళ్లు విసురుతాయనుకుంటా. ప్రైమరీ స్కూల్ బోర్ కొట్టింది. ఎప్పుడూ కూడికలు, తీసివేతలు, గుణింతాలు, వాక్య నిర్మాణాలే. ఇప్పుడిక బీజగణితం పట్టుబడతా’’ అని క్రిష్ నవ్వుతూ చెప్పాడు. క్రిష్ తండ్రి మౌళి, తల్లి నిశ్చల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. నాలుగేళ్లప్పుడే తమవాడి అమోఘమైన జ్ఞాపకశక్తి, తెలివితేటలను గుర్తించామని వారు చెప్పారు. ‘‘నాలుగేళ్లకే అనర్గళంగా మాట్లాడేవాడు. తప్పుల్లేకుండా స్పెల్లింగులు చెప్పేవాడు. చక్కగా ఉచ్చరించేవాడు. ఓసారి నా పక్కన మూడు గంటలు కూర్చుని గణిత పుస్తకమంతా కంఠస్థం చేశాడు. ఏకసంథాగ్రాహి. నాలుగేళ్లకే దశాంశ స్థానాలకు లెక్కలు చేయడం మొదలెట్టి ఆశ్చర్యపరిచాడు. ఎనిమిదేళ్ల వయసులో ఒక ఏడాది సిలబస్‌ను ఒక్క రోజులో చదివేశాడు. ఏంచేసినా అత్యున్నత స్థాయి ప్రావీణ్యం చూపాలని ఆరాటపడతాడు’’ అని తల్లిదండ్రులు చెప్పారు.
ప్రఖ్యాత ట్రినిటీ కాలేజ్‌లోనూ..
పాఠశాలలో పుస్తకాలతో కుస్తీ పట్టడం మాత్రమే కాదు సంగీతం అన్నా క్రిష్‌కు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే పియానో నేర్చుకున్నాడు. పియానిస్ట్‌గా ఎన్నో అవార్డ్‌లు అందుకున్నాడు. పియానో వాయించడానికి సంబంధించి కేవలం ఆరు నెలల్లో నాలుగు గ్రేడ్లు పూర్తిచేశాడు. సంగీతానికి సంబంధించి అత్యున్నత కళాక్షేత్రంగా పేరొందిన ట్రినిటీ కాలేజ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సభ్యత్వం సాధించాడు. ప్రస్తుతం గ్రేడ్ 7 పియానో సరి్టఫికేట్ పొందాడు. తన కంటే వయసులో పెద్దవాళ్లతో పోటీపడుతూ వాళ్లను ఓడించి పతకాల పంట పండిస్తున్నాడు.
వెస్ట్ లండన్‌లో ఎన్నో పోటీల్లో పాల్గొన్నాడు. హిట్ సంగీతాన్ని వాయించేటప్పుడు చాలా మంది ఎదురుగా సంబంధిత నోట్‌ను రాసుకుంటారు. క్రిష్ ఎలాంటి నోట్ లేకుండానే అద్భుతంగా వాయించి ప్రేక్షకులు ప్రశంసలు పొందిన సందర్భాలు ఎన్నో. ‘‘ సంగీత పోటీల్లో నోట్స్ లేదని భయపడను. తప్పు చేయబోనని నాకు బాగా తెలుసు’’ అని క్రిష్ గతంలో చెప్పాడు. బాలమేధావి ‘యంగ్ షెల్డన్’ వెబ్ సిరీస్‌ను బాగా ఇష్టపడే క్రిష్ ఎక్కువగా పజిల్స్, పదవినోదం లాంటి వాటిని పరిష్కరించడం అలవాటు. చదరంగం మీద ఆసక్తి చూపడంతో ఒక టీచర్‌ను పురమాయించి నేరి్పంచారు. అయితే ఆ టీచర్‌నే తరచూ ఓడిస్తూ తన అద్భుత మేధను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు క్రిష్.
– లండన్
Comments
Please login to add a commentAdd a comment