iq
-
కోవిడ్-19 తగ్గినా..ఐక్యూ ముప్పు పెరిగింది!
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు నియంత్రణలో ఉన్నప్పటికీ, దీని బారినపడిన వారిని వెంటాడుతున్న లాంగ్ కోవిడ్ ముప్పు ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనాపై చేసిన పలు పరిశోధనలలో సార్స్- కోవ్-2 వైరస్ దీర్ఘకాలంలో హాని కలిగిస్తుందని తేలింది. దీని దుష్ప్రభావాలు గుండె, ఊపిరితిత్తులపై ఉంటాయని వెల్లడయ్యింది. కోవిడ్-19పై ఇటీవల జరిపిన అధ్యయనాలు కరోనా కారణంగా మెదడు సంబంధిత సమస్యల ముప్పును తెలియజేశాయి. కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన బాధితులలో చాలా మంది వ్యాధి నుంచి కోలుకున్నాక వారిలో జ్ఞాన సామర్థ్యం(ఐక్యూ) తగ్గిపోతున్నదని పరిశోధనల్లో తేలింది. నిపుణుల బృందం కోవిడ్-19 నుండి కోలుకున్న వారిలో ఒక ఏడాది తర్వాత వారి ఐక్యూ స్థాయిలో మూడు పాయింట్ల తగ్గుదలను కనుగొంది. ఇది మెదడు సంబంధిత ముప్పుపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందని నిపుణులు అంటున్నారు. మెదడు పనితీరులో తగ్గుదల జీవన నాణ్యతపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు తెలిపారు. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ పరిశోధనా వివరాలు ప్రచురితమయ్యాయి. -
మీరు తెలివైన వాళ్లని ఫీల్ అవుతున్నారా? ఈ లక్షణాలు ఉన్నాయా మరి
అందరికీ తెలితేటలుంటాయి. కానీ ఐక్యూ ప్రకారం కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో ఎక్కువగానూ తెలివితేటలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమను తాము తెలివైన వారిగా నిరూపించుకోవాలని తాపత్రయపడుతుంటారు. అయితే ఎదుటివారు మిమ్మల్ని తెలివైన వాళ్లుగా గుర్తించాలంటే ఏం చేయాలి? ఎలాంటి లక్షణాలు ఉంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నట్లు గుర్తిస్తారు? మరి మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? చెక్ చేసుకోండి.. ►వీళ్లు ఒక పనిపై గంటల సమయం దృష్టి కేంద్రీకరించగలరు. విషయం చిన్నదైనా వారి ఆలోచన మాత్రం పరిధికి మించి ఉంటుందట. ► ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ► దేన్నైనా ఓపెన్ మైండ్‌తో ఆలోచించేవారిలో ఐక్యూ కూడా ఎక్కువేనట. ► దేన్నైనా క్రియేటివ్‌గా, కొత్తగా ఆలోచిస్తారట. ► ఐక్యూ అధికంగా ఉండే వారు ఎక్కువగా సింగిల్‌గా ఉంటారట..వేరే వాళ్ల మీద ఆధారపడకుండా తమ సొంత ప్రెజెన్స్‌ని ఎంజాయ్ చేస్తారు. ► బ్యాలెన్స్డ్ థింకింగ్, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఏ సందర్భంలో అయినా నిగ్రహం కోల్పోకుండా సెల్ఫ్ కంట్రోల్‌తో ఉంటారట. వీళ్లు ఎక్కువ మాట్లాడటం కంటే అవతలి వాళ్లు చెప్పేది వినడానికి ఇష్టపడతారు. ► తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారు ఇంట్రోవర్ట్‌గా ఉంటారు. తొందరగా ఎవరితోనూ మాట్లాడరు, కలవరు. ►లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్స్‌ని సాధారణంగా తెలివైన వారుగా పరిగణిస్తారు. ► సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా వీరిలో ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా ఉంటారట. ► పగలు కంటే రాత్రిళ్లు ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడతారు. వీరిలొ ఐక్యూ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. -
చిన్న సినిమాలు సక్సెస్ కావాలి
‘‘చిన్న సినిమాలు సక్సెస్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది. లక్ష్మీపతిలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు. ‘ఐక్యూ’ సినిమా సక్సెస్‌తో ఆయన మరిన్ని సినిమాలు ప్లా¯Œ చేస్తున్నారు’’ అని నిర్మాత ప్రసన్న కుమార్ అన్నారు. సాయి చరణ్, పల్లవి జంటగా జీఎల్బీ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఐక్యూ’. కేఎల్పీ మూవీస్ పతాకంపై కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ–‘‘ఐక్యూ’ సినిమా కథ జనాలకు బాగా కనెక్ట్ అయింది.. అందుకే రెండో వారం కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది’’ అన్నారు. రచయిత ఘటికాచలం పాల్గొన్నారు. -
‘ఐక్యూ’ జనాలకు బాగా కనెక్ట్ అయింది: నిర్మాత లక్ష్మీపతి
సాయి చరణ్, పల్లవి జంటగా నటించిన చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్ ఆఫ్ ద స్టూడెంట్’ అన్నది ఉపశీర్షిక. జిఎల్బి శ్రీనివాస్ దర్శకత్వం కె.ఎల్.పి మూవీస్ పతాకంపై కాయగూరల లక్ష్మీపతి నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా రెండోవారం నడుస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో నిర్మాత మాట్లాడుతూ ‘సరైన థియేటర్లు దొరుకుతాయా లేదా అన్న డైలామాలో ఉన్నాం. కానీ మా సినిమాకు 99 థియేటర్లు దొరికాయి. సినిమా కథ జనాలకు బాగా కనెక్ట్ అయింది. రెండో వారం కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇదంతా బాలకృష్ణగారి వల్లే సాధ్యమైంది. నందమూరి కుటుంబంతో సినిమా చేయాలనుకున్నా. తారకరత్నగారితో సినిమా అనుకున్నా. ఆయన మరణించడంతో కుదరలేదు. త్వరలో నందమూరి ఫ్యామిలీ హీరోలతో ఓ సినిమా చేస్తా’అని అన్నారు. ‘చిన్న సినిమా సక్సెస్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది. లక్ష్మీపతిలాంటి నిర్మాతలు వస్తారు. ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం. ఈ సినిమా సక్సెస్‌తో మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు’ అని ప్రసన్నకుమార్ అన్నారు. డిఓపి సురేందర్‌రెడ్డి, అనంతపురం జగన్, చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
IQ Movie Review: ఐక్యూ సినిమా రివ్యూ
సినిమా : ఐక్యూ" " (పవర్ అఫ్ స్టూడెంట్స్) నటీ నటులు: సాయి చరణ్, పల్లవి, ట్ర్యాన్సీ,సుమన్, బెనర్జీ, సత్య ప్రకాష్, సూర్య,పల్లె రఘునాథ్ రెడ్డి, జబర్దస్త్ శేషు, గీతా సింగ్, లక్ష్మీ రావు, సత్తిపండు, జ్ఞానేశ్వర్ రావు, శీలం శ్రీనివాసరావు, సీఎం రెడ్డి, వాసు వర్మ, తదితరులు స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శ్రీనివాస్ GLB కథ, మాటలు, సంగీతం : పోలూరు ఘటికాచలం బ్యానర్ : కె. యల్. పి మూవీస్ సమర్పణ :కాయగూరల రాజేశ్వరి నిర్మాత : కాయగూరల లక్ష్మీ పతి కెమెరా : టి. సురేందర్ రెడ్డి సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ నటీనటులుగా జి.యల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన చిత్రం "ఐక్యూ" (పవర్ అఫ్ స్టూడెంట్స్). జూన్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.. కథ ఇది ఒక బ్రెయిన్‌కు సంబంధించిన సినిమా. మిడిల్ క్లాస్ అమ్మాయి భూమిక (పల్లవి) చాలా తెలివి గల అమ్మాయి. చిన్నతనం నుంచే యాక్టివ్‌గా ఉంటూ తనకున్న ఐక్యూతో కౌన్ బనేగా కరోడ్ పతి పోటీలో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకొంటుంది. ఆలా గెలుచుకున్న డబ్బును మిడిల్ క్లాస్ విద్యార్థుల చదువులకు ఖర్చు పెడుతుంది. తన పీ.హెచ్.డి అయిన తరువాత ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా జాయిన్ అయ్యి ఎంతోమంది విద్యార్థులను మేటి పౌరులుగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నిస్తుంది. మంచి తెలివి ఉన్నప్పటికీ అదే కాలేజీలో తన ఫ్రెండ్స్‌తో కలసి అల్లరి చిల్లరగా తిరుగుతున్న వివేక్ గ్యాంగ్‌కు ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తుంది. అలా వచ్చిన భూమికను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే భూమికను కిడ్నాప్ చేసి తన ప్రేమ విషయం చెప్పాలనుకుంటాడు. మరో వైపు తనలో ఉన్న ఐక్యూను చూసిన ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ అమ్మాయి మెదడును అమ్మడానికి ఒక డీల్ కుదుర్చుకొని కిడ్నాప్‌కు ప్లాన్ చేస్తాడు. ఇంతకీ భూమికను వివేక్ కిడ్నాప్ చేశాడా? లేక ప్రొఫెసర్ చేశాడా? ఆమెతో పాటు ప్రాజెక్ట్స్ వర్క్ చేసే అజయ్ చేశాడా? దాని వల్ల జరిగిన పరిణామాలు ఏంటి? ఈ కేసును పోలీసులు ఎలా చేధించారు? అనేది తెలుసుకోవాలంటే "ఐక్యూ" సినిమా చూడాల్సిందే! నటీ నటుల పనితీరు వివేక్ పాత్రలో నటించిన సాయి చరణ్‌కు ఇది మొదటి చిత్రమైనా బాగానే యాక్ట్ చేశాడు. మంచి ఐక్యూ ఉన్న అమ్మాయి భూమికగా పల్లవి తన పాత్రలో ఒదిగి పోయింది. భూమిక కేసును ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ కమిషనర్ పాత్ర పోషించిన సుమన్ నటన ఈ చిత్రానికే హైలెట్ అని చెప్పవచ్చు. మిగతా వారందరూ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతిక నిపుణుల పనితీరు "ఐక్యూ" అంటే మేధస్సుకు సంబంధించిన చిత్రం. అన్ని రంగాల్లో మాఫియా వచ్చింది. విద్యారంగంలో కూడా మాఫియా వస్తే స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? అనే కొత్త పాయింట్ సెలెక్ట్ చేసుకొని చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీనివాస్ GLB. ఎంటర్టైన్ చేసే విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. టి.సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. సీనియర్ రైటర్ ఘటికాచలం అందించిన మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. జీవితంలో అప్పుడప్పుడూ అల్లరి చేయచ్చు. కానీ జీవితమే అల్లరిపాలు కాకూడదు అనే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. శివషర్వాణి ఎడిటింగ్‌కు ఇంకాస్త కత్తెర వేయాల్సింది. ఈ సినిమా ద్వారా మంచి సందేశాన్ని అందించారు. చదవండి: శర్వానంద్ పెళ్లి సందడి షురూ -
ఈ వారం థియేటర్/ఓటీటీ అలరించే చిత్రాలివే!
ఈ ఏడాది వేసవిలో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పలు చిత్రాలు థియేటర్లతోపాటు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. జూన్ మొదటి వారంలోనూ చిన్న సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లతో ఓటీటీలో అలరించే చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. దగ్గుబాటి హీరో అహింస ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్ అహింస చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిరామ్‌కు జోడీగా గీతికా తివారీ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇది చదవండి: చాలా రోజుల తర్వాత అలాంటి చిత్రాన్ని చూశా: రాజమౌళి ప్రశంసలు) థ్రిల్లింగ్ కథతో.. స్టూడెంట్‌గా థియేటర్స్‌కు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు బెల్లకొండ గణేశ్. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లకొండ గణేశ్ హీరోగా ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన చిత్రం ‘నేను స్టూండెట్ సార్!’. ఇందులో అవంతిక దస్సాని హీరోయిన్గా నటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జూన్ 2న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఆసక్తి రేకెత్తించే ఐక్యూ సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ ముఖ్య తారలుగా జి.యల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్ ఆఫ్ స్టూడెంట్’ అనేది ఉపశీర్షిక. కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. కామెడీతో పరేషాన్ ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా, పావని కరణం హీరోయిన్గా రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వంలో తెర కెక్కిన చిత్రం ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పణలో వాల్తేర్ ప్రొడక్షన్స్‌పై విశ్వతేజ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా జూన్ 2న విడుదలవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ చక్రవ్యూహం సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత సావిత్రి నిర్మిస్తున్న చిత్రం "చక్రవ్యూహం" ది ట్రాప్. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి చెట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహిస్తున్నారు. అప్పట్లో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ చివరిసారిగా ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. (ఇది చదవండి: భారీ ధరకు ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్.. ఎన్ని కోట్లంటే?) ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే! నెట్‌ఫ్లిక్స్ ఫేక్ ప్రొఫైల్ -వెబ్‌సిరీస్- మే 31 ఎ బ్యూటిఫుల్ లైఫ్ -హాలీవుడ్- జూన్ 1 న్యూ ఆమ్స్టర్ డామ్ -వెబ్‌సిరీస్- జూన్ 1 ఇన్ఫినిటీ స్టోర్మ్ -హాలీవుడ్- జూన్ 1 స్కూప్ -హిందీ సిరీస్- జూన్ 2 మ్యానిఫెస్ట్ -వెబ్‌సిరీస్- జూన్2 జీ 5 విష్వక్ -తెలుగు- జూన్ 2 డిస్నీ+ హాట్‌స్టార్ సులైకా మంజిల్ -మలయాళం- మే 30 బుక్ మై షో ఈవిల్ డెడ్ రైజ్ -హాలీవుడ్- జూన్ 2 జియో సినిమా అసుర్ 2 -హిందీ సిరీస్- జూన్ 1 -
యూత్‌ఫుల్ ఐక్యూ
సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ ముఖ్య తారలుగా జి.యల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్ ఆఫ్ స్టూడెంట్’ అనేది ఉపశీర్షిక. కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. ‘‘మేధావి అయిన ఓ విద్యార్థిని మెదడును అమ్మడానికి వాళ్ల ప్రొఫెసర్ ఏ విధంగా ప్లాన్ చేశాడు? ఆ అమ్మాయిని హీరో ఎలా కాపాడాడు? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
పిల్లలు... పరిమళించాలి
పిల్లలు ఎలా ఉండాలి? వికసించే పువ్వుల్లా ఉండాలి. సంతోషానికి చిరునామాలా ఉండాలి. ఆందోళన అంటే ఏమిటో తెలియకుండా పెరగాలి. స్కూల్ బ్యాగ్‌లో భవిష్యత్తును నింపుకెళ్లిన పిల్లలు... అదే స్కూల్ బ్యాగ్‌లో భయాన్ని పోగుచేసుకుని వస్తే... తల్లిదండ్రులు అప్పుడేం చేయాలి? పిల్లలను దగ్గరకు తీసుకోవాలి... చేతల్లో ధైర్యాన్నివ్వాలి. ఆనందాల రెక్కలను విరిచేసే దుష్టశక్తుల బారి నుంచి కాపాడాలి. పువ్వుల్లా పరిమళించడానికి కావల్సినంత భరోసా కల్పించాలి. స్కూల్లో అందరు పిల్లలూ ఒకేలా చేరుతారు. స్నేహానికి చిరునామాల్లా, ఉత్సాహంగా ఉంటారు. కొందరు అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తుంటే, మరికొందరు మాత్రం వెనుకపడుతుంటారు. స్వతహాగా ఉండే ఐక్యూ లెవెల్స్ పరిమితులకు లోబడి చదువులో వెనుకబడడం కాదిది. ఉత్సాహంగా ఉంటే పిల్లలు కూడా నిరుత్సాహంగా మారి అన్నింటిలోనూ వెనుకబడుతుంటారు. ఆ వెనుకబాటు వెనుక వాళ్లను వెనుకపడేటట్లు చేసిన కారణం ఏదో ఉండే ఉంటుంది. ఎందుకు బిడియపడుతున్నారో, ఎందుకు తమను తాము ఒంటరిని చేసుకున్నారో బయటకు తెలియదు. ఆ పిల్లల ప్రవర్తనలో అనారోగ్యకరమైన మార్పు మొదలవుతుంది. అది క్రమంగా మొండితనానికి, ధిక్కారతకు దారి తీస్తుంటుంది. స్కూల్ డైరీలో ‘డిస్ ఒబీడియెంట్, ప్రాబ్లమాటిక్ బిహేవియర్ అనే పదాలతో పేరెంట్స్‌కి పిలుపు వస్తుంది. ఆ పరిస్థితి పేరెంట్స్‌కి ఊహించని శరాఘాతం. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని అయోమయంలో, కొంత అపరాధ భావానికి లోనయ్యి, ఓవర్‌గా రియాక్ట్ అవుతూ పిల్లలను దోషులుగా నిలబెడుతుంటారు. ఈ పరిస్థితిని జాగ్రత్తగా సరిదిద్దకపోతే పిల్లలు దిక్కారతను అలాగే కొనసాగిస్తారు. ఈ సిచ్యుయేషన్ని సున్నితంగా డీల్ చేయడానికి కొన్ని సూచనలు చేశారు క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ సుదర్శిని. పిల్లలు అద్దం వంటి వాళ్లు ‘‘పిల్లల్లో చురుకుదనం తగ్గడం, ఎప్పుడూ డల్‌గా ఉండడం, నిద్రలో ఉలిక్కి పడడం వంటివి కనిపిస్తుంటాయి. పిల్లల మనసులో చెలరేగిన అనేక ఆందోళనలు, భయాలు, అవమానం, అపరాధ భావం వంటి అనేక సమస్యలను వ్యక్తం చేసే లక్షణాలివి. ఈ లక్షణాలను గమనించిన తర్వాత ఇక ఆలస్యం చేయకూడదు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు దగ్గర కూర్చుని పిల్లలను మాటల్లో పెట్టాలి. నేరుగా ‘ఎందుకిలా ఉన్నావని’ అడిగే సమాధానం రాదు. స్కూలు గురించి, ఫ్రెండ్స్ గురించి కదిపితే వాళ్లే ఒక్కొక్కటీ చెప్పడం మొదలుపెడతారు. ఆ చెప్పిన కబుర్లలోనే కారణాలు ఉంటాయి. స్కూల్లో తోటి విద్యార్థులు బాడీ షేమింగ్, బుల్లీయింగ్, ఫిజికల్– ఎమోషనల్ అబ్యూజ్ చేస్తున్నట్లు, భయపెడుతున్నట్లు, బెదిరిస్తున్నట్లు అనిపిస్తే ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికి పిల్లలను ఒకటికి రెండుసార్లు గద్దించి అడగడం ఏ మాత్రం సరికాదు. పిల్లలు మరింతగా బిగుసుకుపోతారు, కాబట్టి వాళ్ల క్లాస్ టీచర్ దృష్టికి తీసుకువెళ్లాలి. అయితే ఇక్కడ మన పిల్లల్ని అబ్యూజ్ చేస్తున్న పిల్లలను దోషులుగా, నేరస్థులుగా చూడవద్దు. వాళ్లూ పసిపిల్లలేనని మర్చిపోవద్దు. అయితే వాళ్లు ఆరోగ్యకరంగా పెరగడం లేదని అర్థం. ఎందుకంటే... పిల్లలు తాము దేనిని తీసుకుంటారో దానినే డెలివర్ చేస్తారు. అమ్మానాన్నలు మరెవరినో ఉద్దేశించి ‘వాళ్ల ఎత్తుపళ్ల గురించో, నడక తీరు మీదనో, దేహం లావు– సన్నం, పొడవు, పొట్టి వంటి విషయాల్లో కామెంట్స్ చేసి నవ్వుతూ ఉంటే’ పిల్లలకు అదే అలవాటవుతుంది. పిల్లలు వాళ్లు చూసిన దాన్ని స్కూల్లో తోటి పిల్లల మీద ప్రదర్శిస్తారు. నిజానికి ఎదుటి వాళ్లను అనుకరిస్తూ గేలి చేయడం, లోపాలను ఎత్తి చూపుతూ ఎగతాళి చేయడం అనేది అభద్రతలో ఉంటూ, ఆత్మవిశ్వాసం లేని వాళ్లు చేసే పని. ఆ పని ఇంట్లో పేరెంట్స్ చేస్తుంటే పిల్లలకు అలవడుతుంది. బాల్యంలో ఇలాంటి బీజాలు పడితే ఇక అలాంటి వాళ్లు జీవితాంతం ఏదో ఒక సందర్భంలో ఈ లక్షణాలను బహిర్గతం చేస్తూనే ఉంటారు. జీవితంలో ప్రతి రిలేషన్షిప్కీ విఘాతం కలిగించుకుంటూ ఉంటారు. కాబట్టి చిన్నప్పుడే సరిదిద్దాలి. బొమ్మల్లో వ్యక్తమవుతుంది పిల్లలు మూడీగా ఉంటున్నట్లు గమనిస్తే వాళ్లను డ్రాయింగ్, క్లేతో బొమ్మలు చేయడంలో ఎంగేజ్ చేయాలి. ఇది మంచి స్ట్రెస్ బస్టర్ మాత్రమే కాదు, చక్కటి పరిష్కారమార్గం కూడా. బొమ్మలు వేయడం, బొమ్మలు చేయడం ఒత్తిడికి అవుట్లెట్లా పని చేస్తుంది. మాటల్లో చెప్పలేని విషయాలు బొమ్మల్లో వ్యక్తమవుతాయి. ఆ బొమ్మల్లోని పాత్రలు... పిల్లల్లో దాగి ఉన్న కోపాన్ని, ఇష్టాన్ని, అయిష్టాన్ని, భయాన్ని, బాధించే గుణాన్ని కూడా ప్రతిబింబిస్తుంటాయి. పిల్లల మానసిక సంఘర్షణకు అద్దం పడతాయి. పిల్లల మనసు చదవడానికి ఆ బొమ్మలు ఉపయోగపడతాయి. బాధించే పిల్లలు, బాధితులయ్యే పిల్లలను అధ్యయనం చేయడానికి కూడా ఇదే సరైన మార్గం. బిహేవియరల్ ప్రాబ్లెమ్స్‌తో మా దగ్గరకు తీసుకువచ్చిన పిల్లలకు మేమిచ్చే మొదటి టాస్క్ కూడా అదే. తల్లిదండ్రులకు సూచన ఏమిటంటే... పిల్లలు డల్‌గా ఉంటే ఉపేక్షించవద్దు, అలాగే మీ పిల్లల మీద టీచర్ నుంచి కంప్లయింట్ వస్తే ఆవేశపడవద్దు. టీచర్ ఒక సూచన చేశారంటే ఆ సూచన వెనుక బలమైన కారణం ఉండి తీరుతుందని గ్రహించాలి. టీచర్లు కూడా పిల్లల కాండక్ట్ మీద డిజ్ ఒబీడియెన్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్’ అని రాసే ముందు వాళ్ల పేరెంట్స్‌కు అర్థమయ్యేలా వివరించి చెప్పగలగాలి. ఎందుకంటే పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దగలిగేది పేరెంట్స్– టీచర్స్ మధ్య సమన్వయం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది’’ అని వివరించారు డాక్టర్ సుదర్శిని. పిల్లల మనసు సున్నితం. పువ్వులాంటి పిల్లలు పువ్వుల్లానే పెరగాలి. వారి భవిష్యత్తు సుమపరిమళాలతో వికసించాలి. బాధించే పిల్లల మీదా శ్రద్ధ పెట్టాలి! పిల్లల్లో స్వతహాగానే ఒకరికొకరు సహకరించుకునే తత్వం ఉంటుంది. అలాంటిది టీచర్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ సమాచారాన్ని కొందరికి తెలియచేసి, వాళ్లకు కోపం ఉన్న పిల్లలకు సమాచారం చేరనివ్వరు, ఆ టాస్క్‌లో ఫెయిల్ అవ్వాలనే దురుద్దేశంతో ఇలాంటి పని చేస్తారు. ఇది ఏ రకంగానూ పిల్లలను వెనకేసుకు రాదగిన విషయం కాదని పేరెంట్స్ గ్రహించాలి. బాధితులవుతున్న పిల్లల పేరెంట్స్ అయితే విషయం తెలియగానే స్పందించి తమ బిడ్డను కాపాడుకుంటారు. కానీ బాధించే పిల్లల తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంది. ఇది ఆ పిల్లలకు, సమాజానికి కూడా చాలా ప్రమాదకరం. – డాక్టర్ సుదర్శిని రెడ్డి సబ్బెళ్ల, క్లినికల్ సైకాలజిస్ట్, జీజీహెచ్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి -
‘ఐక్యూ’టీమ్‌తో మరో చిత్రం
కాయగూరల లక్ష్మీపతి నిర్మాతగా కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కెఎల్పి మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం2 చిత్రం అనౌన్స్మెంట్ నేడు ఫిల్మ్ ఛాంబర్లో జరిగింది. ఈ చిత్రానికి జిఎల్బి శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. వరికుప్పల యాదగిరి సంగీతాన్ని అందించారు. పోలూరి ఘటికాచలం కథ మాటలు అందించారు. ఈ బ్యానర్లో ఐక్యూ మొదటి చిత్రం పూర్తయి ఫస్ట్ కాపీ రావడంతో పాత్రికేయుల సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొని చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ... ‘ఐక్యూ’ చిత్రంలో ఉన్నవారినే ఈ చిత్రంలో తీసుకున్నాం. మెడికల్ కాన్సెప్ట్ మీద వస్తున్న చిత్రమిది. ‘ఐక్యూ’లాగే ఈ చిత్రాన్ని కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. ఈ నెల 19న ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది’ అన్నారు. ‘ఐక్యూ’ చిత్రం మొదటి కాపీ రావడం.. ఆదే బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2 కూడా అనౌన్స్మెంట్ చేయడం ఆనందంగా ఉంది’అని దర్శకుడు జీఎల్బీ శ్రీనివాస్ అన్నారు. ఈ చిత్రంలో నేను పోలీసు అధికారి పాత్ర పోషించాను. సినిమాను చాలా ఫాస్ట్‌గా పూర్తి చేశారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’అని హీరో సుమన్ అన్నారు. సుమన్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అని హీరో భూషన్ అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ అంకిత, బాబా, ల్లవి, పద్మిని, ప్రమోదిని, ట్రాన్సీ, పొట్టిమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
11 ఏళ్లకే ప్రపంచ మేధావులనే మించిపోయిన బుడతడు
ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న బుడతడి వయసు పట్టుమని పదకొండేళ్లు. బ్రిటన్‌కు చెందిన ఈ బాలుడి పేరు కెవిన్ స్వీనే. ఇతడి వయసు కొంచెమే గాని, తెలివితేటలు చాలా ఘనం. ఐక్యూలో ఏకంగా ఐన్‌స్టీన్‌ను, స్టీఫెన్ హాకింగ్‌ను సైతం అధిగమించి, అంతర్జాతీయ మేధావులంతా అవాక్కయ్యేలా చేసిన ఘనత ఇతడిది. ఐక్యూ పరీక్షల్లో 162 స్కోర్ సాధించి, ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌లను తలదన్నడంతో కెవిన్‌కు అంతర్జాతీయ మేధావుల సంస్థ ‘మెన్సా ఇంటర్నేషనల్’ నుంచి ప్రత్యేక ఆహ్వానం లభించింది. ‘మెన్సా ఇంటర్నేషనల్’లో సభ్యత్వం దక్కాలంటే, ఐక్యూ కనీసం 98 లేదా అంతకు మించి ఉండాలి. ఎడిన్‌బరోలో గత జూలై 16న జరిగిన ఐక్యూ పరీక్షకు హాజరైన కెవిన్, ఇందులో 162 స్కోర్ సాధించాడు. ఇదివరకు ఈ పరీక్షలో ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ 160 స్కోర్ సాధించగా, ఐన్‌స్టీన్ ఎప్పుడూ ఈ పరీక్షకు హాజరవలేదు. అయితే, శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఐన్‌స్టీన్ ఐక్యూ కూడా 160 ఉండేది. చదవండి: ఎక్కువసేపు కూర్చునే ఉంటారా? ఈ సమస్యలు తెలిస్తే.. స్థిమితంగా కూర్చోలేరేమో! -
సినిమాల్లో నటించడానికి మొదట్లో భయం వేసింది: సాయిచరణ్
సాయిచరణ్, పల్లవి, ట్య్రాన్సీ ముఖ్య తారలుగా శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఐక్యూ’. కాయగూరల లక్ష్మీపతి సమర్పణలో బొమ్మదేవర రామచంద్రరావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత కేఎస్ రామారావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఒకప్పుడు సినిమాలకు టెలివిజన్ ఒక్కటే విరోధి. ఇప్పుడు ఓటీటీ కూడా. కరోనా తర్వాత కొత్త సినిమాలు తీస్తున్న నిర్మాతలు ఆచితూచి అడుగులు వేయాలి. మంచి సబ్జెక్ట్‌తో వస్తోన్న ‘ఐక్యూ’ పెద్ద హిట్ కావాలి’’ అన్నారు కేఎస్ రామారావు. ‘యూత్‌పుల్ కంటెంట్‌తో వస్తోన్న ‘ఐక్యూ’ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు గంటా శ్రీనివాసరావు. ‘‘నాకు బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడంతో సినిమాల్లో నటించడానికి మొదట్లో భయం వేసింది. కానీ నటనపై ఉన్న ఆసక్తితో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి సత్యానంద్‌గారి దగ్గర యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుని ఈ సినిమా చేస్తున్నాను’’ అన్నారు సాయిచరణ్. ‘‘యూనిక్ సబ్జెక్ట్‌తో చేస్తోన్న మూవీ ‘ఐక్యూ’. ఇది మేధస్సుకు సంబంధించిన చిత్రం’’ అన్నారు దర్శక–నిర్మాత జీఎల్బీ శ్రీనివాస్. -
ఐన్‌స్టీన్, హాకింగ్‌లకన్నా ఈ చిన్నారి బుర్ర మరింత స్మార్ట్
మెక్సికో సిటీ: ఇంటెలిజెన్స్ కోషెంట్.. దీన్నే షార్ట్‌కట్‌లో ఐక్యూ అంటారు. ఇది ఎవరైనా ఒక వ్యక్తి తెలివితేటల స్థాయిని చెప్పే ఓ కొలమానం అనొచ్చు. సమస్యలను విశ్లేషించగల, పరిష్కరించగల సామర్థ్యానికి కొలమానం ఇది. అయితే ఇప్పటి వరకు అత్యధిక ఐక్యూ ఉన్న వారి జాబితాలో ప్రముఖ శాస్త్రవేత్తలు అల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫేన్ హాకింగ్‌లు ప్రథమ స్థానంలో ఉన్నారు. వీరి ఐక్యూ లెవల్స్ 160 వరకు ఉన్నట్లు ప్రచారం ఉంది. ఐక్యూ విషయంలో వీరిని మించిపోయింది మెక్సికన్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక. ఈ చిన్నారి ఐక్యూ ఏకంగా 162గా గుర్తించారు. ఆ వివరాలు.. మెక్సికోకు చెందిన అధారా పెరెజ్ (8) అనే చిన్నారి మెక్సికోలోని తలాహుక్ మురికివాడ ప్రాంతంలో నివసిస్తూ ఉండేది. అయితే మూడేళ్ల ప్రాయంలో ఉండగా అధారా అస్పెర్జర్ సిండ్రోమ్ (ఆటిజం కోవకు చెందిన వ్యాధి)బారిన పడింది. ఫలితంగా డిప్రెషన్‌తో బాధపడుతుండేది. స్కూల్‌కు వెళ్లడానికి కూడా ఇష్టపడేది కాదు. ఈ క్రమంలో అధారా తల్లిదండ్రులు ఆమెను థెరపీ కోసం సైక్రియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అధారాను పరీక్షించిన వైద్యులు చిన్నారిలో అసమాన తెలివితేటలు ఉండటం గమనించారు. (చదవండి: నో స్వెట్ సర్జరీ: గుండెపోటుతో యంగ్ బాడీ బిల్డర్ మృతి) ఈ క్రమంలో అధారాను టాలెంట్ కేర్ సెంటర్‌కు తీసుకెళ్లమని సూచించారు. అక్కడ అధారా ఐక్యూని పరీక్షించగా.. 162గా తేలింది. ఇక టాలెంట్ కేంద్రంలో ఒకే రకమైన స్కిల్స్ ఉన్న విద్యార్థులను చేర్చుకుని వారికి చదువు చెప్తారు. ఈ క్రమంలో అధారాను అక్కడ చేర్చుకున్నారు. (చదవండి: Albert Einstein Birth Anniversary: విశ్వనరుడు ఐన్‌స్టీన్) టాలెంట్ కేర్ సెంటర్లో చేరిన అధారా ఎనిమిదేళ్ల వయసు వచ్చే సరికే ఎలిమెంటరీ, మిడిల్, హై స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. అంతేకాక రెండు ఆన్లైన్ డిగ్రీలు పొందింది అధారా. తన అనుభవాల గురించి తెలియజేస్తూ.. ‘డు నాట్ గివ్ అప్’ పేరుతో పుస్తకం కూడా రాసింది. ఇక మానసిక వైకల్యం ఉన్న వారి ఎమోషన్స్‌ని నిత్యం పరిశీలించేందుకు గాను ఓ స్మార్ట్ బ్రాస్లెట్ని అభివృద్ధి చేసింది. ఆస్ట్రోనాట్ అయి అంతరిక్షం వెళ్లాలని.. అంగారకుడిపై వలస రాజ్యం స్థాపించాలనేది అధారా కోరిక. (చదవండి: ఖగోళ అద్భుతం: బ్లాక్ హోల్ వెనుక ఫస్ట్ టైం వెలుగులు) తన ప్రతిభ ఆధారంగా అధారా ఫోర్బ్స్ మెక్సికో 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా అధారా తల్లి మాట్లాడుతూ ‘‘అస్పెర్జర్ సిండ్రోమ్ కారణంగా బాల్యంలో నా కుమార్తె ఎవరితో త్వరగా కలిసేది కాదు. ఓ సారి తను ఓ చిన్న ఇంట్లో స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా.. ఫ్రెండ్స్ అధారాను గదిలో పెట్టి బంధించారు. బయట నుంచి తనను హేళన చేయసాగారు. ఆ రోజు నా కుమార్తె పడిన బాధ చూసి.. తనను ఒంటరిగా వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. ఈరోజు తన తెలివితేటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. -
చదువుకి వైద్యం
డాక్టర్ అవబోయి టీచర్ అవలేదు అనూరాధ. డాక్టర్ అయ్యాక.. టీచర్ అవ్వాలనుకుని చాక్‌పీస్‌తో చదువుకు వైద్యం చేయడానికి బయల్దేరారు. డాక్టర్ అనూరాధ కిశోర్, ఢిల్లీలో మంచి పేరున్న పీడియాట్రీషియన్. పిల్లల డాక్టర్‌గా పదిహేడేళ్ల అనుభవం ఆమెది. అలాంటి డాక్టరమ్మ ఓ రోజు టీచర్ ట్రైనింగ్ కోర్సు చేస్తానంటూ అప్లికేషన్ పెట్టుకున్నారు! ఆ మాట విన్న తోటి డాక్టర్లే కాదు, ఆమె అప్లికేషన్‌ను పరిశీలించి, ఆమోదించిన అధికారులు కూడా విపరీతంగా ఆశ్చర్యపోయారు. ఈవిడకిదేం పిచ్చి అని ముఖాన అనలేదన్నమాటే కానీ దాదాపుగా కొంచెం అటూఇటుగా వారందరి అభిప్రాయం ఇదే! చదువే అనారోగ్యమా? ఇంతకీ అనూరాధ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఉన్న కారణం... పిల్లలు తరచూ అనారోగ్యం పాలు కావడమే. పిల్లలంటే ఆమె పిల్లలు కాదు. ఆమె దగ్గరకు తల్లిదండ్రులు తెస్తున్న పిల్లలు. ఎన్ని పరీక్షలు చేసినా పిల్లల్లో ఫిజికల్‌గా అనారోగ్యం కనిపించేది కాదు. అయితే ఒత్తిడికి లోనవుతున్న లక్షణాలు కనిపించేవి. మానసికంగానే వారిని ఏదో పీడిస్తున్నట్లుండేది. ఈ వయసులో వాళ్లకు ఇంకేం బరువు బాధ్యతలుంటాయని పీడించటానికి? బహుశా వారిని భయపెడుతున్న భూతం చదువే కావచ్చు, వారు భయపడుతున్న బూచి స్కూలే కావచ్చు. స్కూలు ఎగ్గొట్టడానికి ఏదో ఒక నొప్పిని వాళ్లే వెతుక్కుంటూ ఉండవచ్చు. ఇవన్నీ తన ఊహాజనితమైన అనుమానాలేనా లేక పూర్తిగా నిజాలా? ఇది తెలియాలంటే స్కూలు ఎలాగుందో తెలుసుకోవాలి? పిల్లల మీద పాఠాల ఒత్తిడి ఎలా ఉంటోందో తెలుసుకోవాలి అనుకున్నారు డాక్టర్ అనూరాధ. ఆమె టీచర్ ట్రైనింగ్ కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి వెనుక ఇంత కథ ఉంది. పిల్లలవన్నీ సిక్ లీవులే! కోర్సు అయ్యాక, ఢిల్లీ సమీపంలోని గుర్‌గ్రామ్‌లోని ప్రోగ్రెసివ్ స్కూల్లో కిండర్‌గార్డెన్ టీచర్‌గా చేరారు అనూరాధ. క్లాస్‌రూమ్‌లో అడుగుపెట్టిన తరువాత ఆమెకి ఒక్కో సందేహానికీ సమాధానం దొరికింది. క్లాస్‌లో పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు వాళ్ల అటెండెన్స్ హిస్టరీని, హెల్త్హిస్టరీని పరిశీలించారామె. ఏ క్లాస్‌లో అయినా చదువులో చురుకైన పిల్లలతోపాటు, రమారమిగా చదివేవాళ్లు, ఒక మోస్తరుగా చదువుతూ బొటాబొటి మార్కులతో గట్టెక్కేవాళ్లు, పాస్‌మార్కులు తెచ్చుకోవడమూ కష్టమే అనిపించే పిల్లలూ ఉంటారు. చురుగ్గా ఉండే పిల్లలు, యావరేజ్‌గా చదివేవాళ్లలోనూ అభద్రత కనిపించడం లేదు కానీ అంతకంటే తక్కువ గ్రహింపు శక్తితో ఉన్న పిల్లల్లోనే అటెండెన్స్ తగ్గడం గమనించారామె. స్కూలుకి ఆబ్సెంట్ అయిన కారణాలు ‘అనారోగ్యాలే’ అయి ఉంటున్నాయి! తెలిసింది అడిగితే ఆత్మవిశ్వాసం యావరేజ్ పిల్లల్ని చురుకైన పిల్లలతో కలిపి పాఠాలు చెప్పి వదిలేస్తే కుదరదనుకున్నారామె. అలా చెప్పడం వల్ల చురుకైన పిల్లలు త్వరగా నేర్చుకుంటూ, టీచర్ అడిగిన ప్రశ్నకు టక్కున బదులిస్తూ, తోటి పిల్లల వైపు విజయగర్వంతో చూస్తుంటారు. టీచర్ యావరేజ్ స్టూడెంట్‌ని ప్రశ్న అడిగినప్పుడు ఆ పిల్లవాడు తనకు సమాధానం తెలియదనే భయంతో బిగుసుకుపోతుంటాడు. తరచూ ఇలా జరుగుతుంటే పిల్లల్లో న్యూనత పెరిగిపోతుంది, ముడుచుకుపోతారు. స్కూలంటేనే భయపడుతూ, మానేయడానికి దారులు వెతుక్కుంటారు. మరే కారణం చెప్పినా అమ్మానాన్నలు ఒప్పుకోరు కాబట్టి పొట్టలో నొప్పి, కాలు నొప్పి వంటి కారణాలు చెప్తారు. మరికొందరిలో పాఠాల ఒత్తిడి, స్కూలు భయంతో జ్వరం వస్తుంటుంది కూడా. అందుకే అలాంటి పిల్లలను ఎక్కువ సేపు ఆటపాటల్లో ఉంచుతున్నారు అనూరాధ. అంతకంటే ఎక్కువగా ఆమె ఒక విషయాన్ని నిశితంగా అధ్యయనం చేశారు. డల్ స్టూడెంట్స్‌లో ఎవరు ఏ పాఠాన్ని బాగా నేర్చుకున్నారో గమనించారు. క్లాస్‌లో వాళ్లను ఆ పాఠాల్లోని ప్రశ్నలే అడిగేవారు. దాంతో ఆ పిల్లల్లో టీచర్ ప్రశ్నలకు తాము కూడా సమాధానం చెప్పగలమని ఆత్మవిశ్వాసం కలిగింది. క్రమంగా స్కూలంటే భయం తగ్గడం మొదలుపెట్టింది. ఫస్ట్ ఎయిడ్ కూడా క్లాస్‌లోనే అనూరాధ క్లాస్‌లో పిల్లలంతా ఐదేళ్లలోపు వాళ్లే. ఆ వయసు పిల్లలు ఆటలాడుతూ దెబ్బలు తగిలించుకోకుండా ఉండరు. పిల్లల గాయాలకు అనూరాధ స్వయంగా మందురాసి కట్టు కట్టడాన్ని చూసిన తోటి టీచర్లు... ‘టీచరైనా మీలో డాక్టర్ ఎక్కడికీ పోలేద’ని చమత్కరిస్తుంటారు. అప్పుడామె ‘‘డాక్టర్ వైద్యాన్ని వదిలేయవచ్చేమో కానీ వైద్యం డాక్టర్ని వదిలి వెళ్లదు. స్టెతస్కోపు పక్కన పెట్టి బ్లాక్‌బోర్డు పక్కన నిలబడగలిగాను, కానీ గాయాన్ని చూసినప్పుడు డాక్టర్ బయటకు వస్తుంది’’ అంటారు. అనూరాధ టీచర్ చేస్తున్న ప్రాక్టీస్ మంచి ఫలితాలనే సాధిస్తోంది. పిల్లలకు చదువు చెప్పడం రాకపోతే పిల్లలు పేషెంట్లవుతారు. చదువు చెప్పే విధానానికే వైద్యం చేస్తే పిల్లలు హాస్పిటల్ ముఖం చూడకుండా పెరుగుతారు. అనూరాధ అధ్యయనంలో తెలిసిన సంగతి ఏమిటంటే... పిల్లలు స్కూలంటే ముఖం చాటేస్తున్నారంటే, లోపం ఉన్నది పిల్లల్లో కాదు. ఆడుతూ పాడుతూ, ఆటల్లో ఆటగా, పాటల్లో పాటగా పాఠాన్ని చెప్పడం తెలియని విద్యావిధానానిదే లోపం. ఆ విధానంలో చదువు చెప్తున్న స్కూళ్లదే అసలైన లోపం. ఆ లోపాన్ని సరిదిద్దడానికి టీచర్లే పూనుకోవాలి. ఐక్యూ వేరైనా ఒకేలా చూడాలి పిల్లలతో గడపడం నాకిష్టం, అందుకే పీడియాట్రీషియన్ కోర్సు చదివాను. ఇన్నేళ్ల పాటు నా దగ్గరకు వచ్చిన పిల్లలు పేషెంట్లు. ఇప్పుడు నాకు రోజూ ఉదయాన్నే పిల్లలు పువ్వుల్లా నవ్వుతూ పలకరిస్తున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. చదువంటే పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, క్లాస్ రూమ్‌లో పిల్లలందరినీ సమానం చేయగలగడం. నేనదే చేస్తున్నాను. నేను ఈ ఏడాది ఏప్రిల్‌లో టీచర్‌గా చేరాను. అప్పటి వరకు తరచూ స్కూలుకి ఆబ్సెంట్ అయిన పిల్లలెవరూ ఇప్పుడలా లేరు. స్కూల్‌ని ఇష్టపడుతున్నారు. – అనూరాధ – మంజీర -
11 ఏళ్ల బాలుడికి ఐన్‌స్టీన్ అంత ఐక్యూ!
నాగ్‌పూర్ : అఖిలేశ్ చందోర్కర్ అనే 11 ఏళ్ల నాగపూర్ బాలుడికి ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ అంతటి ఇంటెలిజెంట్ కోషియంట్(ఐక్యూ) ఉందని మెన్సా జరిపిన పరీక్షలో తెలిసింది.ఇతని ఐక్యూ రికార్డు స్థాయిలో 160 ఉంది. ఇది ఐస్‌స్టీన్, హాకింగ్‌ల ఐక్యూతో సమానం. జైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే అఖిలేశ్, విహారయాత్రకోసం కుటుంబంతో కలసి జూన్‌లో స్కాట్లాండ్ వెళ్లాడు. ఐక్యూ పరీక్ష మెన్సా రాశాడు. ‘నాకు 160 స్కోర్ వస్తుందని అనుకోలేదు. 140 స్కోర్ వస్తుందనుకున్నా. ఫలితాలకోసం ప్రతిరోజూ మెయిల్ చూసేవాడిని. కానీ మెన్సా నుంచి నాకు వింతగా సంప్రదాయ పోస్ట్ ద్వారా ఫలితాలు అందాయి’ అని అఖిలేశ్ చెప్పాడు. మెన్సా పరీక్ష : ప్రపంచంలో అత్యధిక ఐక్యూగలవారు సభ్యులుగా ఉండే మెన్సా ఇంటర్నేషనల్ ఎన్జీవో ఈ పరీక్ష నిర్వహిస్తుంది. దీన్ని ఆన్లైన్లో రాయొచ్చు. పరీక్షలో అత్యధిక ఐక్యూ సాధించిన తొలి రెండు శాతం మందికి మెన్సా సభ్యత్వం ఇస్తారు. -
తెలివైన పిల్లలు కావాలంటే పండ్లు తినాల్సిందే
టొరంటో: తల్లి కాబోయే వనితలారా వినండి! గర్భిణిగా ఉన్నప్పుడు పళ్లు ఎంత ఎక్కువగా తింటే, పిల్లలు అంత తెలివైన వాళ్లుగా పుడతారట. రోజుకు సగటును ఆరేడు పళ్లు తింటే జన్మించబోయే శిశువు ఐక్యూ (ఇంటెలిజెన్స్ కోషెన్సీ) స్థాయులు ఐదారు పాయింట్లు ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. కెనడాకు చెందిన 688 మంది చిన్నారుల సమాచారాన్ని విశ్లేషించి యూనివర్సిటీ ఆఫ్ అల్బెర్టా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఇలాంటి పిల్లల్లో జ్ఞాపకశక్తి కూడా అధికంగా ఉంటుందని పరిశోధనకు నేతృత్వం వహించిన పీయుష్ మదానే చెప్పారు. గర్భిణి పళ్లు తిన్నప్పుడు శిశువు మెదడులో ఐక్యూ స్థాయులను పెంచే జన్యువులు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నట్టు గుర్తించామని మదానే వివరించారు. -
ఐక్యూ బాగుంటేనే ఆరోగ్యం...
పరిపరి శోధన ఐక్యూ బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందట. తెలివితేటలు గల వారు సహజంగానే ఆరోగ్యంగా ఉంటారని, వారి జన్యువులు వ్యాధులను అంత తేలికగా దరిచేరనీయని తీరులో ఉంటాయని స్కాటిష్ పరిశోధకులు చెబుతున్నారు. బ్రిటన్‌లోని ‘బయో బ్యాంకు’లో నమోదైన లక్షమంది ఆరోగ్య సమస్యలు, వారి తెలివితేటల స్థాయి తదితర వివరాలపై కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ మేరకు నిర్ధారణకు వచ్చామని పరిశోదకులు అంటున్నారు. ఇదిలా ఉంటే, ఎడిన్బర్గ్ వర్సిటీ పరిశోధకులు చేపట్టిన వేరే అధ్యయనంలో కూడా ఇంచుమించు ఇలాంటి ఫలితాలే తేలడం విశేషం. చదువులో చురుగ్గా ఉండేవారికి తర్వాతి కాలంలో అల్జిమర్స్ వ్యాధి, పక్షవాతం, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వారి అధ్యయనంలో తేలింది. -
నాదీ, డార్విన్దీ ఒకటే ‘దిష్టి'క్!
నవ్వింత నాకు దిష్టి అనే కాన్సెప్ట్ మీద చాలా నమ్మకం. నరదిష్టి చాలా నీచమైనదనీ... పరదిష్టితో పతనావస్థ తప్పదనీ, నరదిష్టితో నాపరాళ్లయినా బద్దలైపోతాయని నా సిద్ధాంతం. పూర్తి నమ్మకం. ఇటీవల నావైన అనేకానేక కాన్సెప్ట్‌లను దెబ్బతీస్తున్నట్టే... ఈ దిష్టి అనేదాన్నీ భలే దెబ్బ కొట్టాడు మావాడు. అయితే అప్పటివరకూ దిష్టి ఒక మామూలు నమ్మకమేననీ, ఈ సెక్యులర్ లోకంలో ఎవరి నమ్మకాలు వాళ్లవి కాబట్టి, ఒకరి మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని అనుకుంటూ ఉండేవాణ్ణి. పైగా డార్విన్ గురించి ఒక ఉదాహరణ కూడా ఇచ్చేవాణ్ణి. జీవ పరిణామ సిద్ధాంతాన్ని చెప్పిన డార్విన్ తన పరిశోధనలో జీవికీ, జీవికీ మధ్యన ఎక్కడైనా లింకు దొరకకపోతే తెగ వెదికేవాడట. ‘అదేదో దైవ కృపవల్ల అలా పరిణామం జరిగిందని అనుకోరాదా’ అంటే... అలా కుదర్దు అనేవాడట. తీరా ఆ మిస్సింగు లింకు దొరికాక... ‘అంతా దేవుడి దయ’ అనేవాడట. ‘మళ్లీ ఇదేం విడ్డూరం’ అంటే... ‘సిద్ధాంతంలో తార్కికత తార్కికతే. దేవుడి పట్ల నమ్మకం నమ్మకమే’ అనేవాడట. అయితే ఇదిలా ఉండగా ఎదుటివాళ్ల మనోభావాలు దెబ్బతీయకుండానే వారి నమ్మకాలపై ఇంత దెబ్బ కొట్టొచ్చని మా బుజ్జిగాడు ఇటీవల నిరూపించాడు. ఈమధ్య మా బుజ్జిగాడూ, నేనూ కలిసి నేషనల్ జాగ్రఫిక్, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ ఛానెళ్లు తెగ చూస్తున్నాం. సింహాలు దేన్నైనా వేటాడాక, ఆ జంతువును తినే సమయంలో చుట్టూ దుమ్ములగొండ్లూ, నక్కలూ... కొండొకచో రాబందులూ తమ వంతుకోసం ఎదురుచూస్తూ ఉండటాన్ని గమనించి నన్ను ఒక ప్రశ్న అడిగాడు వాడు. ‘‘నాన్నా... ఇప్పుడా సింహం, దాని పిల్లలూ కలిసి మిగతావన్నీ ఆబగా చూస్తుండగా ఇలా తెగ తింటున్నాయి కదా. ఇవన్నీ సింహానికి దిష్టి పెడుతున్నట్టే కదా. నువ్వన్నట్టు దిష్టి అనేదే ఉంటే సింహానికీ, దాని పిల్లలకూ కడుపునొప్పి రావాలా, వద్దా?’’ అని అడిగాడు. ఒక్క క్షణం వాడేం చెబుతున్నాడో నాకు అర్థం కాలేదుగానీ... తీరా అర్థమయ్యాక గానీ వాడిది ఎంత గొప్ప లాజిక్కో అన్నది తెలియరాలేదు. ‘‘అది కాదురా... సింహానికి దిష్టి తగలడం, తిన్నది అరగక దానికి అసిడిటీ రావడం, పొట్ట రాయిలా మారడం, పులి తేన్పులు రావడం, గ్యాస్ పైకి తన్నడం అంటూ ఏవీ జరగవ్’’ అంటూ ఏదో వివరించబోయా. ‘‘అవును. అది రా-ఫుడ్డు రూపంలో పచ్చిమాంసం తింటుంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటుంది. రాఫుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదని నువ్వేగా చెప్పావ్. పైగా తన ఆహారానికి అది మసాలాలూ అవీ కలుపుకోదు కాబట్టి అసిడిటీ రాలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఇక అది తన ఫుడ్డులో ఉప్పు గట్రా ఏదీ కలుపుకోదు కాబట్టి దానికి బీపీ, గీపీ వచ్చే అవకాశాల్లేవు. పైగా మనలాగా ఫ్రిజ్టులో పెట్టుకుని పదిరోజుల తర్వాత తినకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్షుగా వేటాడి, తాజామాంసం తింటుంది కాబట్టి సింహానికి జబ్బులూ అవీ రావు. ఇక వేట కోసం జాగింగూ, రన్నింగూ తెగ చేసేస్తుంటుంది కాబట్టి బాడీకి మాంఛి ఎక్సరసైజు. కానీ అది తింటుండగా అన్నన్ని జీవులు పక్కనే చేరి చూస్తూ ఉన్నాయంటే, నీ సిద్ధాంతం ప్రకారం దానికి భయంకరంగా దిష్టి తగలాలా వద్దా? నువ్వే చెప్పు’’ అన్నాడు మా బుడ్డోడు. అక్కడితో ఆగలేదు వాడు. మొన్నటి నా ఒక తెలుగు పాఠం ఆధారాన్నే చూపిస్తూ ఇంకా కొనసాగించాడు... ‘‘అన్నట్టు నానా... అదేదో పద్యంలో లవణం... మెరుగుబంగారం అంటూ పోలిక పెడుతూ లవణమే గొప్ప అని చెప్పావు. ఉప్పు గొప్పదని చెప్పారు కాబట్టే దిష్టి తియ్యడం అన్నది దానితోనే జరగడం లేదనుకుంటా. అది చాలా చవక కాబట్టే ఇది కొనసాగుతోంది. కానీ... ఏదైనా కారణాల వల్ల ఒకవేళ బంగారంతోనే దిష్టి తియ్యాలనే సంప్రదాయం ఉండి, అలా దిష్టి తీశాక, సదరు గోల్డును గోదాట్లో పారేయాలనే కాన్సెప్టు ఉంటే ఈపాటికి దిష్టి అనే ఆ నియమమే కనుమరుగైపోయేది. డార్విన్ కూడా ‘అంతరించిపోయిన’వాటి జాబితాలో దిష్టిని వెతుక్కునేవాడు కదా నాన్నా’’ అన్నాడు. అంతే... నాకు ఇంకేం మాట్లాడాలో తెలియలేదు. మావాడి లాజిక్కు పుణ్యాన నాకో విషయం రూఢీ అయ్యింది. దిష్టి అనేది ఎంత మూఢనమ్మకమో తెలిసి వచ్చింది. వాడి ఆలోచనాధోరణి పట్ల అప్పటికి తెగ సంతోషమేసింది. ఈ సంతోష సమయాన్ని సెలబ్రేట్ చేసుకున్నా. ఉవ్వెత్తున ఎగసే అంతటి ఆనందాన్ని ఆపుకోలేక ఒక పని చేశా. ‘‘ఏయ్... వాడు నిద్రపోగానే... నాలుగు ఉప్పురాళ్లు తీసుకుని వాడికి దిష్టి తియ్’’ అంటూ మా ఆవిడకు ఓ ఆర్డరేశా. అవును... మా బుడ్డోడికీ, నా ఆనందానికీ నలుగురి దిష్టీ, నరదిష్టీ తగలకూడదన్న సత్సంకల్పమే మా బుజ్జిగాడికి దిష్టి తీయాలన్న పనికి నన్ను పురిగొల్పింది. అన్నట్టు... నావీ, డార్విన్వీ ఐక్యూలూ-అభిప్రాయాలూ, మేధస్సులూ-మనోభావాలు దాదాపుగా ఒకటే! - యాసీన్