నాదీ, డార్విన్‌దీ ఒకటే ‘దిష్టి'క్!
నవ్వింత
నాకు దిష్టి అనే కాన్సెప్ట్ మీద చాలా నమ్మకం. నరదిష్టి చాలా నీచమైనదనీ... పరదిష్టితో పతనావస్థ తప్పదనీ, నరదిష్టితో నాపరాళ్లయినా బద్దలైపోతాయని నా సిద్ధాంతం. పూర్తి నమ్మకం.
ఇటీవల నావైన అనేకానేక కాన్సెప్ట్‌లను దెబ్బతీస్తున్నట్టే... ఈ దిష్టి అనేదాన్నీ భలే దెబ్బ కొట్టాడు మావాడు. అయితే అప్పటివరకూ దిష్టి ఒక మామూలు నమ్మకమేననీ, ఈ సెక్యులర్ లోకంలో ఎవరి నమ్మకాలు వాళ్లవి కాబట్టి, ఒకరి మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని అనుకుంటూ ఉండేవాణ్ణి. పైగా డార్విన్ గురించి ఒక ఉదాహరణ కూడా ఇచ్చేవాణ్ణి. జీవ పరిణామ సిద్ధాంతాన్ని చెప్పిన డార్విన్ తన పరిశోధనలో జీవికీ, జీవికీ మధ్యన ఎక్కడైనా లింకు దొరకకపోతే తెగ వెదికేవాడట. ‘అదేదో దైవ కృపవల్ల అలా పరిణామం జరిగిందని అనుకోరాదా’ అంటే... అలా కుదర్దు అనేవాడట. తీరా ఆ మిస్సింగు లింకు దొరికాక... ‘అంతా దేవుడి దయ’ అనేవాడట. ‘మళ్లీ ఇదేం విడ్డూరం’ అంటే... ‘సిద్ధాంతంలో తార్కికత తార్కికతే. దేవుడి పట్ల నమ్మకం నమ్మకమే’ అనేవాడట. అయితే ఇదిలా ఉండగా ఎదుటివాళ్ల మనోభావాలు దెబ్బతీయకుండానే వారి నమ్మకాలపై ఇంత దెబ్బ కొట్టొచ్చని మా బుజ్జిగాడు ఇటీవల నిరూపించాడు.
ఈమధ్య మా బుజ్జిగాడూ, నేనూ కలిసి నేషనల్ జాగ్రఫిక్, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ ఛానెళ్లు తెగ చూస్తున్నాం. సింహాలు దేన్నైనా వేటాడాక, ఆ జంతువును తినే సమయంలో చుట్టూ దుమ్ములగొండ్లూ, నక్కలూ... కొండొకచో రాబందులూ తమ వంతుకోసం ఎదురుచూస్తూ ఉండటాన్ని గమనించి నన్ను ఒక ప్రశ్న అడిగాడు వాడు.
‘‘నాన్నా... ఇప్పుడా సింహం, దాని పిల్లలూ కలిసి మిగతావన్నీ ఆబగా చూస్తుండగా ఇలా తెగ తింటున్నాయి కదా. ఇవన్నీ సింహానికి దిష్టి పెడుతున్నట్టే కదా. నువ్వన్నట్టు దిష్టి అనేదే ఉంటే సింహానికీ, దాని పిల్లలకూ కడుపునొప్పి రావాలా, వద్దా?’’ అని అడిగాడు.
ఒక్క క్షణం వాడేం చెబుతున్నాడో నాకు అర్థం కాలేదుగానీ... తీరా అర్థమయ్యాక గానీ వాడిది ఎంత గొప్ప లాజిక్కో అన్నది తెలియరాలేదు.
‘‘అది కాదురా... సింహానికి దిష్టి తగలడం, తిన్నది అరగక దానికి అసిడిటీ రావడం, పొట్ట రాయిలా మారడం, పులి తేన్పులు రావడం, గ్యాస్ పైకి తన్నడం అంటూ ఏవీ జరగవ్’’ అంటూ ఏదో వివరించబోయా.
‘‘అవును. అది రా-ఫుడ్డు రూపంలో పచ్చిమాంసం తింటుంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటుంది. రాఫుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదని నువ్వేగా చెప్పావ్. పైగా తన ఆహారానికి అది మసాలాలూ అవీ కలుపుకోదు కాబట్టి అసిడిటీ రాలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఇక అది తన ఫుడ్డులో ఉప్పు గట్రా ఏదీ కలుపుకోదు కాబట్టి దానికి బీపీ, గీపీ వచ్చే అవకాశాల్లేవు. పైగా మనలాగా ఫ్రిజ్టులో పెట్టుకుని పదిరోజుల తర్వాత తినకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్షుగా వేటాడి, తాజామాంసం తింటుంది కాబట్టి సింహానికి జబ్బులూ అవీ రావు. ఇక వేట కోసం జాగింగూ, రన్నింగూ తెగ చేసేస్తుంటుంది కాబట్టి బాడీకి మాంఛి ఎక్సరసైజు. కానీ అది తింటుండగా అన్నన్ని జీవులు పక్కనే చేరి చూస్తూ ఉన్నాయంటే, నీ సిద్ధాంతం ప్రకారం దానికి భయంకరంగా దిష్టి తగలాలా వద్దా? నువ్వే చెప్పు’’ అన్నాడు మా బుడ్డోడు.
అక్కడితో ఆగలేదు వాడు. మొన్నటి నా ఒక తెలుగు పాఠం ఆధారాన్నే చూపిస్తూ ఇంకా కొనసాగించాడు... ‘‘అన్నట్టు నానా... అదేదో పద్యంలో లవణం... మెరుగుబంగారం అంటూ పోలిక పెడుతూ లవణమే గొప్ప అని చెప్పావు. ఉప్పు గొప్పదని చెప్పారు కాబట్టే దిష్టి తియ్యడం అన్నది దానితోనే జరగడం లేదనుకుంటా. అది చాలా చవక కాబట్టే ఇది కొనసాగుతోంది. కానీ... ఏదైనా కారణాల వల్ల ఒకవేళ బంగారంతోనే దిష్టి తియ్యాలనే సంప్రదాయం ఉండి, అలా దిష్టి తీశాక, సదరు గోల్డును గోదాట్లో పారేయాలనే కాన్సెప్టు ఉంటే ఈపాటికి దిష్టి అనే ఆ నియమమే కనుమరుగైపోయేది. డార్విన్ కూడా ‘అంతరించిపోయిన’వాటి జాబితాలో దిష్టిని వెతుక్కునేవాడు కదా నాన్నా’’ అన్నాడు.
అంతే... నాకు ఇంకేం మాట్లాడాలో తెలియలేదు.
మావాడి లాజిక్కు పుణ్యాన నాకో విషయం రూఢీ అయ్యింది. దిష్టి అనేది ఎంత మూఢనమ్మకమో తెలిసి వచ్చింది. వాడి ఆలోచనాధోరణి పట్ల అప్పటికి తెగ సంతోషమేసింది. ఈ సంతోష సమయాన్ని సెలబ్రేట్ చేసుకున్నా. ఉవ్వెత్తున ఎగసే అంతటి ఆనందాన్ని ఆపుకోలేక ఒక పని చేశా.
‘‘ఏయ్... వాడు నిద్రపోగానే... నాలుగు ఉప్పురాళ్లు తీసుకుని వాడికి దిష్టి తియ్’’ అంటూ మా ఆవిడకు ఓ ఆర్డరేశా.
అవును... మా బుడ్డోడికీ, నా ఆనందానికీ నలుగురి దిష్టీ, నరదిష్టీ తగలకూడదన్న సత్సంకల్పమే మా బుజ్జిగాడికి దిష్టి తీయాలన్న పనికి నన్ను పురిగొల్పింది.
అన్నట్టు... నావీ, డార్విన్‌వీ ఐక్యూలూ-అభిప్రాయాలూ, మేధస్సులూ-మనోభావాలు దాదాపుగా ఒకటే!
- యాసీన్