వాషింగ్టన్/బీజింగ్: ప్రపంచ పాలిట పెనుగండంగా మారిన కరోనా మహమ్మారి చైనాలోని వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(వూహాన్ ల్యాబ్)లోనే పుట్టిందా? అది నిజం కాదని చైనా నమ్మబలుకుతున్నప్పటికీ వైరస్ అక్కడే పుట్టిందని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. కరోనా వైరస్ జన్మస్థానం వూహాన్ ల్యాబ్ అని చెప్పడానికి మరో కీలక ఆధారం లభించింది. డ్రాగన్ దేశంలో కరోనా మహమ్మారి ఉనికిని చైనా ప్రభుత్వం 2019 ఆఖరులో బయటపెట్టిన సంగతి తెలిసందే. అప్పటికి కొన్ని వారాల ముందే.. అంటే 2019 నవంబర్‌లో వూహాన్ ల్యాబ్‌లో పనిచేసే ముగ్గురు పరిశోధకులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందారట. అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థ వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక ఈ విషయాన్ని సోమవారం వెల్లడించింది.
ఇంకా బహిర్గతం చేయని అమెరికన్ ఇంటెలిజెన్స్ డాక్యుమెంట్‌లోని అంశాలను ప్రస్తావిస్తూ వూహాన్ ల్యాబ్ పరిశోధకుల అనారోగ్యం, చికిత్స వివరాలను తెలిపింది. వారు కరోనా కారణంగానే అనారోగ్యం పాలై, ఆసుపత్రిలో చేరినట్లు విశ్వసనీయ సమాచారం ఉన్నట్లు పేర్కొంది. వూహాన్ ల్యాబ్ నుంచే వైరస్ బయటకు వచ్చిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఆరోపించిన విషయం తెలిసిందే. కోవిడ్–19 పుట్టుకను తేల్చే పనిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిమగ్నమయ్యింది. త్వరలో దీనిపై కీలక సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో అమెరికా మీడియా సంస్థ నివేదిక బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అందుకు ఆధారాల్లేవ్: చైనా
కరోనాపై వాల్‌స్ట్రీట్ జర్నల్ తాజా నివేదికను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ ఖండించారు. వూహాన్ ల్యాబ్‌లో సున్నా కోవిడ్–19 ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు అదే ల్యాబ్ మార్చి 23న విడుదల చేసిన ఒక నివేదికలో స్పష్టం చేసిందని గుర్తుచేశారు. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌లో పుట్టిందనడానికి ఆధారాల్లేవని పేర్కొన్నారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదికలో ప్రస్తావించినట్లు ముగ్గురు పరిశోధకులు అనారోగ్యం పాలయ్యారనడం ఎంతమాత్రం నిజం కాదని వెల్లడించారు. వూహాన్ ల్యాబ్‌లో పనిచేసే వారిలో ఇప్పటిదాకా ఎవరికీ కరోనా సోకలేదని తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment